అక్రమాలపై అస్త్రం | Government Gaves Opportunity Complaint On illegal Structures Through TSBPAS | Sakshi
Sakshi News home page

అక్రమాలపై అస్త్రం

Published Thu, Nov 12 2020 2:56 AM | Last Updated on Thu, Nov 12 2020 3:00 AM

Government Gaves Opportunity Complaint On illegal Structures Through TSBPAS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మీ ప్రాంతంలో అక్రమ భవనాలు, లే–అవుట్లు నిర్మిస్తున్నారా? ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదా? భవన నిర్మాణాలు, ఇతరత్రా అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారా? దరఖాస్తు చేసుకున్న వెంటనే చకచకా అనుమతులొచ్చేస్తే బాగుండుననిపిస్తోందా?.. అయితే మీ సమస్యలు త్వరలోనే తీరనున్నాయి. తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం (టీఎస్‌–బీపాస్‌) ద్వారా అక్రమ/అనధికార నిర్మాణాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. అలాగే వివిధ నిర్మాణ అనుమతులు, ఎన్‌ఓసీల జారీకి ప్రభుత్వం తాజాగా కచ్చితమైన గడువులను నిర్దేశించింది.

ఇలా ఫిర్యాదుచేస్తే అలా ఆటకట్టు: అనుమతుల్లేకుండా లేదా అనుమతులు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై, మున్సిపల్‌ స్థలాలు, చెరువులు, శిఖం భూములు, ప్రైవేట్‌ స్థలాలను ఆక్రమించి దౌర్జన్యంగా నిర్మాణాలు సాగించడంపై ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా చాలా సందర్భాల్లో అధికారుల నుంచి స్పందన ఉండదు. లేదా అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుని వదిలేస్తుంటారు. ఇకపై అలా చేయడానికి వీలుండదు.https://tsbpass.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.

వెబ్‌సైట్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే ఫిర్యాదు చేసేందుకు దరఖాస్తు తెరుచుకుంటుంది. అందులో ఫిర్యాదుదారుడి పేరు, ఫోన్‌ నంబర్, ప్లాట్‌/సర్వే/డోర్‌ నంబర్లు, స్థలం యజమాని పేరు, అక్రమ నిర్మాణం ఫొటోతో పాటు కచ్చితమైన లొకేషన్‌ తెలిపేలా లైవ్‌ జియో–కోఆర్డినేట్స్‌ను పొందుపరిస్తే సరిపోతుంది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చే ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుదారుడికి ఒక నంబర్‌ ఇస్తారు. దాని ఆధారంగా దరఖాస్తు పురోగతిని ఆన్‌లైన్‌ ద్వారానే తెలుసుకోవచ్చు.

దరఖాస్తు చేయడం ఈజీ..
టీఎస్‌–బీపాస్‌ విధానం ద్వారా భవనాలు, లే–అవుట్ల నిర్మాణానికి అనుమతులు, ఆక్యుపెన్సీ, ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్లు, భూవినియోగ మార్పిడి, పెట్రోల్‌ బంక్‌లకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీతో పాటు అక్రమ కట్టడాలపై ఫిర్యాదులను ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రస్తుతం ట్రయల్‌ రన్‌గా వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పురపాలక మంత్రి కె.తారకరామారావు త్వరలో దీన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో సెల్‌ఫోన్, కంప్యూటర్‌ నుంచి సులువుగా దరఖాస్తు చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారులు తమ వివరాలు, ప్లాట్, భవనం సమాచారమివ్వాలి. స్థల యాజమాన్య హక్కులు, ఈసీ డాక్యుమెంట్, బిల్డింగ్‌/లే–అవుట్‌ ప్రతిపాదిత ప్లాన్‌ పీడీఎఫ్‌ కాపీతో పాటు సైట్‌ ఫొటోను అప్‌లోడ్‌ చేయాలి. చివరగా ఆన్‌లైన్‌ ద్వారా నిర్దేశిత ఫీజులు చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తుల ప్రక్రియలో ఇబ్బందులుంటే 040–2331 4622 నంబర్‌కు ఫోన్‌చేస్తే అనుమానాలను నివృత్తి చేస్తారు. 

రూపాయికే రిజిస్ట్రేషన్‌.. తక్షణమే అనుమతులు, ఎన్‌ఓసీలు
టీఎస్‌–బీపాస్‌ పథకం కింద భవనాలు, లేఅవుట్లు, ఆకాశహరŠామ్యలు, మల్టీప్లెక్సులు, థియేటర్లు, పెట్రోల్‌ బంకులు, టౌన్‌షిప్‌లకు అనుమతులు, ఎన్‌ఓసీల జారీ తదితర సేవలకు కచ్చితమైన గడువులను ప్రభుత్వం నిర్దేశించింది. సింగిల్‌ విండో విధానంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దరఖాస్తు ద్వారా అన్ని రకాల అనుమతులు, ఎన్‌ఓసీలను నిర్దేశిత గడువులోగా జారీచేస్తాయి. 75 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్‌+1 అంతస్తు వరకు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. స్వీయ ధ్రువీకరణ ద్వారా రూ.1 చెల్లించి టీఎస్‌–బీపాస్‌ వెబ్‌సైట్‌లో ఇన్‌స్టంట్‌గా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

తొలి ఆస్తిపన్నును అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఊరట కలిగించనుంది. 75 చదరపు గజాల నుంచి 500 చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇన్‌స్టంట్‌గా అనుమతులు జారీ చేస్తారు. తక్షణమే ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టవచ్చు. ఒకవేళ తప్పుడు వివరాలిచ్చినా, ప్లాన్‌ను ఉల్లంఘించినా అనుమతులు రద్దుచేసి నోటీసులివ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తారు. 500 చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో నివాస భవనాలు, అన్ని రకాల నివాసేతర కేటగిరీ భవనాలు, ఎస్‌ఆర్డీపీ/ఆర్‌డీపీ/రోడ్డు, నాలా విస్తరణ కేసులు, ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌), సెట్‌ బ్యాక్స్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి వాటికి మాత్రం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా అనుమతులిస్తారు.

అలాగే 72 రోజుల్లో లేఅవుట్లకు ప్రాథమిక అనుమతులు, మరో 21 రోజుల్లో తుది అనుమతులు జారీ చేస్తారు. నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు జారీకాని పక్షంలో అనుమతి వచ్చినట్టుగానే పరిగణించి నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం టీఎస్‌–బీపాస్‌ చట్టంలో పేర్కొంది. సేవల వారీగా నిర్దేశిత గడువులను ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో ఈ మేరకు టీఎస్‌–బీపాస్‌ చట్టానికి సంబంధించిన నిబంధనలతో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆపై ఈ కొత్త అనుమతుల విధానం అమల్లోకి వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement