సర్‌‘కారు’లో జిల్లాల కిరికిరి | Conflicts over New Districts in rulling party | Sakshi
Sakshi News home page

సర్‌‘కారు’లో జిల్లాల కిరికిరి

Published Tue, Sep 13 2016 2:52 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

సర్‌‘కారు’లో జిల్లాల కిరికిరి - Sakshi

సర్‌‘కారు’లో జిల్లాల కిరికిరి

సొంత పార్టీలోనే కొత్త జిల్లాలపై విభేదాలు
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తలోదిక్కు
గ్రూపులుగా చీలిపోయిన సొంత పార్టీ నేతలు
పోటాపోటీ ఫిర్యాదులు.. ఆందోళనలు
సీఎం వద్ద రోజుకో గ్రూపు పంచాయితీ
జిల్లాల పేర్లపైనా చెలరేగుతున్న వివాదం

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలపై అధికార పార్టీలో రోజురోజుకూ లొల్లి ముదురుతోంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీలోని కీలక నేతలు కొత్త జిల్లాల ఏర్పాటుపై కీచులాడుకుంటున్నారు. జిల్లాల స్వరూపం, కొన్ని ప్రాంతాల విలీనం, తొలగింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పంతాలు పట్టింపులతో కొందరు నేతలు గ్రూపులుగా విడిపోయి అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. కొందరైతే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా మహబూబ్‌నగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరి స్థితి నెలకొంది. ఇప్పటికే జనగామ, గద్వాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని విపక్షాలు రాష్ట్రస్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. విపక్ష నేతలు తీవ్ర విమర్శలతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సిరిసిల్ల, వరంగల్‌లో అఖిల పక్షాల ఆందోళనలు ఇప్పటికే సర్కారును ఇరుకున పడేశాయి. ఈ నేపథ్యం లో సొంత పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వివాదాలు రాజుకోవటంతో తానే రంగంలోకి దిగారు. మూడ్రోజులుగా క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఇంటి పోరు చక్కదిద్దేందుకే ఎక్కువ సమయం వెచ్చించారు. దీంతో కొత్త జిల్లాల పోరు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.
 
లొల్లి ఎక్కడెక్కడ.. ఎవరి మధ్య..?
ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మధ్య విభేదాలు పొడసూపాయి. అమరచింత, సీసీకుంట, ఆత్మకూరు, నర్వ మండలాలను వనపర్తి జిల్లా ముసాయిదాలో చేర్చటాన్ని ఎంపీతోపాటు మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ మండలాలు లేకుండా వనపర్తి జిల్లా చిన్నగా ఉంటుందని నిరంజన్‌రెడ్డి వర్గీయులు అంటున్నారు. ఈ రెండు గ్రూపుల పేచీ పరిష్కరించేందుకు సీఎం మూడు గంటలు సమీక్ష జరిపారు. అప్పటికీ సయోధ్య కుదరక ఆందోళనలు మొదలయ్యాయి.

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడను సూర్యాపేటలో చేర్చాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడను నల్లగొండలోనే ఉంచాలని కోరుతున్నారు. తమను నల్లగొండలోనే ఉంచాలని అక్కడి ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం తలపట్టుకుంటోంది. వరంగల్ జిల్లాలోనూ టీఆర్‌ఎస్ నేతలు తలో వాదన వినిపిస్తున్నారు. మహబూబాబాద్, భూపాలపల్లి మినహాయిస్తే వరంగల్ జిల్లాను రెండు జిల్లాలు చేయాలని కొండా దంపతులు, పార్టీ ముఖ్యనేతలు వాదిస్తున్నారు. వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు, వరంగల్ మేయర్ ఒకే జిల్లాగా ఉండాలని పట్టుబడుతున్నారు.

ఒక దశలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి, జిల్లా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు పొడసూపాయి. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వరంగల్‌లో కలపడంపై కడియం విముఖత వ్యక్తం చేయటంతో మంత్రి ఈటల రాజేందర్‌తో విభేదాలు తలెత్తినట్లయింది. చేర్యాల, మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపడం వల్లే జనగామ జిల్లా కేంద్రానికి నోచుకోలేకపోయిందని, దీనంతటికి మంత్రి హరీశ్‌రావు కారణమని అక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపాదిత కామారెడ్డి జిల్లాలో ఉన్న నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో చేర్చాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పట్టుబడుతున్నారు. మండలంలోని అఖిల పక్ష నేతలు పాదయాత్రలు, దీక్షలతో ఆందోళనకు దిగారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఆ మండలం కామారెడ్డిలోనే ఉండాలని పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపే మండలాలపై అక్కడి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా తమ వాదనలు వినిపిస్తున్నారు. మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాలను శంషాబాద్ జిల్లాలో కలపాలని టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి.
 
పేర్ల విషయంలోనూ వివాదం...
జిల్లాల పేర్ల విషయంలోనూ వివాదం చెలరేగుతోంది. వికారాబాద్ కేంద్రంగా ఏర్పడ్డ జిల్లాకు రంగారెడ్డి జిల్లా పేరును తొలగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందంటూ ఆ జిల్లాలోని అఖిల పక్షాలు సోమవారం బంద్ పాటించాయి. దివంగత నేత, అప్పటి ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి పుట్టి పెరిగిన మొయినాబాద్‌ను శంషాబాద్‌లో చేర్చేందుకు ఇటీవలే సీఎం ఆమోదం తెలిపారు. మరోవైపు గుండేడు మండలాన్ని మహబూబ్‌నగర్‌లో చేర్చాలని అక్కడి నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో వికారాబాద్ జిల్లా అస్తిత్వానికి ప్రమాదమేర్పడిందని అక్కడ కొత్త ఆందోళనకు తెరలేసింది. కొత్తగా ఏర్పడ్డ మల్కాజ్‌గిరి జిల్లాకు మేడ్చల్, లేదా కీసరగుట్ట పేరు పెట్టాలంటూ పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement