
27న వెళ్లాల్సింది హెచ్‌ఓడీలే..
ఉద్యోగులకు సీఎస్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఈనెల 27న వెళ్లాల్సింది హెచ్‌ఓడీలు మాత్రమేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం తన ఛాంబర్ ఎదుట భైఠాయించిన సచివాలయ ఉద్యోగుల వినతి పత్రం స్వీకరించిన తర్వాత ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిపై వివరణ ఇచ్చారు. శాఖాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాల ఉద్యోగులు మాత్రమే ఈ నెల 27వ తేదీలోగా కొత్త రాజధానికి వెళ్లాల్సి ఉంటుందని సర్క్యులర్ ఇచ్చామన్నారు. అయితే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని, అవి సిద్ధమైన తర్వాతే సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మొత్తం మీద 60 రోజుల్లో సచివాలయాన్ని పూర్తి స్థాయిలో తరలిస్తామని చెప్పారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. తరలింపుపై రెండు మూడు రోజుల్లో రోడ్ మ్యాప్ ఖరారు చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని పరిశీలించేందుకు సచివాలయం ఎల్ బ్లాక్ ఏడో అంతస్తులో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అమరావతికి వెళ్లడానికి ఇబ్బందులున్న వారు హెల్ప్‌డెస్క్‌లో వినతులు ఇవ్వవచ్చన్నారు.
సిద్ధపడిన వాళ్లనే తరలించాలి..:ఏపీ కొత్త రాజధాని అమరావతికి వెళ్లడానికి సిద్ధపడిన వాళ్లను మాత్రమే తీసుకువెళ్లాలని సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడు, ఏపీ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి కోరారు. సీఎస్‌కు వినతి పత్రం సమర్పించిన తర్వాత సచివాలయం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకం కాదని.. అయితే కనీస వసతులు కల్పించాలని కోరుతున్నట్లు సచివాలయం గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. తరలింపు అంశంతో చాలా సమస్యలు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలతో పాటు ఇక నుంచి ఉద్యోగస్తుల ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉందని సచివాలయం ఉద్యోగ సంఘం నేత బాబూరావు సాహెబ్ ఆందోళన వ్యక్తం చేశారు.