'ఫీజు పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తాం' | CM KCR speaks in Assembly over Fee ReImbursements | Sakshi
Sakshi News home page

'ఫీజు పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తాం'

Published Thu, Jan 5 2017 1:40 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

'ఫీజు పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తాం' - Sakshi

'ఫీజు పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తాం'

విద్యార్థులు రంధి పడొద్దు : సీఎం కేసీఆర్‌
త్వరగా బకాయిల విడుదల
ఒకేసారి 100 శాతం చెల్లింపులు సాధ్యం కాదు
ఈ విషయం విద్యార్థులకు, యాజమాన్యాలకూ తెలుసు
ఫీజుల పథకాన్ని మోయలేని దుస్థితిలో ప్రభుత్వం లేదు
గట్టి చర్యలు తీసుకుంటే 250 ఇంజనీరింగ్‌ కళాశాలలు మూతపడేవి
ఏ రాష్ట్రంలోనైనా 370 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉంటాయా?


సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తాము యథాతథంగా కొనసాగిస్తున్నామని.. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకం అమలుపై ఎవరికీ సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా తొలుత అధికార, విపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం కేసీఆర్‌ సమాధానమిచ్చారు.

‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం బంద్‌ చేసే స్కీం కాదు. విద్యార్థులు రంధి పడొద్దు. ఫీజుల పథకంలో బకాయిలు ఎప్పుడూ ఉండేవే. తెలంగాణ వచ్చే నాటికే దీనికి రూ.1,800 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ఏటా చెల్లింపులు పోను మిగిలిన అవసరాలు బకాయిలుగానే ఉంటాయి. వాటిని బకాయిలుగా కూడా పరిగణించొద్దు. ప్రళయమేమీ రాలేదు. రానీయం. కైరో లేదు నీరో లేదు. విద్యార్థులను ఇబ్బంది పడనీయం. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వీలున్నంత త్వరగా ఫీజుల బకాయిలు విడుదల చేస్తాం. అయితే ఒకేసారి 100 శాతం చెల్లింపులు మాత్రం సాధ్యం కాదు..’’అని స్పష్టం చేశారు. ఫీజుల పథకం విభిన్నమైనదని, దాని కింద కచ్చితంగా నిధులను బడ్జెట్‌లో కేటాయించలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. అయినా ఫీజుల పథకం ప్రభుత్వానికి పెనుభారమేమీ కాదని, దాన్ని మోయలేని దుస్థితిలో రాష్ట్రం లేదని పేర్కొన్నారు. ఏటా ఈ పథకానికి రూ.2.5 వేల కోట్ల వరకు బడ్జెట్‌ అవసరమవుతోందని, పథకం ప్రారంభమైన నాటినుంచి ఒక్క ఏడాది కూడా 100 శాతం చెల్లింపులు జరగలేదని గుర్తు చేశారు.

ఇది అందరికీ తెలుసు..
ఫిబ్రవరి వరకు కూడా విద్యార్థులు ఫీజు పథకం కోసం రిజిస్టర్‌ చేసుకుంటూనే ఉంటారని, వారికి అవకాశం ఇవ్వకపోవడం సరైంది కాదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అందుకే నిధులు విడుదల చేసినా బకాయిలు కనిపిస్తాయన్నారు. ఈ విషయం విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు కూడా తెలుసని... ఈ ఏడాది ఫీజులు వచ్చే ఏడాది తీసుకోవడం వారికి అలవాటైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫీజుల పథకం కింద రూ.4,687 కోట్లు ఇచ్చామని.. 2016–17లో ఇప్పటివరకు రూ.1,487 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఊరుకోబోం..
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలపై విజిలెన్స్‌ దాడులు చేయించి ఏం సాధించారని విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్‌ దీటుగా బదులిచ్చారు. ‘‘అవును.. విజిలెన్స్‌ దాడులు చేయాలని చెప్పింది నేనే. అందుకు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా. మీ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు నిలిపివేస్తున్నామని పెద్ద పెద్ద కంపెనీలు నా మొహం పట్టుకుని చెప్పాయి. ఏ రాష్ట్రంలో అయినా 370 ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉంటాయా, ఏటా లక్షన్నర మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వస్తుంటే వాళ్లనేం చేయాలి? కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం 36 వేల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. హోంగార్డు ఉద్యోగాల కోసం కూడా వస్తున్నారు..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఫీజుల గురించి మాట్లాడేందుకు తాను కళాశాలల యాజమాన్యాలను పిలిపించినప్పుడు... యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం తమ కాలేజీలు అర్హత సాధించలేవని ఆయా యాజమాన్యాలే చెప్పాయన్నారు. స్టాఫ్, ల్యాబ్‌లు, భవనాలు, మౌలిక సౌకర్యాలు లేవని చెప్పారని... దాంతో కావాలంటే ఏడాది సమయం తీసుకుని అన్ని సౌకర్యాలు సమకూర్చాలని తాను సూచించానని తెలిపారు. ‘‘మేం మెడ మీద కత్తి పెట్టాలనుకుంటే 100 కాదు.. 250 వరకు ఇంజనీరింగ్‌ కళాశాలలు మూతపడేవి. సమయం ఇచ్చాం కనుకనే స్వచ్ఛందంగా మూసేసుకున్నారు. ఇప్పటికైనా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో అర్హత లేని కళాశాలలుంటే మూసివేయిస్తాం. డబ్బులొస్తాయని విచ్చలవిడిగా చేస్తామంటే చూస్తూ ఊరుకోం..’’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

బీఈడీ కాలేజీలనూ తగ్గించాలి
రాష్ట్రంలో బీఈడీ కళాశాలల సంఖ్యను కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఏటా 42 వేల మంది టీచర్‌ అభ్యర్థులు వస్తే వారినేం చేయాలని, వారందరికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా అని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వం ఉద్యోగాలివ్వకపోతే వాళ్లంతా రోడ్ల మీదకు రావాలి. ఆందోళనలు చేయాలి. వాటికి మీరు (విపక్షాలు) నాయకత్వం వహించాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెసోళ్లు, కాంగ్రెస్‌ ఉన్నప్పుడు టీడీపీ వాళ్లు అలా ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఇద్దరు కలిసి మా మీద చేయాల్నా? అవే స్టీరియోఫోనిక్‌ ధర్నాలా? పాత్రలు మారుతున్నయి కానీ, సమస్య పరిష్కారం కావడం లేదు. రాష్ట్రానికి ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్ల అవసరం ఎంత? ఎంత మంది కావాలి? అనే దానిపై ఓ అంచనా ఉండాలి. సమతుల్యత ఉండాలి కానీ, గందరగోళం కొనసాగడం మంచిది కాదు..’’అని వ్యాఖ్యానించారు.

ఉద్యోగాలపై భ్రమలు కల్పించొద్దు
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో భ్రమలు కల్పించవద్దని, వాస్తవాలు ప్రజలకు తెలియాలని సీఎం కేసీఆర్‌ శాసనసభలో వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందనే బీఈడీ, డీఈడీ కౌన్సెలింగ్, అడ్మిషన్లు నిలిపివేసారా అని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ప్రశ్నించడంతో.. సీఎం ఈ సమాధానమిచ్చారు. ‘‘మాకన్నా ముందు చాలా మంది పాలించారు. మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలిచ్చారు. అన్నీ కలిపి ప్రభుత్వ రంగంలో ఉండేవే మూడు నుంచి మూడుంపావు లక్షల ఉద్యోగాలు. అందులో రిటైరైన వారి స్థానంలో నియామకాలు ఉంటాయి. ఎప్పుడో ఉద్యోగాల విస్తరణ ఉంటుంది. అంతేగానీ ప్రభుత్వంలో కోట్ల ఉద్యోగాలు ఉంటాయని భ్రమలు కల్పించడం మంచిది కాదు. కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలియాలి. బాధ్యత గల మనుషులుగా ఇక్కడ కూర్చుని.. వారి (యువత)లో ఆశలు కలిగించడం మంచిది కాదు. వారికి సరైన మార్గం, పంథా చూపెట్టాలి. లేనిఆశలు కల్పించకూడదు. ఇప్పటివరకు జరిగింది ఇదే..’’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాగా.. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనార్టీ విద్యార్థులకు సంక్షేమ పథకాలు అమలయ్యేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 71 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసుకుంటున్నామని.. బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలను వచ్చే ఏడాది ప్రారంభించనున్నామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement