రైతులపాలిట శాపంగా భూసేకరణ: తమ్మినేని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ అన్యాయంగా రైతుల పాలిటి శాపంగా మారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా 123 జీవో ప్రకారం ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ చేస్తోందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు చేస్తున్న భూ సేకరణ వ్యతిరేకంగా పాదయాత్రలు చేస్తున్నామని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో పర్యటించనున్నట్లు చెప్పారు. కేసీఆర్ సర్కారు చాలా అక్రమంగా వ్యవహరిస్తోందని, 2013 చట్టం ప్రకారం లేదా 123 జోవో ప్రకారం రెండు విధానాల్లో పరిహారం ఇస్తామంటున్నా సీఎం దానిపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు.
ముఖ్యమంత్రి చెబుతున్నదానికి వ్యతిరేకంగా ఓ వైపు హరీశ్ రావు బెదిరింపులకు దిగుతున్నారని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. భూ నిర్వాసితుల కోసం పాదయాత్రలు చేస్తున్న వారిపై పోలీసులతో అణిచివేస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో పౌరహక్కుల గూర్చి మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడేందుకు పౌరహక్కులు కాలరాసేలా పోలీసులతో బల ప్రయోగం చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. భూ సేకరణ కోసం 2013 చట్టం ఉపయోగించాలని, ఈనెల 26న భూ నిర్వాసితుల కోసం హైదరాబాద్ ఇందిరాపార్కువద్దా ధర్నా నిర్వహిస్తున్నట్లు తమ్మినేని తెలిపారు.
ఈ ధర్నాలో సీపీఎం జాతీయ నాయకురాలు బృందకారత్ ముఖ్య అథితిగా పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. భూ సమస్యపై ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రజల్లో ఎక్కువ స్పందన వస్తోందన్నారు. రైతుల్లో సర్కారుపై తీవ్ర అసంతృప్తి ఉందని, రాష్ట్రంలో వివిధ సమస్యలపై కొన్నింటికి ప్రజలు బాగా స్పందిస్తున్నారన్నారు. వచ్చే నెల 16,17,18 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , రామచంద్రన్ పిళ్ళై పాల్గొంటారన్నారు.