సంఘవిద్రోహ శక్తులను చొరబడనివ్వం: సీఎం
- ట్రాఫిక్ పోలీసులకు మూలవేతనంతో 30శాతం అలవెన్స్
- డబుల్ బెడ్‌రూం ఇళ్లలో 10శాతం పోలీసు సిబ్బందికి రిజర్వ్
- ఎస్సై, ఆపైస్థాయి అధికారులకు ఇళ్ల స్థలాలు
- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కేసీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మతతత్వ శక్తులతో పాటు తీవ్రవాదులకు, సంఘవిద్రోహ శక్తులకు, వైట్‌కాలర్ నేరగాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో చోటివ్వబోమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రజానీకానికి హామి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే రాష్ట్రంలో అధునాత పోలీసు వ్యవస్థ కోసం బంజారాహిల్స్‌లో ఇంట్రిగేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మతో కలిసి సీఎం కేసీఆర్ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు సమాజం రుణవ డి ఉందన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు చేస్తున్న త్యాగాలను సమాజంలోని అన్ని వర్గాలు గుర్తించి భుజం తట్టి ప్రోత్సహించాలన్నారు. పోలీసు సంస్మరణ పూర్తితో విధినిర్వహణకు సిబ్బంది పునరంకితం కావాలని, నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేసి, అరాచక శక్తులను అంతమొందించాలని సీఎం సూచించారు.
పోలీసులకు వరాలు
పోలీసు సిబ్బంది సంక్షేమానికి గతేడాది స్వయంగా తాను ప్రకటించిన హామీలు విస్మరణకు గురైన మాట వాస్తవమేనని సీఎం అంగీకరించారు. గతంలోని హామీలపై డీజీపీ అనురాగ్‌శర్మతో ఇటీవలే సమీక్షించానని, త్వరతగతిన అమలయ్యేలా చూస్తామన్నారు. పోలీసుల అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం హామి ఇచ్చారు.
అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్ రూం ఇళ్ల పథకంలో పోలీసు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, హోంగార్డులకు, మాజీ సైనికుద్యోగులకు కలిపి పదిశాతం ప్రతి సంవత్సరం ఇళ్లను రిజర్వు చేస్తామన్నారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఆపైస్థాయి అధికారులకు వారు పనిచేస్తున్న జిల్లాలోని మున్సిపాలిటీలలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరానాకి సంబంధించి స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. పోలీసులకు యూనిఫాం కోసం ఇచ్చే వార్షిక అలవెన్స్‌లను 3,500 నుంచి 7,500లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుకు మూల వేతనంతో పాటు అదనంగా 30శాతం అలవెన్స్ అందజేస్తామని స్పష్టంచేశారు.
అలావచ్చి.. ఇలా వెళ్లి
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండానే పదిహేను నిముషాల్లో ముగించుకొని వెళ్లిపోయారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఉదయం 9గంటలకు హాజరవగా... గవర్నర్ మాత్రం ఉదయం 7గంటలకే అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విధినిర్వహణలో పోలీసులు చేసిన పలు సేవా కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి వెళ్లిపోయారు.