
చంద్రన్న కానుకల్లో భారీ అవినీతికి రంగం సిద్ధం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్భాటంగా ప్రవేశపెట్టిన చంద్రన్న కానుకల్లో మరోసారి భారీ అవినీతికి రంగం సిద్ధమైంది. సుమారు రూ.400 కోట్ల మేరకు హాంఫట్ చేసేందుకు సర్వం సమాయత్తం అయింది. హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో ఈ తతంగం అంతా నడుస్తోంది. అక్రమార్కులు నిన్నటి నుంచే ఓ హోటల్లో మకాం వేశారు. హోటల్లో మకాం వేసిన అక్రమార్కులు 60 ల్యాప్ ట్యాపుల ద్వారా ఈ-టెండర్‌కు వేస్తున్నారు.
ఇక రివర్స్ బిడ్ పేరులో కూడా భారీగా రింగ్ అయ్యారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. చంద్రన్న కానుక ద్వారా 6 వేర్వేరు రకాలు...ఒకో వస్తువుకు ఒక్కో నిబంధన ఉంది. (చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట అర కిలో కందిపప్పు, కిలో శెనగలు, అరకిలో బెల్లం, కిలో గోధుమ పిండి, అరకిలో పామోలిన్, 100 గ్రాముల నెయ్యి ఇలా ఆరు రకాల వస్తువులను అందిస్తారు)
ఒక దానిపై ట్యాక్స్, మరో దానిపై ట్యాక్స్ లేకుండా పరాయి రాష్ట్రంలో కొందరు వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేషీలో వ్యక్తులకు సంబంధాలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పై స్థాయి నుంచి కింద స్థాయి వరకూ పంపకాలకు సిద్ధమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా చంద్రన్న కానుకలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.