బెట్టింగ్..సెట్టింగ్
నగరవాసుల క్రికెట్ క్రేజీని క్యాష్ చేసుకునేందుకు బుకీలు సన్నద్ధమయ్యారు. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో చాకచక్యంగా ముందుకుసాగుతున్నారు. పోలీసులకు చిక్కకుండా హైటెక్నాలజీ, సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా బెట్టింగ్‌కు అన్ని సెట్ చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద : క్రికెట్ బెట్టింగ్ నిరోధానికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, బుకీలు మాత్రం కొంత పంథాలో ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్రపంచ కప్ క్రికెట్‌లో బెట్టింగ్ కోసం బుకీలు సోషల్ మీడియానూ ఆశ్రయిస్తున్నారు. మరోవైపు నగరంలో బెట్టింగ్ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు సిద్ధమవుతున్నారు.
ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ సుమారు రెండు నెలల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరుగనుం ది. ఆదివారం జరిగే పాక్, ఇండియా మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో నగరంలో పట్టుబడిన క్రికెట్ బుకీల వివరాలను జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు తెప్పిం చుకున్నారు. వారిపై నిఘా పెట్టారు.
హుక్కా సెంటర్లలో..
పేరు మోసిన బుకీలతో పాటు ఈ సారి హుక్కా సెంటర్ల నిర్వాహకులు కూడా బుకీల అవతారం ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని హుక్కా సెంటర్లలో పెద్ద పెద్ద ఎల్‌సీడీ టీవీలు ఏర్పాటు చేశారు. వారంలో 1000కిపైగా ఎల్‌సీడీ టీవీలు నగరంలో అమ్ముడయ్యాయి. వీటిని క్రికెట్ మ్యాచ్‌ల కోసమే ఖరీదు చేశారు.
ముందుగానే గదుల బుకింగ్..
నగరం, శివార్లలోని కొన్ని లాడ్జీల్లో బుకీలు ముందుగానే కొన్ని గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ జరిగే రోజున లాడ్జీలో ల్యాప్‌టాప్‌లు, టీవీలు ద్వారా వీరు దందా నిర్వహిస్తారు. ఆన్‌లైన్ బ్యాకింగ్ ద్వారా బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తారు. అలాగే కొందరు శివారులోని ఫాం హౌస్‌లు, రిసార్ట్స్‌లను కేంద్రంగా చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది.
ముంబై మాఫియా..
నగరంలోని బెట్టింగ్ కేంద్రాలకు ముంబై మాఫియా హస్తం ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్న సందర్భాల్లో ఈ విషయం వెల్లడైంది. నగరంలో నడిచే క్రికెట్ బెట్టింగ్‌లో ముంబై నుంచి బెట్టింగ్‌లు నడుస్తాయి.
గతంలో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు..
ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు గతేడాది ఫిబ్రవరి 1న రట్టు చేశారు. బుకీలు మహ్మద్ అబ్దుల్ ఖదీర్(5 2), షేక్ మహమూద్ గౌస్ (49), షేక్ సమీర్ బాషా (27), షేక్ ఇమ్రాన్ (34), మహ్మద్ ఖాన్ (30), జి.కిరణ్ కుమార్ (35), షేక్ చాంద్ పాషా (29), అబ్దుల్ ఇ మ్రాన్ (45)తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
సిబ్బందిని అప్రమత్తం చేశాం..
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు, బుకీలపై నిఘా పెట్టాం. ఈ మేరకు అన్ని జోన్‌ల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. లాడ్జీలు, హుక్కా సెంటర్లపై వరుస తనిఖీలు చేపడుతున్నాం. నగరంలో బెట్టింగ్ జరగకుండా చూస్తాం. ఇందుకోసం సర్వం సిద్ధం చేశాం. బెట్టింగ్‌పై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి.
- లింబారెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ