పంజగుట్ట: పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న దొంగను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు పది లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన అబ్బూరి సోమయ్య అలియాస్ శ్రీకాంత్ చౌదరి అలియాస్ అక్కినేని అలియాస్ కార్తీక్ (35) 2007లో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి ఇతని నేరచరిత్ర ప్రారంభం అయింది. అదే ఏడాది మొట్టమొదటి దొంగతనం వైజాగ్‌లో చేసి పోలీసులకు చిక్కాడు. తరువాత త్రివేండ్రం, బెంగళూరు, చెన్నైతోపాటు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ఉన్న 41 కేసుల్లో కేవలం చెన్నైలోనే 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అక్కడి పోలీసులు ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు.
కేవలం పదో తరగతి చదివిన సోమయ్య తెలుగు, తమిళం, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలడు. ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని వారిని ప్రలోభపెట్టి బంగారు ఆభరణాలు, ఖరీదైన సెల్‌ఫోన్లు దొంగిలించుకొని పారిపోతాడు. ఇలా ఇతనిపై నర్సారావుపేట, విజయనగరం పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఖరీదైన హాస్టళ్లలో ఉంటూ వ్యాపారవేత్తగా చెప్పుకొని పలువురితో స్నేహాలు చేసి, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ఐపాడ్‌లు కాజేస్తాడు. కారు డ్రైవింగ్ రాకపోవటంతో క్యాబ్‌లలో తిరుగుతూ డ్రైవర్ల దృష్టి మరల్చి వారి ఖరీదైన ఫోన్లు కూడా మాయం చేస్తుంటాడు.
ఇతనికి దక్షిణ భారతదేశంలోని తెలియని దేవాలయం లేదు. ఆయా ఆలయాల ఉన్నతాధికారులతో ఇతనికి పరిచయాలున్నాయి. దొంగసొత్తు కొంత నేరుగా ఆయా ఆలయాల ఈవో వద్దకు వెళ్లి పరిచయం చేసుకొని చందాల రూపంలో సమర్పించి ఈవోల గదిలోనే బస చేస్తాడు. ఇతనికి అన్నింటికన్నా సేఫ్ ప్లేస్‌దేవాలయాల ఇఓల గదులే. సోమయ్యకు మద్యం అలవాటు లేదు. ఖరీదైన ఫోన్లు వాడుతూ అద్దె కార్లలో తిరుగుతూ జల్సా చేస్తుంటాడు. శ్రీనగర్‌కాలనీలో దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పంజగుట్ట పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇతని నుంచి 13 ల్యాప్‌టాప్‌లు, ఒక యాపిల్ ఐ పాడ్, 14 ఖరీదైన సెల్‌ఫోన్లు, ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని డీసీపీ తెలిపారు.
ఘరానా దొంగ.. ఖరీదైన దొంగ
Published Sat, Jul 9 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement
Advertisement