కారు ఎక్కుతారా లేక 'చేయి'స్తారా?
హైదరాబాద్ : తెలంగాణలో సీపీఐతో పొత్తు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో సీపీఐ పొత్తు ఖరారు అయిన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో టీఆర్ఎస్ నేతలు కేశవరావు, వినోద్ కుమార్ సోమవారం భేటీ అయ్యారు. పొత్తులపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పొత్తుల విషయంలో టీఆర్ఎస్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న నారాయణను టీఆర్ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సీపీఐకి ఒక ఎంపీ స్థానం, 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకరించిందని టీపీసీసీలోని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొదట సీపీఐ మూడు ఎంపీ స్థానాలు(ఖమ్మం, భువనగిరి, నల్లగొండ), 20 అసెంబ్లీ స్థానాలను అడిగింది.
పొత్తులపై చర్చలు సాగుతున్న దశలో కనీసం 14 అయినా ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే తమకున్న ఇబ్బందుల దృష్ట్యా 12కు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో సీపీఐ వాటికే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీపీఐ .... కారు ఎక్కుతుందా లేక చేయి అందుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.