
నారాయణరెడ్డి చెంపలు వాయించిన కోమటిరెడ్డి
భువనగిరి–యాదాద్రి డీసీసీ సమీక్షలో భౌతిక దాడులు
సాక్షి, హైదరాబాద్: భువనగిరి–యాదాద్రి డీసీసీ అధ్యక్షుని ఎన్నిక రసాభాసగా మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు దిగారు. నల్లగొండ జిల్లా నుంచి విడిపోయిన భువనగిరి–యాదాద్రికి డీసీసీ అధ్యక్షు ని ఎంపికపై ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి మధ్య మాటామాటా పెరిగి, భౌతిక దాడుల దాకా వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు... యాదాద్రి డీసీసీ అధ్యక్షునిగా ఎవర్ని ఎంపిక చేస్తే బాగుంటుందనే చర్చ మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడైన మాజీ ఎమ్మెల్యే బి.భిక్షమయ్యగౌడ్ ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.
ఆయన్ను ఎంపిక చేయడమే మంచిదని నారాయణరెడ్డి చెప్పారు. దీనిపై అభిప్రాయం ఏమిటని రాజగోపాల్‌రెడ్డిని దిగ్విజయ్ అడిగారు. ‘నా అభిప్రాయానికి విలువిచ్చి.. నేను చెప్పిన వ్యక్తికే డీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇస్తామంటే పేరు చెప్తా. నా అభిప్రాయం ప్రకారమే ఎంపిక ఉండాలి’ అని బదులిచ్చారు. దీనిపై నారాయ ణరెడ్డి జోక్యం చేసుకుంటూ ‘రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులు చేసి కోట్లు సంపాదించారు. వాటితో రాజకీయాలు చేస్తున్నారు. ఆయనను పట్టించుకోవాల్సిన పనిలేద’ని అన్నారు. దీనికి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహంగా ‘బ్రోకర్ పనిచేసి రాజకీయాలు చేస్తున్నది నారాయణ రెడ్డి. నయీంతో భూముల దందాలు చేసిన చరిత్ర నీది. నీతిగా కాంట్రాక్టులు చేస్తున్న నా గురించి మాట్లాడతావా’ అంటూ స్పందించా రు. మాటామాటా పెరిగి నారాయణరెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి చెంప ఛెళ్లుమనిపించారు. ఈ ఘటనతో దిగ్విజయ్, ఉత్తమ్‌తోపాటు నేతలంతా నివ్వెరపోయారు. వెంటనే తేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కొందరు నేతలకు స్వల్ప గాయాలైనట్టు తెలిసింది.