మందు..కౌన్సెలింగ్ ముందు..
♦ బార్‌లో అడుగుపెట్టినప్పట్నుంచే కౌన్సెలింగ్ షురూ
♦ మద్యం మోతాదు, జాగ్రత్తలను వివరించనున్న సిబ్బంది
♦ తాగి వాహనం నడపొద్దంటూ మందుషాపుల ముందు బ్యానర్లు
♦ మార్చి 23లోగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ నోటీసులు
సాక్షి, హైదరాబాద్
‘సార్.. మీరిప్పటికే రెండు పెగ్గులు తాగారు? మీ శరీరం ఇంతకు మించి ఆల్కహాల్‌ను భరించ లేదు. ఇక ఆర్డర్ తీసుకోం..’
‘మందు తాగిన తర్వాత మీరే డ్రైవింగ్ చేస్తారా? డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? లేదంటే టాక్సీని ఏర్పాటు చేసుకోండి..’
‘మీరే సొంతగా డ్రైవింగ్ చేస్తే బ్రీత్ ఎనలైజర్‌తో మీ ఆల్కహాలు మోతాదు పరీక్షించుకోండి..’
రాబోయే రోజుల్లో మద్యం విక్రయించే బార్లు, క్లబ్బులు, మద్యం దుకాణాల పర్మిట్ రూమ్‌లలో వినిపించబోయే మాటలివీ! మద్యం వ్యాపారులు తమ వద్దకు వచ్చే వినియోగదారుల పరిస్థితిని చూసి ఆర్డర్లు తీసుకునే పరిస్థితి రానుంది. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మార్చి నుంచే ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. వినియోగదారులకు ‘తల తిరిగేలా’ మద్యం సరఫరా చేయడాన్ని, తాగిన వ్యక్తి వాహనం నడపకుండా ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా బార్ల యజమానులకు కూడా బాధ్యతలను అప్పగించింది. మద్యం సేవించి వాహనం నడపకుండా బార్ లేదా క్లబ్ నుంచే తగిన కౌన్సెలింగ్ మొదలయేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్చి 23లోగా రాష్ట్రంలోని సుమారు 800 బార్లతోపాటు క్లబ్బులు, మద్యం దుకాణాల పర్మిట్ రూమ్‌లలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ నోటీసులు జారీ చేశారు. మార్చి 23 తర్వాత ఎక్సైజ్ శాఖ తనిఖీలు జరుపుతుందని అందులో పేర్కొంది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైతే మరిన్ని చర్యలు చేపట్టాలని అకున్ సబర్వాల్ యోచిస్తున్నారు.
మధుశాలల్లో ఇవి తప్పనిసరి!
రాష్ట్రవ్యాప్తంగా బార్లు, క్లబ్బులు, పర్మిట్ రూమ్‌ల వద్ద ‘మద్యం సేవించి వాహనం నడపకూడదు’ అని రాసిన బ్యానర్లు/ పోస్టర్లను తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఇవి 2 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో ఉండాలి. మందు దుకాణాల పరిసరాల్లో కూడా ఇలాంటి పోస్టర్లను ఏర్పాటు చే యాలని మద్యం వ్యాపారులకు పంపిన ఆదేశాల్లో సబర్వాల్ పేర్కొన్నారు. బార్ లోపలికి వచ్చి టేబుల్ ముందు కూర్చోగానే టేబుల్‌పై ఏర్పాటు చేసే ఫ్లైయర్స్, ఇన్‌ఫో షీట్లపైన కూడా మద్యం సేవించి వాహనం నడపకూడదనే సమాచారాన్ని ముద్రించిన డిస్‌ప్లేలు ప్రదర్శించాలి. అలాగే ఆర్డర్ తీసుకునే సిబ్బంది.. మద్యం సేవించిన తర్వాత వాహనం నడిపే వ్యక్తి ఎవరో వినియోగదారుడి నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఒక గ్రూప్‌గా వచ్చిన వారిలో అందరూ మద్యం తీసుకొని ఉంటే.. టాక్సీని ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంగా తెలియజేయాలి. అప్పటికీ వినకపోతే యజమానికి విషయం తెలపాలి. బైక్‌పై వచ్చిన కస్టమర్లు మద్యం ఆర్డర్ చేసినప్పుడే తాగి వాహనం నడపొద్దని వివరించాలి. మధుశాలల్లో బ్రీత్ ఎనలైజర్‌ను ఏర్పాటు చేసి, కస్టమర్లు ఎంత మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నారో తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే బ్రీత్ ఎనలైజర్ ఏర్పాటుపై ఎలాంటి బలవంతం లేదని సబర్వాల్ వివరించారు.