సమైక్య రాష్ట్రంలో వీసీల ఇష్టారాజ్యం
♦ స్వయంప్రతిపత్తి పేరిట అధికార దుర్వినియోగం: సీఎం
♦ రిటైర్మెంట్ రోజునా వందలాది మంది నియామకం
♦ ప్రభుత్వ నియంత్రణ కొరవడే ఈ దుస్థితి
♦ అందుకే అంబేద్కర్, రాజీవ్‌గాంధీ వర్సిటీల చట్ట సవరణ బిల్లు
♦ వీసీల నియామక కమిటీలో ప్రతిపక్షానికీ చోటు కల్పిస్తాం
♦ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్య రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వందలాది ఎకరాల భూములు ఎలా మాయమయ్యాయి. దానికి ఉండాల్సిన భూమి ఎంత, ఇప్పుడెంత మిగిలింది. స్వయంప్రతిపత్తిని వీలైనంత దుర్వినియోగం చేసి వీసీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగదీశ్‌రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండగా కొన్ని యూనివర్సిటీలను సమీక్షిస్తే ఎన్నో దారుణాలు వెలుగు చూశాయి. వీసీలపై విచారణ చేయాల్సిన దుస్థితి వచ్చింది. సాయంత్రం పదవీవిరమణ చేయాల్సి ఉంటే ఉదయం పూట వందల మందిని ఉద్యోగాల్లో నియమించారు. ఓ దగ్గర 370 మంది, మరో దగ్గర 300 మందిని నియమించారు. ప్రభుత్వ నియంత్రణ కొరవడటం వల్లే ఈ దుస్థితి దాపురించింది. ఇలాంటి ఇష్టారాజ్యాన్ని సవరించే అక్కర ఉందా లేదా అన్నది అంతా ఆలోచించాలి. అందుకే చట్టసవరణను ప్రతిపాదించాం. ఇదేమీ ఆషామాషీ నిర్ణయం కాదు.
దీని వెనక మరే రాజకీయ దురుద్దేశాలు లేవు’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శాసనసభలో స్పష్టం చేశారు. అంబేడ్కర్ సార్వత్రిక, రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులపై విపక్షాలు అభ్యంతరం తెలపడంపై కేసీఆర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేపథ్యం, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే సవరణలు అవసరమని భావించామని, దీని వెనక రాజకీయ ఉద్దేశాలు లేవని పేర్కొన్నారు. గవర్నర్ చాన్స్‌లర్‌గా ఉండొద్దని బిల్లుల్లో లేదని, ప్రభుత్వం కూడా చెప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు గవర్నర్ ఒక్కరే చాన్స్‌లర్‌గా ఉంటే పని ఒత్తిడిలో ఆయన ప్రతి యూనివర్సిటీపై దృష్టి సారించలేరని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతోనే ఈ బిల్లులను తెస్తున్నామన్నారు. యూనివర్సిటీల్లో కొనసాగతున్న విచ్చలవిడితనాన్ని తాను స్వయంగా గవర్నర్‌ను దృష్టికి తీసుకెళ్లి వివరించానని, ఆయనతో చర్చించి ఆమోదం తీసుకున్నాకే సవరణకు నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు.
‘‘గవర్నర్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు అనటానికి లేదు. గవర్నర్ ఉండాల్సిన చోట వారు ఉంటారు. ఎన్నింటిలో ఉంటారనే విషయంపై వారిని అడుగుతాం. కొన్ని యూనివర్సిటీలకు న్యాయమూర్తులను కూడా వీసీలుగా నియమించాలనుకుంటున్నాం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లి న్యాయమూర్తులను కేటాయించాలని కోరాను’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఊరికొకటి పల్లెకొకటి చొప్పున స్థాపిస్తే యూనివర్సిటీల గౌరవం పోతుందని, తాము హుందాగా ఓ ప్రతిపాదన తెచ్చామని, వీసీలను ఎంపిక చేసే కీలక కమిటీలో ప్రతిపక్ష సభ్యుడికీ అవకాశం ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి యూనివర్సిటీకి విడివిడి చట్టం ఉండాలా, అన్నీ కలిసి ప్రభుత్వ అధీనంలో ఒకే చట్టం పరిధిలో పనిచేయాలా అనే విషయంపై విద్యా వ్యవస్థపై జరిగే స్వల్పకాలిక చర్చలో చర్చిద్దామని ప్రతిపక్షాలకు సూచించారు.