'నన్ను ఓడించడానికి సీపీఎం అమ్ముడుపోయింది'
సీపీఎంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి కె.నారాయణ నిప్పులు చెరిగారు. సీపీఎం రాజకీయాలు ఊసరవెల్లిని మించిపోయాయని ఆయన ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లో నారాయణ మాట్లాడుతూ... ఒకే పార్టీ మూడు ప్రాంతాల్లో ముగ్గురితో పొత్తు పెట్టుకోవడంపై ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన సీపీఎంకు హితవు పలికారు. 1999 నాటి ఎన్నికల్లో పువ్వాడను ఓడించడానికి రూ. 75 లక్షలకు సీపీఎం అమ్ముడుపోయిందని నారాయణ గుర్తు చేశారు.
నేటి ఎన్నికల్లో తనను ఓడించడానికి సీపీఎం పార్టీ రూ. 15 కోట్లకు అమ్ముడుపోయిందని ఖమ్మం జిల్లా ప్రజలలో తీవ్రంగా చర్చ జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో సీపీఐను ఓడించడం కోసమే సీపీఎం ఎన్నికల బరిలో నిలిచిందని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో లోక్సత్తా అధినేత జేపీ, మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డిలు రాజకీయ బఫూన్లుగా మిగిలారని ఆయన ఎద్దేవా చేశారు. పొన్నాల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయినా ఆయనకు పవర్స్ లేవని నారాయణ విమర్శించారు.