సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో కొన్ని అంశాలు లేనందున తాము నిరసన తెలిపే ప్రయత్నం చేశామని.. కానీ మార్షల్స్ తమను నెట్టివేయడంతోనే అసెంబ్లీలో ఘటన జరిగిందని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. స్వామిగౌడ్ ప్రసంగం ముగిశాక గవర్నర్‌ను దగ్గరుండి తీసుకెళ్లారని.. అప్పుడు స్వామిగౌడ్ బాగానే ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి.. కాంగ్రెస్ ఏదో చేసినట్టుగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు.
అసెంబ్లీ ఘటన నేపథ్యంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధికారపక్షం నిర్ణయించినట్లు సమాచారం అందడంతో.. సోమవారం మధ్యాహ్నం జానారెడ్డి, భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాను నిల్చున్న టేబుల్ విరిగి తనపై పడిందని, అందుకే టేబుల్ మారానని.. తమ సభ్యుల నుంచి దూరంగా వెళ్లేందుకు కాదని జానారెడ్డి చెప్పారు.
పార్లమెంటులో టీఆర్‌ఎస్ సభ్యులు కూడా పేపర్లు చించారని గుర్తుచేశారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రస్తావించకపోవడం తమను అసహనానికి గురిచేసిందని భట్టివిక్రమార్క వివరించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సీఎందే బాధ్యత అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
రెండు సార్లు భేటీ..
బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం రెండు సార్లు సమావేశమైంది. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు సమావేశమయ్యారు. గవర్నర్ ప్రసం గం సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. సభలో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించారు.
ఈ మేరకు నిరసన తెలిపారు. అయితే కోమటిరెడ్డి మైకు విసరడం, అది వివాదాస్పదంగా మారడంతో.. అనంతరం మరోసారి సీఎల్పీ భేటీ జరిగింది. అసెంబ్లీలో ఘటనపై ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారు. తర్వాత సీఎల్పీ నేతలు మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వంపై ఎదురుదాడికి యత్నించారు. బీఏసీ సమావేశంలోనూ జానా తమ వాదనను వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment