కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేస్తాం
భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్
మంజూరీ పోస్టుల్లేవని గోడు వెళ్లబోసుకున్న బాధితులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లలో అర్హతలున్న వారందరికీ క్రమబద్ధీకరణ ప్రక్రియలో న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. మంజూరీ పోస్టులు లేక నష్టపోతున్న వారికి తగు న్యాయం చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం, ప్రతినిధులు గంగ, ఫర్జానా, స్వర్ణలత తదితరులు బుధవారం సీఎం కేసీఆర్‌ను అధికారిక నివాసంలో కలసి వినతిపత్రం అందజేశారు.
గత పాలకులు పోస్టులు మంజూరీ చేయకుండానే 2008-09లో 73 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరీ చేశారని, మంజూరీ పోస్టుల్లో అప్పటికే పనిచేస్తున్న 632 మందిని ఈ కాలేజీల్లోని అన్‌శాంక్షన్డ్ పోస్టుల్లోకి బదిలీ చేసి తమకు అన్యాయం చేశారని, దీంతో తాము మంజూరీ పోస్టుల్లో పనిచేస్తున్న జాబితాలో చేరామని, దీని వల్ల రెగ్యులరైజ్ అయ్యేందుకు అనర్హులుగా మారే ప్రమాదం తలెత్తిందని సీఎం కేసీఆర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి సరైన కసరత్తు చేసి సత్వర న్యాయం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. ఉద్యోగుల నియామకం, నియమ నిబంధనలు, రోస్టర్ పద్ధతి వంటి పలు న్యాయపరమైన అంశాలను అధిగమించే విధంగా మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.