
అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌పై టీఆర్‌ఎస్‌నజర్!
* పుష్కర పర్యటన పొడవునా ఆయనకు ప్రాధాన్యమిచ్చిన సీఎం
* అలంపూర్‌కు వరాలు... సంపత్ విజ్ఞప్తి వల్లేనంటూ వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు పర్యటన ఆసాంతం అధిక ప్రాధాన్యమివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం బస చేసిన స్థానిక పర్యాటక శాఖ అతిథి గృహానికి వెళ్లిన సంపత్‌కు ఊహించని ఆదరణ లభించింది. సీఎంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గ సమస్యలను నివేదించారు.
మంత్రులు, అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలెవరితోనూ పర్యటనలో సీఎం ఇలా ప్రత్యేకంగా భేటీ కాలేదు. సంపత్‌కు ఆయన ఇంత ప్రాధాన్యం ఇవ్వడంపై పలు ఊహాగాలు వెలువడుతున్నాయి. సంపత్ తన అలంపూర్ నియోజకవర్గ సమస్యలపై పలు వినతిపత్రాలను సీఎంకు అందజేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. సీఎం స్థాయి నాయకుడు పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యలు తదితరులు ఇలా వినతిపత్రాలివ్వడం పరిపాటే అయినా, సంపత్ వినతుల్లో చాలావాటిని అక్కడికక్కడే పరిష్కరించడానికి కేసీఆర్ మొగ్గుచూపారు! అంతేగాక అక్కడికక్కడ విలేకరుల సమావేశంలోనే అలంపూర్‌పై వరాల జల్లు కురిపించడం మరింత ఆసక్తి రేపుతోంది.
అంతేకాదు... అలంపూర్‌కు 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తున్నట్లు సమావేశంలో ప్రకటించిన సీఎం, ఈ విషయాన్ని సంపత్ తన దృష్టికి తెచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు! అలాగే, ‘‘సంపత్ కోరినట్టుగా ఆర్టీసీ డిపో మంజూరు చేయలేం. కాకపోతే ఆయన కోరినట్టుగా ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ నుంచి సాగునీరు అందజేస్తాం’’ అంటూ విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన సంపత్ పేరును సీఎం పదేపదే ఉటంకించారు. అంతేగాక మీడియా సమావేశం ప్రారంభమవగానే సంపత్‌ను సీఎం తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇది కూడా సీఎం ఆయనకిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమేనని అంటున్నారు.
ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ సమస్యలను సీఎం ప్రస్తావిస్తూ వీలైనప్పుడల్లా సంపత్ పేరును ఉటంకించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేత అని, పలు అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని కూడా అన్నారు. ఇదంతా భావి రాజకీయ పరిణామాలకు సూచికేనని టీఆర్‌ఎస్ శ్రేణులే అంటుండటం విశేషం! అయితే సంపత్ మాత్రం తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాననని, పేదల సమస్యలను విన్నవించడం తప్ప తమ భేటీకి మరో ప్రాధాన్యమేమీ లేదని కొందరు పాత్రికేయులతో అనడం విశేషం.