'చారిత్రక ఒప్పందం కాదు.. చారిత్రక ద్రోహం'
⇒ ఎత్తు తగ్గించి మహారాష్ట్రకు తాకట్టుపెట్టారు
⇒ మహారాష్ట్ర ఒప్పందంపై టీపీసీసీ నిరసన
⇒ ఉత్తమ్, జానా, భట్టి, పొన్నాల ధర్నా
హైదరాబాద్: మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నది చారిత్రక ఒప్పందం కాదని, తెలంగాణ భావితరాలకు శాశ్వత, మహా ద్రోహమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకుంటూ మహారాష్ట్ర ప్రభుత్వంతో ముంబయిలో ఒప్పందం చేసుకుంటున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ మంగళవారం నిరసనలను చేపట్టింది. ధర్నాలు, నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలతో జిల్లా కేంద్రాల్లో వ్యక్తమైన నిరసనల్లో భాగంగా హైదరాబాద్‌లో ముఖ్యనేతలు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, వివిధ అనుబంధసంఘాల అధ్యక్షులు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు గాంధీభవన్ నుంచి జిల్లా కలెక్టరేట్ దాకా పాదయాత్ర నిర్వహించారు.
ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు గాంధీభవన్‌లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణహిత ప్రాజెక్టుకోసం తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, భావితరాలకు శాశ్వతద్రోహం చేసేవిధంగా 148 మీటర్ల ఎత్తుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకోసం ఒప్పందం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు దానికంటే ఎక్కువ చేసుకున్నారా అని ప్రశ్నించారు. ఎత్తును తగ్గించి ఒప్పందం చేసుకుని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఉత్తమ్ విమర్శించారు. 148 మీటర్ల ఎత్తుకు ఒప్పందం చేసుకోవడం ద్వారా తెలంగాణ ప్రజల భవిష్యత్తును మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ ఒప్పందం చేసుకున్నందుకు మహారాష్ట్రలోనే సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు. కనీసం ఎత్తును 152 కంటే పెంచకున్నా, అదే ఎత్తుకు ఒప్పందం చేసుకుని, సంబరాలు జరుపుకుంటే ఒక అర్థం ఉండేదన్నారు.
మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. గోదావరి నదీ జలాలకోసం గతంలోనే ఒప్పందాలు జరిగాయన్నారు. 1975 నుంచి 2012 వరకు జరిగిన ఒప్పందాలపై కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం కొనసాగింపుగా ఒప్పందాలు చేసుకుందన్నారు. ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించి సంబరాలు చేసుకోవడం ఎందుకని భట్టి ప్రశ్నించారు. ప్రతిపక్షనాయకుడు కె.జానారెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కాదని, చారిత్రక ద్రోహమని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నదని విమర్శించారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణను మోసం చేస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణకు శాశ్వతంగా నష్టం తప్ప ప్రయోజనం ఏమీలేదన్నారు. ఈ ఒప్పందాన్ని చారిత్రక ఒప్పందం అంటూ టీఆర్‌ఎస్ నేతలు తమను తాము మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేస్తున్నారని పొన్నాల ఆరోపించారు.