
ప్రాణాలు సైతం లెక్కచేయలేదు: కేసీఆర్
పోలీసులు ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహించారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. సంఘవిద్రోహ శక్తులను అదుపు చేయడంలో పోలీసులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన అన్నారు. సూర్యాపేట కాల్పులు, ఆ తర్వాతి ఘటనల్లో పోలీసులది స్ఫూర్తిదాయకమైన పాత్ర అని కేసీఆర్ చెప్పారు. కాల్పుల్లో చనిపోయిన కానిస్టేబుళ్లు లింగయ్య, నాగరాజు, హోంగార్డు మహేష్లది గొప్ప త్యాగమన్నారు.
ఈ ముగ్గురూ అమరులని, తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని సీఎం తెలిపారు. మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన అన్నారు. కాల్పుల్లో గాయపడ్డవారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోనే వైద్యం చేయిస్తామని తెలిపారు. గాయపడిన సిబ్బంది గురించి పోలీసు అధికారులను ఆయన ఆరా తీశారు. సంఘవిద్రోహ శక్తుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా కఠినంగా పనిచేస్తుందని చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.