cloudburst rains
-
Himachal: కుంభవృష్టితో 50 మంది గల్లంతు
ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని షిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 50 మంది గల్లంతై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నలుగురి మృతదేహాల్ని హిమాచల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంలు వెలికి తీశాయి. మిగతా వాళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది.గురువారం వేకువజామున ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ కమిషనర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సహా ఇతర సహాయక సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. #WATCH | Himachal Pradesh | The SDRF team at the spot in Shimla for the search and rescue operation where 36 people are missing and 2 bodies have been recovered so far after a cloudburst in the Samej Khad of Rampur area in Shimla district. (Visual source - CMO) pic.twitter.com/WqF6vDk4Tx— ANI (@ANI) August 1, 2024 -
గ్లూమీ.. గ్లూమీ సార్లు మస్తుగున్నరు
ఇప్పుడు మనం ఓ గాడిద కథ చెప్పుకుందాం.. ప్రాచీన గ్రీసు దేశంలో డెమాస్తనీస్కు మహావక్తగా మంచి పేరుండేది. ఆయనోసారి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పన్నులు.. ఇలా చెప్తుంటే జనంలో కాస్త అలజడి, గందరగోళం కనిపించాయి. వాళ్ల అనాసక్తి గ్రహించిన డెమాస్తనీస్.. వెంటనే ప్రసంగం ఆపి మీకు ఒక కథ చెబుతాను వినండి అంటూ మొదలుపెట్టాడు. ‘‘ఇద్దరు వ్యక్తులు వేసవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒకడి దగ్గర గాడిద ఉంది. మరొకడికి దాని అవసరం ఉంది. దాన్ని అమ్ముతావా అని అడిగాడు. ఇద్దరూ మాట్లాడు కున్నారు. బేరం కుదిరింది. అమ్మకం అయిపోయింది.. వారు వాళ్ల ప్రయాణం కొనసాగిస్తున్నారు. అసలే వేసవి ఎండ ఎక్కువగా ఉండి.. ఓ దగ్గర ఆగారు. గాడిద నిలబడి ఉండగా దాని నీడలో అమ్మిన వ్యక్తి కూర్చున్నాడు. కొన్నా యనకు మండుకొచ్చింది. కొనుక్కున్న నేను ఎండలో ఉండాలి అమ్మినవాడు నీడలోకూర్చుంటాడా? అని ఆర్గ్యు చేశాడు. ‘నువ్వు లే నేను కూర్చుంటా’నని గదమాయించాడు. చదవండి: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అమ్మిన వ్యక్తి బాగా తెలివైన వాడు.. ‘నేను గాడిదను అమ్మాను గానీ నీడను కాదు.. నీడ నాదే..’ అంటూ తన లాజిక్ వదిలాడు.. ఇంకేం తగువు మొదలైంది. నలుగురూ చుట్టూ చేరారు. వాదులాట పెరిగింది. గాడిద–నీడ సమస్య పరిష్కరించడంలో అందరూ మునిగిపోయారు’’ అని చెప్పడం ఆపేశాడు డెమాస్తనీస్. వింటున్న జనంలో ఆసక్తి మొదలైంది. వాళ్లలో వాళ్లు గాడిద గొడవపై మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ పరిష్కారమేమైంది? ఏం తేల్చారు? అని డెమాస్తనీస్ను అడగడం మొదలుపెట్టారు. అసలు తమ బతుకు సంగతి చెబితే పట్టని జనం గాడిద గొడవ చర్చించడం చూసి డెమాస్తనీస్ నవ్వి ఊరుకున్నాడు. ఆ గాడిద గొడవ తేలేది కాదు కాబట్టి, మనమూ వదిలేద్దాం. జనాన్ని మనకు అనుకూలమైన చర్చ వైపు నెట్టడమే కదా.. మంచి వక్త నేర్పరితనం. చుట్టూ వరదలున్నా గ్లూమీ.. గ్లూమీ సమాచారంతోనైనా మనకు ఇష్టమైన దారిలోకి ‘మంద’ను మళ్లించడమే కదా.. అసలైన పొలిటీషియన్ టెక్నిక్.. చర్చ గాడిదల వైపు కావచ్చు.. విదేశీ కుట్రల వైపూ కావచ్చు.. జనం ‘కళ్ల నిండా కాళేశ్వరం’ చూసి కంగారు పడో, కడుపు మండో ‘విదేశీ కుట్ర’ అని ఒక మాట అనరా.. బరాబర్ అంటారు ఆయన.. ఇంకా ‘విదేశీ కుట్ర’ అన్నారాయన. ఈ విషయంలో సొంత ప్రభుత్వంపైన అనుమానాలున్నవారు కూడా ఉన్నారు. ఇట్లా రండి అలా సోషల్ మీడియాలో దూరుదాం.. సిడ్నీ.. స్వదేశీ కుట్ర కొద్దిరోజుల క్రితం.. సిడ్నీలో భారీ వర్షాలు పడ్డాయి. ఎంతగా అంటే ఎనిమిది నెలల వర్షం నాలుగు రోజుల్లో దంచేసింది. సహజంగానే పెను నష్టం వాటిల్లింది. ఇంకేం రకరకాల సిద్ధాంతాలు నిద్ర లేచాయి. ప్రభుత్వం చేపట్టిన ‘క్లౌడ్ సీడింగ్’ దానికి కారణమని ప్రచారమైంది. ఆ స్థాయిలో వర్షాలు తెచ్చే క్లౌడ్ సీడింగ్ భౌతికంగా, ఆర్థికంగా సాధ్యం కాదని గవర్నమెంట్ చెప్పినా.. అ వాయిస్ జనానికి చేరేలోపు.. లక్షల్లో వ్యూస్ నమోదయ్యాయి. రాడార్ చిత్రాలు, మేఘాలలో వింత ఆకారాల ఫొటోలు.. విమానం ఎగరడాలు.. ఇలా ఏవేవో ఆధారాలు చూపుతూ.. అది ప్రభుత్వం ప్రజలపై వేసిన ‘వెదర్ బాంబే..’ అనేయడం మొదలుపెట్టారు. ఇదంతా న్యూస్ చానళ్లలో, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. వాతావరణ నిపుణులు శాస్త్రీయ కారణాలు చెప్పినా ఎవరూ వినలేదు.. అంతా అధికార పక్షం చేసినదేంటూ ఢంకా బజాయించారు... దీనికన్నా మనం విన్న ‘విదేశీ కుట్రే’ నయం కదా.. థాయ్‌లాండ్.. వరద రాజకీయాలు 2011లో ఇక్కడ వచ్చిన వరదలు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ‘నష్టం’గా పేర్కొంటారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు కొనసాగాయి. జనవరి 2012 వరకు కూడా అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఆ వరదల ప్రభావం ఎంతో. ఆ వరదలు బ్యాంకాక్‌ను కూడా చుట్టుముట్టాయి. 20వేల చదరపు కిలోమీటర్ల మేర పంట పొలాలు నీట మునిగాయి. 13.6 మిలియన్ల జనాభా ముంపు ప్రభావానికి లోనయింది. అనేక పరిశ్రమలు నీట మునిగాయి. లక్షన్నరకుపైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆర్థికంగా జరిగిన నష్టం 46.5 బిలియన్ డాలర్లు.. ఇంత విధ్వంసానికి కారణం ‘ప్రకృతి ప్రకోపం’ అన్న పాయింట్ పక్కకుపోయింది.. చర్చలన్నీ రాజకీయం చుట్టే తిరిగాయి. ఎందుకంటే అచ్చంగా ఎన్నికల ప్రచార సమయంలో వరదలు వచ్చాయి. ‘తాము ఎలాగూ ఓడిపోతామని తెలిసిన అధికార పక్షం డ్యాములను ఖాళీ చేయకుండా ఊరుకుందనీ.. తర్వాత వానలతో డ్యాములన్నీ నిండా మునిగి ఊర్లకు ఊర్లు నీటిలో కొట్టుకుపోయాయని విపక్షం వాదనకు దిగింది. ‘వరదల పెను నష్టంతో రానున్న ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేయాలని.. రాజకీయంగా తమను, ఆర్థికంగా ప్రజలను కుదేలు చేయాలనే కుట్రతోనే ఇదంతా జరిగిందని..’ ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది. కొన్నేళ్ల పాటు ఆ దేశంలో ఈ చర్చ జరిగింది.. ‘‘అధికార పక్షానికి అంత తెలివి లేదు. వరదలను సరిగ్గా మేనేజ్ చేయకపోవడం వల్లే ఈ దురవస్థ’’ అని అక్కడి వామపక్ష మేధావులు చెప్పినా ఎవరూ వినలేదు. విపక్షాలపై కుట్రతోనే తమ ప్రజలకు భారీ నష్టాన్ని కలిగించారని బలమైన వాదన జనంలోకి పోయింది. ..ఇదీ స్వదేశీ వరద రాజకీయమే. అవకాశం రావాలేగానీ.. వరదలు, విపత్తులు, మహమ్మారులు వేటినీ వదలడం లేదు. కుట్ర కోణాలు, రాజకీయాలు, సొంత అవసరాలు వాటిని అంటుకునే తిరుగుతున్నాయి. 2011లో జపాన్‌లో తారస్థాయిలో వచ్చిన భూకంపం ఏకంగా సునామీనే సృçష్టించింది. 30 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడి.. ఫుకుషిమా పవర్ ప్లాంట్‌లో ‘అణు’ ప్రమాదానికి దారి తీసింది. ఇదంతా ప్రకృతి విలయంగా ప్రపంచం భావిస్తుండగా.. ‘ఠాట్!.. అంతా తప్పు. దీనికి ఇజ్రాయెల్ చేసిన అణు విస్పోటనమే కారణమని.. ఇరాన్ కోసం çజపాన్ యురేనియం శుద్ధి చేయకుండా అడ్డుకునే పనే’నని జపాన్‌లో బాగా నమ్మిన వారున్నారు. 2004లో ఇండోనేసియాలో 9.1–9.3 తీవ్రతతో భూకంపం, సునామీ వచ్చినప్పుడు 14 దేశాల్లో 2,27,000 మందికిపైగా మరణించారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి పనేనని ప్రచారమైంది. తూర్పు ఆసియా ప్రాంత ఆర్థిక ప్రగతిని తగ్గించడానికి అమెరికా చేసిన పనేనని బలంగా నమ్మారు. అక్కడ కనిపించిన అమెరికా యుద్ధనౌకను ఆధారంగా చూపారు. గతంలో ఎప్పుడూ అక్కడ భూకంపాలు రాలేదని నిరూపించే ప్రయత్నం చేశారు.. ఇలాంటి సిద్ధాంతాలకు వందలకొద్దీ ఆధారాలు (?) గుప్పించడం కూడా సామాన్య జనానికి అది నిజమేనని అనిపించేలా చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి అమెరికా అణుబాంబు ఇప్పుడు పేలిందని కొందరు అనుమానాలు వ్యక్తీకరించారు. పాకిస్తాన్ టార్గెట్‌గా ఇండియా చేస్తున్న అణు పరీక్షలే దానికి కారణమని మనవైపూ అనుమానంగా చూసినవారూ ఉన్నారు. .. చివరికి భూమి భ్రమణాన్ని మార్చేందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని నమ్మి ప్రచారం హోరెత్తించిన వారూ ఉన్నారు. ఇలా అనుమానాలు, కుట్ర కోణాల సిద్ధాంతాలు, వాటికి తగిన ఆధారాలను పుంఖానుపుంఖాలుగా జనం నెత్తిన రుద్దేవారెవరూ నిపుణులో, శాస్త్రవేత్తలో కాదు.. గ్లూమీ, గ్లూమీగా విషయం తెలిసినవారే. అప్పటి అవసరాలు, పాలిటిక్స్ కోసం జనం ముందుకు తెచ్చినవారే. ఇది బాగుంది... శుక్రవారం మళ్లీ వర్షాలు మొదలు కావడంతో సోషల్ మీడియాలో కనిపించిన జోక్.. ఇది కూడా బాగుంది... ఈ మధ్య వరదలు, వ్యాఖ్యలు చూస్తుంటే గుర్తొస్తుందంటూ ఓ మిత్రుడు చెప్పిన కామెంట్.. ప్రముఖ అమెరికన్ రచయిత, కాలమిస్టు, వక్త, యాక్టివిస్టు జిమ్ హైటవర్.. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌పై వేసిన చురక ఇది.. ‘అజ్ఞానం బ్యారెళ్ల లెక్కన అమ్మే వీలుంటే.. జార్జి బుష్ బుర్ర డ్రిల్లింగ్ హక్కులు సంపూర్ణంగా నేనే కొనుక్కుంటా..’ .. ఆహా.. నిజమే ఇలాంటి మార్కెట్ ఉంటే బాగుండు.. సహజ వనరులున్న బుర్రలు మనకు అనేకం ఉన్నాయి కదా.. -సరికొండ చలపతి -
వరద భారతం.. సవాల్‌గా మారిన క్లౌడ్ బరస్ట్‌లు, ఆకస్మిక వరదలు
వానలు దంచికొడుతున్నాయి. ఏ రాష్ట్రాన్ని చూసినా వరదలు ముంచేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని లోతట్టు ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. అత్యంత ఆధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలున్నా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమర్థ ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమవుతూనే ఉన్నాం. కొన్నేళ్లుగా దేశంలో వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాలు, ఏడాది మొత్తంలో కురవాల్సిన వాన ఒకట్రెండు రోజుల్లోనే పడటం వంటివి సవాలుగా మారాయి. 2010 నుంచి 2021 దాకా తుపాన్లకు బలవుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. 2013 నుంచి భారీ వర్షాలు వరదలతో ఏటా సగటున వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థ పనితీరు ఇలా... భారత్‌లో ప్రకృతి వైపరీత్యాలను ముందే తెలుసుకొని అప్రమత్తం కావడానికి తగిన వ్యవస్థ అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితుల్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నదులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తదితరాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షిస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా 20 నదీ తీర ప్రాంతాల్లో దాదాపుగా 1,600 హైడ్రో మెట్రాలజికల్ స్టేషన్లు సీడబ్ల్యూసీ నిర్వహణలో ఉన్నాయి. ఇవన్నీ రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను గుర్తిస్తూ విపత్తు నిర్వహణ సంస్థల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. వరద బీభత్సంతో ముంపు సమస్యలు తలెత్తేలా ఉంటే హెచ్చరించడానికి గూగుల్‌తో సీడబ్ల్యూసీ ఒప్పందం కుదుర్చుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఐఎండీ 33 రాడార్ నెట్వర్క్ స్టేషన్లను నిర్వహిస్తూ వాతావరణ సూచనలు చేస్తుంటుంది. వరద పరిస్థితుల అంచనాకు 14 ప్రాంతాల్లో ఫ్లడ్ మెట్రాలజికల్ ఆఫీసులు (ఎఫ్‌ఎంఒ)న్నాయి. కచ్చితత్వాన్ని మరింత పెంచేలా వీటిని మెరుగు పరచాల్సిన అవసరముంది. 2016లో వార్దా తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ముంచేస్తుందని భారత వాతావరణ శాఖ చెబితే, యూరోపియన్ మోడల్ మాత్రం చెన్నై వైపు వెళ్తుందని కచ్చితంగా అంచనా వేసింది. గత మే నెలలో అసాని తుపాను ఒడిశా, బెంగాల్‌వైపు వెళ్తోందని ఐఎండీ చెప్పగా యూరోపియన్ మోడల్ మాత్రం ఏపీ వైపు మళ్లుతుందని కచ్చితంగా అంచనా వేసింది. ముంచేస్తున్న ఆకస్మిక వరదలు క్లౌడ్ బరస్ట్‌లతో ఏర్పడే ఆకస్మిక వరదలు కొద్ది కాలంగా విపత్తు నిర్వహణ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. భారత వాతావరణ శాఖ, అమెరికా జాతీయ వాతావరణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా దక్షిణాసియా దేశాల్లో వాతావరణ పరిస్థితుల అంచనాకు 2020లో ఫ్లాష్ ఫ్లడ్ గైడన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఎఫ్‌జీఎస్) ఏర్పాటు చేసింది. ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్లపై 6 నుంచి 24 గంటల ముందు ఇది సమాచారం ఇవ్వగలదు. కానీ ప్రతిస్పందనకు తక్కువ సమయం ఉండడం సహాయ చర్యలకు సమస్యగా మారింది. క్లౌడ్ బరస్ట్‌లను కనీసం రెండు మూడు రోజుల ముందే గుర్తించగలిగే వ్యవస్థను పటిష్టంగా నిర్మించాల్సిన అవసరముందని బోంబే ఐఐటీలో వాతావరణ అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ శ్రీధర్ బాలసుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎంత కష్టం, ఎంత నష్టం ప్రపంచవ్యాప్తంగా గతేడాది ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన ప్రకృతి వైపరీత్యాల్లో రెండింటిని మన దేశం ఎదుర్కొంది. టాక్టే, యాస్ తుపానులతో దేశం చిగురుటాకులా వణికింది. ఒక్కో తుపాను కనీసం రూ.7,600 కోట్ల నష్టం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారు వందల సంఖ్యలో, నిర్వాసితులు లక్షల్లో ఉన్నారు. దేశంలో 4 కోట్ల హెక్టార్ల భూమి వరద ముంపును ఎదుర్కొంటోంది. 1953–2010 మధ్య 4.9 కోట్ల హెక్టార్లు వరదల్లో మునిగింది. 2.1 కోట్ల హెక్టార్ల భూమికి మాత్రమే సురక్షిత ప్రాంతంలో ఉంది. ఏటా సగటున 1,685 మంది చనిపోతున్నారు. 6 లక్షల వరకు పశువులు, 12 లక్షల ఇళ్లు ప్రభావితమవుతున్నాయి. -
వడగాడ్పులు.. ఆకస్మిక వానలు!
దక్షిణాది రాష్ట్రాల్లో మున్ముందు ఇదే పరిస్థితి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాదీ కరువు ఛాయలే! ‘సాక్షి’తో ఆసియా అభివృద్ధి బ్యాంకు శాస్త్రవేత్త అంచా శ్రీనివాసన్ సాక్షి, హైదరాబాద్: ‘‘వడగాడ్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఉన్నట్టుండి భారీ వర్షాలు(క్లౌడ్ బరస్ట్ రెయిన్స్). దక్షిణాది రాష్ట్రాల్లో మున్ముందు ఇదే పరిస్థితి ఉండబోతోంది. వాతావరణం మార్పులే ఇందుకు కారణం’’ అని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ-ఫిలిప్పీన్స్) శాస్త్రవేత్త అంచా శ్రీనివాసన్ చెప్పారు. ఇప్పటిదాకా ఆర్థిక వలసల్నే (పనులకోసం ఇతర ప్రాంతాలకు తరలిపోవడం) చూశారని, ఇకపై వాతావరణ శరణార్థుల్ని చూస్తారని, రాబోయే పదేళ్లలో ఈ పరిస్థితి ఎదురుకాబోతోందని హెచ్చరించారు. ఏడీబీ తరఫున ఆగ్నేయాసియా దేశాల్లో వాతావరణ మార్పులపై ఈ తెలుగు బిడ్డ పరిశోధన చేస్తున్నారు. అధికారిక పర్యటనకోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ఆది వారం ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం పడనుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదీ కరువు ఛాయలే కనిపిస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాల్సింది పాలకులేనని స్పష్టం చేశారు. చైనా, వియత్నాం మాదిరి తెలుగు రాష్ట్రాలు పర్యావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆయన చెప్పిన వివరాలివీ.. 2040కి భారీ వలసలు వచ్చే పది, ఇరవై ఏళ్లలో దక్షిణాది నుంచి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ వలసలు ఉంటాయన్నది అంచనా. ఇవి ఆర్థిక వలసలు కావు. పర్యావరణ వలసలు. శరణార్థుల మాదిరి ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లి తలదాచుకునే దుస్థితి. దక్షిణాది నుంచి 2040 నాటికి రెండు కోట్ల మంది వలసలు పోతారని అంచనా. ప్రభుత్వం భరోసా ఇవ్వాలి! తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదీ కరువు ఛాయలే కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు చేయాల్సిన దానికన్నా పాలకులు చేయాల్సిందే ఎక్కువ. ఈ విషయంలో చైనా ఆదర్శం. కరువు వస్తుందనుకున్న ప్రాంతాల్లో రైతుల్ని మామూలుగా వేసే పంటకు బదులు ప్రత్యామ్నాయాన్ని అక్కడి ప్రభుత్వం సూచిస్తుంది. నష్టపరిహారాన్నీ ప్రకటిస్తుంది. వరుస కరువులొచ్చే ప్రాంతాన్ని సేవా, పారిశ్రామికరంగంవైపు మళ్లిస్తుంది. దీన్ని మన పాలకులు అనుసరించాలి. నీటి పొదుపే శరణ్యం వాతావరణ మార్పులతో మున్ముందు క్లౌడ్ బరస్టులు ఉంటాయి. అందువల్ల వర్షాలు కురిసినప్పుడే నీటిని నిల్వ చేసుకోవాలి. దీనిపై రైతులకు అవగాహన పెంచాలి. నీటిపొదుపుతోపాటు పంట ల్నీ మార్చుకోవాలి. 2050 నాటికి సుమారు 14 రకాల పంటలు 30 శాతం నష్టపోతాయి. ఈ నేపథ్యంలో దేనిపై పెట్టుబడులు పెట్టాలో వ్యూహాన్ని ప్రభుత్వాలు సిద్ధం చేసుకోవాలి. రైతులకు సలహా: రైతులు ఒకేపంటపై ఆధారపడొద్దు. తమ ఉత్పత్తులకు అదనపు విలువ ఎలా రాబట్టాలో దృష్టిపెట్టాలి. ప్రభుత్వాలను ఆ దిశగా డిమాండ్ చేయాలి. అప్ స్ట్రీమ్(నదులు, కాల్వలకు ఎగువనుండే) రైతులకు డౌన్ స్ట్రీమ్(దిగువన) రైతులు సాయపడాలి. ఐడియాలతోపాటు ఆచరణ దిశగా పాలకులూ కదిలితేనే రైతుకు మోక్షం. ప్రభుత్వమే పంటల బీమా చేయాలి ఏ తరహా ప్రకృతి బీభత్సాలు సంభవించినా నష్టపోయేది రైతులే. వీటిబారి నుంచి కాపాడేలా ప్రభుత్వమే పూర్తిగా పంటల బీమా ప్రీమియం చెల్లించి నష్టపరిహారాన్ని ఇప్పించాలి. ఆ తర్వాత నుంచి క్రమేపీ 10% చొప్పున తగ్గించుకుంటూ వచ్చి రైతులు తమంతటతామే చేసుకునేలా అవగాహన కల్పించాలి. కంబోడియాలాంటి చిన్న దేశాలు చేస్తున్నదిదే. మనమూ అలా చేసినప్పుడే రైతును ఆదుకోగలుగుతాం. అలాగే ‘ఒక ప్రాంతం-ఒక పంట’ పద్ధతిని ప్రవేశపెడితే ఒక ప్రాంతంలో నష్టపోతే మరో ప్రాంతంలోనైనా మేలు జరుగుతుంది. దీంతోపాటు ఐదు లక్షలకు మించని ద్వితీయశ్రేణి నగరాల ఏర్పాటును ప్రవేశపెట్టాలి.