క్లూస్‌టీమ్స్ బలోపేతం | Clues to strengthen Teams | Sakshi
Sakshi News home page

క్లూస్‌టీమ్స్ బలోపేతం

Published Tue, Dec 15 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

క్లూస్‌టీమ్స్ బలోపేతం

క్లూస్‌టీమ్స్ బలోపేతం

శాస్త్రీయ ఆధారాల సేకరణపై సైబరాబాద్ పోలీసుల దృష్టి
త్వరలోనే ఐదు బృందాల ఏర్పాటు
త్వరితం కానున్న నేరశోధన

 
సిటీబ్యూరో:  నేరగాళ్లకు శిక్ష పడటంతో ఆధారాలు ముఖ్య భూమిక వహిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలంలో వీటిని సేకరించే క్లూస్ టీమ్‌లను బలోపేతం చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. శాస్త్రీయ ఆధారాలు పక్కాగా ఉంటే నేరగాళ్ల శిక్ష శాతం పెరుగుతుందని భావిస్తున్న  కమిషనర్  ...ప్రస్తుతమున్న ఫింగర్ ప్రింట్ యూనిట్‌కు తోడుగా క్లూస్‌టీమ్‌లను రం గంలోకి దింపాలని భావిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో లా అండ్ అర్డర్ పోలీసు స్టేషన్లున్నా...ఆధారాల సేకరణకు మాత్రం ప్రత్యేకంగా క్లూస్‌టీమ్ అంటూ ఏమీ లేదు. ఉన్నా ఫింగర్ ప్రింట్ విభాగంలో సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో చాలా కేసుల్లో శాస్త్రీయ ఆధారాల సేకరణ వీలుపడటం లేదు. ఇటీవల ప్రత్యక్ష సాక్షులు తదితరుల సాక్ష్యాలు న్యాయస్థానాల్లో పెద్దగా నిలవడం లేదు. చివరి నిమిషంలో వారు ఎదురు తిరుగుతుండటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో మాది రిగానే సైబరాబాద్‌లోనూ క్లూస్‌టీం సేవలను బాగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్న కమిషనర్ ఆనంద్... ఐదు జోన్లలోనూ ఒక్కో క్లూస్‌టీంను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేపట్టారు.

ప్రత్యేక శిక్షణ...
ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్లలో శాస్త్రీయ ఆధారాల సేకరణ బాధ్యతను అక్కడి ఠాణాల్లోని ఇద్దరు పోలీ సులు చూసుకుంటున్నారు. వీరు బాగానే పనిచేస్తున్నప్పటికీ....శిక్షల శాతం పెరగాలంటే ప్రత్యేకంగా క్లూస్‌టీమ్ అవసరమని సీవీ ఆనంద్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని తీసుకొని శిక్షణ ఇవ్వనున్నారు. శాస్త్రీయ ఆధారాల సేకరణలో ప్రావీణ్యులైన వారిచే ఓరియంటేషన్ క్లాస్‌లతో పాటు ఫిజికల్‌గా కూడా క్లాస్‌లు తీసుకోనున్నారు. క్లూస్‌టీంలో అధికారితో పాటు ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, వేలిముద్రలు...రక్తనమూనా సేకరణ నిపుణులు, పేలుడు పదార్థాలను గుర్తించేవారు ఉంటారు. ఘటనాస్థలిలో రక్తం, వేలిముద్రల సేకరణకు విదేశాల నుంచి అత్యంత ఆధునికమైన పరికరాలను కూడా తెప్పిస్తున్నారు.

ఈ బృందాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సేవలను వినియోగించడం ద్వారా నేరగాళ్లను అరెస్టు చేసే విషయంపై మరింత దృష్టి సారిస్తామని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్‌డీ నవీన్ కుమార్ పేర్కొన్నారు..
 
నేరగాళ్లకు శిక్ష పడేందుకే...

ఘటనాస్థలిలో శాస్త్రీయ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే, దోషులకు శిక్ష విధించే వీలుంటుంది. క్లూస్‌టీం వల్ల నేర పరిశోధన సులువవుతుంది. క్లిష్టమైన కేసులను వెం టనే ఛేదించవచ్చు. అందుకే ఈ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.
 - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement