డామిట్‌...సీన్‌ రివర్స్‌! | Damit ... scene reverse! | Sakshi
Sakshi News home page

డామిట్‌...సీన్‌ రివర్స్‌!

Published Thu, Jun 22 2017 1:22 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

డామిట్‌...సీన్‌ రివర్స్‌! - Sakshi

డామిట్‌...సీన్‌ రివర్స్‌!

అనుకున్నదొకటి..అయినదొక్కటి..అన్నట్లుంది జీహెచ్‌ఎంసీ పరిస్థితి. ప్రభుత్వ భూముల్లో వెలిసిన లక్షకుపైగా అక్రమ భవనాల నుంచి సూపర్‌ స్ట్రక్చర్స్‌ ట్యాక్స్‌ (ఆస్తి పన్ను తరహాలోనే..) రూపంలో ఏటా రూ.40 కోట్లు ఆర్జించవచ్చని అంచనా వేశారు. అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించారు కూడా. తీరా నోటీసులు జారీ చేసే నాటికి సీన్‌రివర్స్‌ అయింది. కేవలం 1506 భవనాలకు పన్ను చెల్లించాలని నోటీసులిచ్చారు. వీటి నుంచి కేవలం రూ.40 లక్షలే వచ్చే అవకాశం ఉంది. ఇదేంటని ప్రశ్నిస్తే...అక్రమ నిర్మాణాలను వెదుకుతున్నామని...దొరకగానే నోటీసులిస్తామంటున్నారు. కానీ...దీనివెనుక అసలు మతలబు ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణదారులతో లాలూచీపడి కొందరు గ్రేటర్‌ ఆదాయానికి గండికొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


సిటీబ్యూరో: అనుకున్నదొకటి..అయినదొక్కటి..అన్నట్లుంది జీహెచ్‌ఎంసీ పరిస్థితి. నగరంలో చెరువులు, నోటరైజ్ట్, యూఎల్‌సీ, దేవాదాయ, వక్ఫ్‌ , తదితర ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ భవనాలు లక్షకు పైగా ఉన్నట్లు అంచనా వేశారు. వాటన్నింటికీ ఆస్తిపన్ను (సూపర్‌ స్ట్రక్చర్స్‌ ట్యాక్స్‌) వసూలు చేస్తే పెనాల్టీలతో సహా జీహెచ్‌ఎంసీకి ఎంత లేదన్నా ఏటా రూ. 40 కోట్ల ఆదాయం వస్తుందని భావించారు. వాటిని కూల్చివేసేంత వరకు ఈ ఆదాయం పొందవచ్చని భావించారు. ఆమేరకు అనుమతించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులు గత నవంబర్‌లో  ప్రభుత్వానికి నివేదించారు.

అందుకు ప్రభుత్వం సైతం ఆమోదం తెలపడంతో అక్రమంగా నిర్మించిన భవనాలకు నోటీసులు జారీ చేసి పెనాల్టీతో సహా ఆస్తిపన్ను  వసూలు చేయాలని భావించారు. దాదాపు ఆర్నెళ్లుగా ఈ పనిచేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసిన అక్రమ నిర్మాణాలు 1506 మాత్రమే. మిగతా వాటికి ఎందుకు నోటీసులు జారీ చేయలేదంటే సదరు భవనాలను వెతుకుతున్నామనే సమాధానాలు వస్తున్నట్లు తెలిసింది. అంటే నిజంగానే సదరు అక్రమ నిర్మాణాలు దొరకక వెతుకుతున్నారా లేక అక్రమ నిర్మాణదారులతో  లాలూచీ పడి సంబంధిత అధికారులు వారికి నోటీసులే జారీ చేయలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అనుమతుల్లేకున్నా సదుపాయాలు..
ప్రభుత్వ భూములైన చెరువు స్థలాలు, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూముల్లో ఎలాంటి నిర్మాణ అనుమతులు తీసుకోకుండా భవనాలు నిర్మించుకున్నవారు లక్షమందికి పైగా ఉన్నారని జీహెచ్‌ఎంసీ అధికారులే ప్రాథమిక సర్వేలో అంచనా వేశారు. వారి నుంచి ఆస్తిపన్ను వసూలు చేస్తే వారు తమకు భూమిపై హక్కు ఉందని కోర్టులకు వెళతారనే అంచనాలతో ఎన్నో ఏళ్లుగా సదరు భవనాల నుంచి ఆస్తిపన్నే వసూలు చేయడం లేరు. ఎలాంటి అనుమతులు, సేల్‌డీడ్‌ పత్రాలు, తదితరమైనవేవీ లేకున్నా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవడంతో స్థలంపై హక్కుకు వివాదాలు తలెత్తుతాయనే తలంపుతో వారినుంచి ఎలాంటి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు.

మిగతా వారితో పాటు రోడ్లు, పార్కులు, ఆటస్థలాలు, తదితర సదుపాయాలన్నీ కల్పిస్తున్నందున వారు పొందుతున్న ఈసేవలకు పన్ను వసూలు చేయవచ్చునని భావించారు. అయితే ఈ పన్నును సాధారణ ఆస్తిపన్నుగా కాక సూపర్‌ స్ట్రక్చర్స్‌ ట్యాక్స్‌గా పేరుపెట్టారు.  ఈపన్ను వసూలు కోసం ప్రభుత్వానికి నివేదించగా, అంగీకరించడంతో వసూలుకు నోటీసుల జారీ చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఆస్తిపన్ను కట్టనందున కనీసం మూడేళ్ల నుంచి పెనాల్టీలు కూడా విధించాలని భావించారు. తద్వారా ఏటా రూ. 40 కోట్లు వస్తాయని అంచనా వేశారు. తీరా ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో కేవలం 1506  మందికి మాత్రమే నోటీసులు జారీ కావడం చూసి ఉన్నతాధికారులు విస్తుపోయారు. వీటి ద్వారా దాదాపు రూ.40 లక్షలు మాత్రమే రాగలవని అంచనా.  మిగతా వారందరికీ నోటీసులు జారీ చేసి, సూపర్‌ స్ట్రక్చర్‌ పన్ను వసూలు చేయాల్సిందిగా  ఆదేశించారు. అయితే ఏ మేరకు ఈ పన్నులు వసూలవుతాయో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement