బంజారాహిల్స్: తాను ప్రేమిస్తున్న యువకుడిని తమ బంధువుల అమ్మాయే పెళ్లి చేసుకుంటుందన్న అక్కసుతో ఆమెపై హత్యాయత్నం చేసిన యువతికి న్యాయమూర్తి ఐదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించారు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట్ల గ్రామానికి చెందిన పల్లకొండ మమత (27)కు వర్దన్నపేట మండలం ఐలోను గ్రామానికి చెందిన పల్లకొండ దివ్యశ్రీ(23) దగ్గరి బంధువు. 2013 మార్చి 9వ తేదీన దివ్యశ్రీకి వరంగల్ వాసి కుమార్(32)తో నిశ్చితార్ధం జరిగింది. అదే ఏడాది జూన్ 13వ తేదీన వీరి పెళ్లిని నిశ్చయించారు. అయితే మమతకు కుమార్‌తో అప్పటికే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో కుమార్, దివ్యశ్రీ పెళ్లిని మమత జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఆమె దివ్యశ్రీని అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది.
కుమార్ ప్రవర్తన మంచిది కాదని.. అతడు మరో అమ్మాయిని ప్రేమించి హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుంటున్నాడని దివ్యశ్రీని నమ్మించింది. కావాలంటే చూపిస్తానంటూ ఆమెను 2013 మే 4వ తేదీన శ్రీకృష్ణానగర్‌లో నివసించే తన సోదరి స్వరూప ఇంటికి తీసుకొచ్చింది. కూరగాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా పొడిచింది. ‘నేను ప్రేమిస్తున్న కుమార్‌ను పెళ్లి చేసుకుంటావా...? అతడిని నీకు దక్కనివ్వను’ అంటూ 9 చోట్ల గాయపరిచింది. దివ్యశ్రీ తన ఫోన్‌తో కుమార్‌కు, తన తండ్రి సారయ్యకు విషయాన్ని తెలిపింది. దీంతో వారు సమీపంలోనే ఉంటున్న తమ బంధువులను సంఘటనా స్థలానికి పంపించి దివ్యశ్రీని ఆసుపత్రికి తరలించారు.
దివ్యను చంపేయటం, కుదరకుంటే అందవికారంగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్న మమతపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 307కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు రుజువు కావడంతో మంగళవారం నిందితురాలు మమతకు న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.