కేసీఆర్ అబద్ధాల్లో శిశుపాలుడు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పడంలో శిశుపాలుడని పీసీసీ అధికార ప్రతినిధి టి.జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తానని, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అని విద్యార్థులను మోసం చేశారన్నారు. కేసీఆర్‌కు, ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు నవంబర్ 7న సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రతిష్ట పెరిగినట్టుగా వస్తున్న సర్వేలన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు.
డీకే అరుణకు భయపడుతున్న కేసీఆర్: మాజీ మంత్రి డి.కె.అరుణకు సీఎం భయపడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి, కేసీఆర్ అన్న కూతురు ఆర్.రమ్య అన్నారు. అరుణపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని, కాంగ్రెస్ నేతలను అవమానించేలా మాట్లాడిన ఎంపీ కవితకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.