సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల మూడేళ్ల బకాయిలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెండింగ్‌లో పడిపోయిన ఫీజు బకాయిలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాఖలవారీగా ఉన్న పెండింగ్ బిల్లులను సమీక్షించి తాజాగా రూ. 1,588.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2017–18 వార్షిక సంవత్సరంలో మొదటి, రెండో త్రైమాసికాల్లో రూ. 865.60 కోట్లు విడుదల చేసింది. తాజా నిధుల మంజూరుతో ఈ వార్షిక సంవత్సరంలో ఏకంగా రూ. 2,454.30 కోట్లు విడుదల చేసినట్లైంది. సాధారణంగా ప్రభుత్వం ఫీజు బకాయిలను వార్షిక సంవత్సరం చివరల్లో విడుదల చేసేది. కానీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈసారి నవంబర్ నాటికే పూర్తి నిధులు మంజూరు చేసింది.
ఉరుకులు..పరుగులు..
ఫీజు బకాయిల మంజూరుతో సంక్షేమశాఖలు కొత్త కళను సంతరించుకున్నాయి. మొన్నటి వరకు ఫీజులు, ఉపకార వేతన దరఖాస్తులు పరిశీలించిన అధికారులు తాజాగా వాటి పరిష్కారానికి ఉపక్రమించారు. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 13.67 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 98 శాతం మంది విద్యార్థులు ఆయా పథకాలకు అర్హత సాధించారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో వాటిని జిల్లాలవారీగా విభజించిన రాష్ట్ర సంక్షేమ శాఖలు... బిల్లులు రూపొందించాలని జిల్లా సంక్షేమశాఖలకు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో జిల్లా కార్యాలయాల్లో అధికారులు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. ఫ్రెషర్స్, రెన్యూవల్స్ కేటగిరీల్లో ప్రాధాన్యత క్రమంలో బిల్లులు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం నిధులు సంతృప్తికరంగా రావడంతో 2014–15, 2015–16 బకాయిలతోపాటు 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేసే అవకాశం ఉందని ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు.
ఖజానా విభాగానికి బిల్లులు...
ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా వాటిని నేరుగా విద్యార్థులు, కళాశాలల ఖాతాల్లో జమ చేసే అధికారం సంక్షేమాధికారులకు లేదు. దరఖాస్తులవారీగా వాటిని పరిశీలించి బిల్లులను ఖజానాశాఖకు సమర్పించడం వరకే వారి ప్రమేయం ఉంటుంది. అలా సమర్పించిన బిల్లులను ఖజానా విభాగం అధికారులు మళ్లీ పరిశీలించి లబ్ధిదారుల ఖాతాలకు నిధులను జమ చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా సంక్షేమాధికారులు బిల్లులు రూపొందిస్తున్నారు. డిసెంబర్‌లోగా పూర్తిస్థాయిలో బిల్లులు తయారు చేసి ఖజానా కార్యాలయాలకు పంపించనున్నట్లు సంక్షేమాధికారులు చెబుతున్నారు. మొత్తంగా వచ్చే నెలాఖరులోగా బకాయిల విడుదల పూర్తయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment