-కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక ఇళ్లలో చోరీలు
-అరెస్ట్ చేసిన మేడిపల్లి పోలీసులు
-రూ.5 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
బోడుప్పల్ (హైదరాబాద్) : ఇళ్లలో చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న దంపతులను మంగళవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.5 లక్షల విలువైన వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డీఐ నవీన్ కుమార్ సమాచారం మేరకు... తుకారం గేట్ వద్ద నివసించే బల్లం ప్రభాకర్(32), శ్రావణి(25)లు దంపతులు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందున వారు చోరీల బాటపట్టారు.
చోరీలు :
బోడుప్పల్ సాయివెంకట్ రెడ్డి కాలనీలో 2015 నవంబర్ 21న రమాకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. రెండు సిలిండర్లు, ల్యాప్‌టాప్ పోయాయి. బాలాజీ హిల్స్ కాలనీలో 2016 ఫిబ్రవరి 25న పి.భవానీ ఇంట్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనం చోరీకి గురైంది. అక్షయనగర్ కాలనీలో కె.ఉదయ్‌కుమార్‌గౌడ్ ఇంట్లో మార్చి 11న బంగారం, వెండి వస్తువులు, ఎల్‌సీడీ, ద్విచక్రవాహనం మాయమయ్యాయి. మార్చి 15న శ్రీసాయి నగర్‌లో జగంటి చంద్రమౌళి ఇంటి తాళాలు పగులకొట్టి బంగారం, వెండి వస్తువులు, టీవీ, ఎల్‌సీడీ, నగదు ఇతర వస్తువులు పోయాయి. ఏప్రిల్ 12న అన్నపూర్ణ కాలనీలో నివసించే టి.వెంకటేశ్ ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. శ్రీసాయినగర్ కాలనీలో బి.వెంకటేశం ఇంట్లో ఏప్రిల్ 13న దుస్తులు, కరెంట్ మోటార్, డీవీడీ ప్లేయర్ మాయమయ్యాయి.
బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోడుప్పల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రభాకర్, శ్రావణిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దొంగతనాలు చేస్తున్నామని అంగీకరించారు. దీంతో వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు టీవీ సెట్స్, మూడు గ్యాస్ సిలిండర్లు, 12 తులాలు బంగారం, ఒక కిలో వెండి మొత్తం రూ.5 లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించాము అని డీఐ వివరించారు.
చోరీల బాట పట్టిన దంపతులు అరెస్ట్
Published Tue, Apr 26 2016 7:20 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement