![Flash Floods Due to Cloudburst in india - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/14/n.jpg.webp?itok=BtiBHP54)
వానలు దంచికొడుతున్నాయి. ఏ రాష్ట్రాన్ని చూసినా వరదలు ముంచేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని లోతట్టు ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. అత్యంత ఆధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలున్నా ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమర్థ ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమవుతూనే ఉన్నాం. కొన్నేళ్లుగా దేశంలో వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాలు, ఏడాది మొత్తంలో కురవాల్సిన వాన ఒకట్రెండు రోజుల్లోనే పడటం వంటివి సవాలుగా మారాయి. 2010 నుంచి 2021 దాకా తుపాన్లకు బలవుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. 2013 నుంచి భారీ వర్షాలు వరదలతో ఏటా సగటున వెయ్యి మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ముందస్తు హెచ్చరిక వ్యవస్థ పనితీరు ఇలా...
భారత్‌లో ప్రకృతి వైపరీత్యాలను ముందే తెలుసుకొని అప్రమత్తం కావడానికి తగిన వ్యవస్థ అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితుల్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నదులు, రిజర్వాయర్లలో నీటిమట్టం తదితరాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షిస్తూ ఉంటాయి. దేశవ్యాప్తంగా 20 నదీ తీర ప్రాంతాల్లో దాదాపుగా 1,600 హైడ్రో మెట్రాలజికల్ స్టేషన్లు సీడబ్ల్యూసీ నిర్వహణలో ఉన్నాయి. ఇవన్నీ రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను గుర్తిస్తూ విపత్తు నిర్వహణ సంస్థల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. వరద బీభత్సంతో ముంపు సమస్యలు తలెత్తేలా ఉంటే హెచ్చరించడానికి గూగుల్‌తో సీడబ్ల్యూసీ ఒప్పందం కుదుర్చుకుంది.
పట్టణ ప్రాంతాల్లో ఐఎండీ 33 రాడార్ నెట్‌వర్క్ స్టేషన్లను నిర్వహిస్తూ వాతావరణ సూచనలు చేస్తుంటుంది. వరద పరిస్థితుల అంచనాకు 14 ప్రాంతాల్లో ఫ్లడ్ మెట్రాలజికల్ ఆఫీసులు (ఎఫ్‌ఎంఒ)న్నాయి. కచ్చితత్వాన్ని మరింత పెంచేలా వీటిని మెరుగు పరచాల్సిన అవసరముంది. 2016లో వార్దా తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ముంచేస్తుందని భారత వాతావరణ శాఖ చెబితే, యూరోపియన్ మోడల్ మాత్రం చెన్నై వైపు వెళ్తుందని కచ్చితంగా అంచనా వేసింది. గత మే నెలలో అసాని తుపాను ఒడిశా, బెంగాల్‌వైపు వెళ్తోందని ఐఎండీ చెప్పగా యూరోపియన్ మోడల్ మాత్రం ఏపీ వైపు మళ్లుతుందని కచ్చితంగా అంచనా వేసింది.
ముంచేస్తున్న ఆకస్మిక వరదలు
క్లౌడ్ బరస్ట్‌లతో ఏర్పడే ఆకస్మిక వరదలు కొద్ది కాలంగా విపత్తు నిర్వహణ యంత్రాంగానికి సవాలు విసురుతున్నాయి. భారత వాతావరణ శాఖ, అమెరికా జాతీయ వాతావరణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా దక్షిణాసియా దేశాల్లో వాతావరణ పరిస్థితుల అంచనాకు 2020లో ఫ్లాష్ ఫ్లడ్ గైడన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఎఫ్‌జీఎస్) ఏర్పాటు చేసింది. ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్‌లపై 6 నుంచి 24 గంటల ముందు ఇది సమాచారం ఇవ్వగలదు. కానీ ప్రతిస్పందనకు తక్కువ సమయం ఉండడం సహాయ చర్యలకు సమస్యగా మారింది. క్లౌడ్ బరస్ట్‌లను కనీసం రెండు మూడు రోజుల ముందే గుర్తించగలిగే వ్యవస్థను పటిష్టంగా నిర్మించాల్సిన అవసరముందని బోంబే ఐఐటీలో వాతావరణ అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ శ్రీధర్ బాలసుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎంత కష్టం, ఎంత నష్టం
ప్రపంచవ్యాప్తంగా గతేడాది ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన ప్రకృతి వైపరీత్యాల్లో రెండింటిని మన దేశం ఎదుర్కొంది. టాక్టే, యాస్ తుపానులతో దేశం చిగురుటాకులా వణికింది. ఒక్కో తుపాను కనీసం రూ.7,600 కోట్ల నష్టం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారు వందల సంఖ్యలో, నిర్వాసితులు లక్షల్లో ఉన్నారు. దేశంలో 4 కోట్ల హెక్టార్ల భూమి వరద ముంపును ఎదుర్కొంటోంది. 1953–2010 మధ్య 4.9 కోట్ల హెక్టార్లు వరదల్లో మునిగింది. 2.1 కోట్ల హెక్టార్ల భూమికి మాత్రమే సురక్షిత ప్రాంతంలో ఉంది. ఏటా సగటున 1,685 మంది చనిపోతున్నారు. 6 లక్షల వరకు పశువులు, 12 లక్షల ఇళ్లు ప్రభావితమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment