రాబోయే రోజుల్లో మంచి వర్షాలు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: గడిచిన వారం రోజులుగా కురిసిన వర్షాలతో తెలంగాణ తీవ్ర కరువు నుంచి బయటపడినట్లేనని సీఎం కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన రబీ సీజన్ కు ధోకా కుండదన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయ శాఖ, తాగునీటి శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం రాత్రి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జులై, ఆగస్టులో వర్షాలు లేకున్నా సెప్టెంబర్ లో కురిసిన వర్షాలు రైతులకు ఉపయోగపడతాయని, మహబూబ్ నగర్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటం శుభసూచికమని సీఎం అన్నారు. ఖరీఫ్ సీజన్ లో నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకోవాలని, సర్వే ద్వారా వాస్తవ వివరాలు తెలుసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇదిలా ఉండగా ఈ నెల 22న టీఆర్ఎస్ శాసనసభా పక్షం సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది. తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ సభలో ప్రకటన చేస్తారని సమాచారం.