నిందితుల వివరాలు వెల్లడిస్తున్న దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు
ప్రకాశం, అద్దంకి: అద్దంకిలో నిన్న మొన్నటి వరకూ మూడు పువ్వులు ఆరు కాయాలుగా క్రికెట్ బెట్టింగ్ నడిచింది. పక్షం రోజులుగా పోలీసులు నిఘా ఉంచారు. బంగ్లా రోడ్‌లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న కొంతమందిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం మేరకు తీగ లాగితే డొంక కదిలింది. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, బెట్టింగ్ రాయుళ్లతో కలుపుకుని మొత్తం 25 మంది ఉన్నట్లు గుర్తించి వారిలో 15 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ కె.నాగేశ్వరరావు చెప్పారు. డీఎస్పీ కథనం ప్రకారం.. అద్దంకి పట్టణంలో కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌కు ప్రధాన సూత్రధారులున్నట్లు సీఐ హైమారావుకు సమాచారం అందింది. ఆయన నిఘా ఉంచారు.
పట్టణంలోని బంగ్లా రోడ్‌ను అడ్డాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు ఆయన నిర్ధారించుకున్నారు. తొలుత ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నగదు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 15 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వారినీ త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన వారిలో నన్నాబత్తిన విశ్వరూపాచారి, కాటూరి రాంబాబు, డి.వెంకటేశ్వర్లు, బి.శివశంకర్, కె.నాగరాజుతో పాటు మరో పది మంది ఉన్నారు. నిందితుల నుంచి రూ.2,36,100 నగదు, 2.5 కిలోల గంజాయి, బెట్టింగ్‌ల కోసం ఉపయోగించే (లైవ్ క్రికెట్ చూడటం కోసం) 15 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఆట ఇలా..
ప్రధాన నిందితులు తమ సెల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న క్రికెట్ యాప్ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడతారు. అందులో ప్యావరేట్, ఈటింగ్ అనే గుర్తులతో బెట్టింగులు కాచే వారి స్థాయిని నిర్ణయిస్తారు. ప్యావరేట్ అంటే రూ.10 వేలు కాస్తే, గెలిస్తే రూ.8 వేలు వస్తాయని చెబుతారు. ఈటింగ్‌లో 8,300 కాస్తే గెలిస్తే రూ.10 వేలు వస్తాయంటారు. తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ హైమారావు, అద్దంకి, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్‌ఐలు సుబ్బరాజు, పాండురంగారావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment