layouts Regulation
-
నేరుగా అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణ
సాక్షి, అమరావతి: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణలో సామాన్యులకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలియక అనధికార లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నవారికి సాంత్వన కలిగించింది. లే అవుట్ల క్రమబద్ధీకరణతో నిమిత్తం లేకుండా అందులో స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈమేరకు అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల్లో శుక్రవారం సవరణలు చేసింది. దాంతో రాష్ట్రంలో 25,876 మంది సామాన్యులకు తక్షణ ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ తరువాతే వాటిలోని స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్టర్ల నిర్లక్ష్యం వల్ల.. స్థలాలు కొనుగోలు చేసినవారు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు ఇలా.. ప్రస్తుతం అమలులో ఉన్న అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు సామాన్యులకు ప్రతికూలంగా ఉన్నాయి. ► క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న అనధికార లే అవుట్ల ప్యాటర్న్‌ను మొదట నమోదు చేయాలి. ► అనంతరం నోటీస్ జారీచేయాలి. వాటిపై అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలి. ► రోడ్లు 30 అడుగుల వెడల్పు ఉండేలా, 14 శాతం వరకు ఓపెన్ స్పేస్ మున్సిపాలిటీకి రిజిస్టర్ చేసేట్టుగా చూడాలి. ► అప్పుడే ఆ లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. ► ఆ తరువాతే ఆ లే అవుట్లలో అప్పటికే అమ్మేసిన స్థలాలను క్రమబద్ధీకరిస్తారు. ► పలువురు రియల్టర్లు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. దీంతో ఆ లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వారి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇకనుంచి ఇలా.. ఈ సమస్యను పరిష్కరించి సామాన్యులకు ప్రయోజనం కలిగించడానికి అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల్లో పురపాలకశాఖ సవరణలు చేసింది. ► ఇకనుంచి అనధికార లే అవుట్ల మొత్తం క్రమబద్ధీకరణతో నిమిత్తం లేదు. ► అందులో స్థలాలు కొనుగోలు చేసినవారి వ్యక్తిగత దరఖాస్తులను ప్రత్యేకంగా పరిష్కరిస్తారు. ► ఆ స్థలాలను క్రమబద్ధీకరిస్తారు. దీంతో స్థలాల కొనుగోలుదారులకు ఊరట లభిస్తుంది. వారు తమ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి, బ్యాంకు రుణాలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ► అలా అని అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణను విడిచిపెట్టరు. రియల్టర్ ఆ మొత్తం లే అవుట్‌ను క్రమబద్ధీకరించుకోవాల్సిందే. అందుకోసం నిర్దేశిత నిబంధనలను పాటించాలి. సామాన్యులకు ప్రయోజనం అనధికార లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నవారికి ప్రయోజనం కలిగించేందుకే ప్రభుత్వం నిబంధనలను సవరించింది. దీంతో మొత్తం లే అవుట్ క్రమబద్ధీకరణతో నిమిత్తం లేకుండా వాటిలో స్థలాలను క్రమబద్ధీకరించడానికి అవకాశం లభించింది. కానీ రియల్టర్లు మొత్తం లే అవుట్‌ను కూడా నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాల్సిందే. – వి.రాముడు, డైరెక్టర్, రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగం -
అనధికార ప్లాట్లలో ఇళ్లకు నో
సాక్షి, హైదరాబాద్ : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో పేర్కొన్నట్టే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ, అనధికార ప్లాట్లలో భవన నిర్మాణ అనుమతుల జారీకి చెక్ పెట్టింది. అప్రూవ్డ్ లేఅవుట్లలోని ప్లాట్లు లేదా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించిన ప్లాట్లలో మాత్రమే ఇళ్లు, భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసేలా టీఎస్–బీపాస్ పోర్టల్‌ను రూపకల్పన చేసింది. లేఅవుట్ అనుమతి పత్రం/ఎల్ఆర్ఎస్ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతో పాటు పోర్టల్‌లో అప్లోడ్ చేస్తేనే ఇంటికి అనుమతులు జారీ కానున్నాయి. లేకుంటే దరఖాస్తు తిరస్కరణకు గురికానుంది. అయితే, 150 చదరపు మీటర్లలోపు ఉన్న ప్లాట్లకు షరతులతో కూడిన మినహాయింపు కల్పించింది. పాత పురపాలికల్లో 2015 అక్టోబర్ 28 కంటే ముందు, కొత్త మున్సిపాలిటీల్లో 2018 మార్చి 28 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న 150 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం గల ప్లాట్లకు మాత్రమే ఈ మినహాయింపు వర్తించనుంది. మరోవైపు అనుమతి తీసుకోకుండా చేపట్టే భవన, లేఅవుట్లను నోటీసులు లేకుండా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలు కూల్చివేస్తాయని టీఎస్–బీపాస్ చట్టంలో ప్రభుత్వం పొందుపర్చింది. దీంతో అనుమతి లేని, క్రమబద్ధీకరించుకోని ప్లాట్లలో ఇళ్లను నిర్మించడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ నిర్మించినా, ఎవరైనా టీఎస్–బీపాస్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వారం రోజుల్లో కూల్చివేయనున్నారు. మరి పేదల పరిస్థితేంటి? ఎల్ఆర్ఎస్ గడువు అక్టోబర్ 31తో ముగిసిపోగా, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 4,16,155 దరఖాస్తులు, మున్సిపాలిటీల పరిధిలో 10,60,013, గ్రామ పంచాయతీల పరిధిలో 10,83,394.. మొత్తం 25,59,562 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ చార్జీలు, ఖాళీ స్థలాలు లేనందుకు చెల్లించాల్సిన జరిమానాలు కలిపి రూ.వేల నుంచి రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉండడంతో లక్షల మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఎల్ఆర్ఎస్ కింద అనధికార లేవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోని పక్షంలో వాటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ చేయమని, ఆయా ప్లాట్ల క్రయావిక్రయాలకు రిజిస్ట్రేషన్లు జరపబోమని, సాధారణ నల్లా, డ్రైనేజీ కనెక్షన్లు జారీ చేయమని ప్రభుత్వం ఆగస్టు 31న జారీ చేసిన ఎల్ఆర్ఎస్ జీవోలో పేర్కొంది. తాజాగా టీఎస్–బీపాస్ పోర్టల్ ద్వారా అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణ అనుమతల జారీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోలేకపోయిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశముంది. ఉచిత క్రమబద్ధీకరణే పరిష్కారం.. ఎల్ఆర్ఎస్ కింద అనూహ్యంగా 25 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం అక్టోబర్ 31 తర్వాత గడువు పొడిగించొద్దని నిర్ణయం తీసుకుంది. కొద్దో గొప్పో ఆర్థిక స్తోమత ఉన్న వాళ్లు ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోగా, ఏ మాత్రం ఫీజులు భరించలేని పేద, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో ఆయా వర్గాల ప్రజలకు సంబంధించిన ప్లాట్లను ప్రభుత్వం ఉచితంగా క్రమబద్ధీకరిస్తేనే వారు భవిష్యత్తులో ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కలగనుంది. ఈ విషయంపై ఇప్పటికే సీఎం కె.చంద్రశేఖర్‌రావు పరిశీలన జరుపుతున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పేదలకు ఊరట కలిగే విధంగా నిర్దిష్ట విస్తీర్ణంలోని అనధికార ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుండటంతో అంతకుముందే దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. లేకుంటే క్రమబద్ధీకరించుకోలేకపోయిన పేదలు తమ సొంత ఖాళీ స్థలాల్లో ఇళ్లను నిర్మించుకునే హక్కును, అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే.. ‘ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకోని స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా ఖజానాను నింపుకోవడానికి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తెచ్చింది. క్రమబద్ధీకరించుకోకుంటే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వబోమని, రిజిస్ట్రేషన్లు జరపమని ఎల్ఆర్ఎస్ జీవోలో పెట్టిన కఠిన నిబంధనలు పూర్తిగా పేద, మధ్య తరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వం తమకు తోచినప్పుడు ఎల్ఆర్ఎస్ను తెచ్చి తాము చెప్పిన గడువులోగా క్రమబద్ధీకరించుకోవాలంటే అందరికీ సాధ్యమవుతుందా..? ఆ సమయంలో అందరి వద్ద డబ్బులుంటాయా..? ఇప్పటికే లాక్డౌన్, కరోనాతో ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఎల్ఆర్ఎస్, టీఎస్–బీపాస్ పేరుతో ఇలాంటి ఆంక్షలు విధిస్తే ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత చూడక తప్పదు. తక్షణమే పేద, మధ్య తరగతి ప్రజల స్థలాలను ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా క్రమబద్ధీకరించి ఇళ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించాలి..' – సంజీవ్, పేదల గృహ నిర్మాణ రంగ కార్యకర్త, మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) -
అక్రమాలపై అస్త్రం
సాక్షి, హైదరాబాద్ : మీ ప్రాంతంలో అక్రమ భవనాలు, లే–అవుట్లు నిర్మిస్తున్నారా? ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదా? భవన నిర్మాణాలు, ఇతరత్రా అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారా? దరఖాస్తు చేసుకున్న వెంటనే చకచకా అనుమతులొచ్చేస్తే బాగుండుననిపిస్తోందా?.. అయితే మీ సమస్యలు త్వరలోనే తీరనున్నాయి. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్–బీపాస్) ద్వారా అక్రమ/అనధికార నిర్మాణాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. అలాగే వివిధ నిర్మాణ అనుమతులు, ఎన్ఓసీల జారీకి ప్రభుత్వం తాజాగా కచ్చితమైన గడువులను నిర్దేశించింది. ఇలా ఫిర్యాదుచేస్తే అలా ఆటకట్టు: అనుమతుల్లేకుండా లేదా అనుమతులు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై, మున్సిపల్ స్థలాలు, చెరువులు, శిఖం భూములు, ప్రైవేట్ స్థలాలను ఆక్రమించి దౌర్జన్యంగా నిర్మాణాలు సాగించడంపై ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా చాలా సందర్భాల్లో అధికారుల నుంచి స్పందన ఉండదు. లేదా అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుని వదిలేస్తుంటారు. ఇకపై అలా చేయడానికి వీలుండదు.https://tsbpass.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని ఎన్ఫోర్స్మెంట్ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే ఫిర్యాదు చేసేందుకు దరఖాస్తు తెరుచుకుంటుంది. అందులో ఫిర్యాదుదారుడి పేరు, ఫోన్ నంబర్, ప్లాట్/సర్వే/డోర్ నంబర్లు, స్థలం యజమాని పేరు, అక్రమ నిర్మాణం ఫొటోతో పాటు కచ్చితమైన లొకేషన్ తెలిపేలా లైవ్ జియో–కోఆర్డినేట్స్‌ను పొందుపరిస్తే సరిపోతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా వచ్చే ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుదారుడికి ఒక నంబర్ ఇస్తారు. దాని ఆధారంగా దరఖాస్తు పురోగతిని ఆన్లైన్ ద్వారానే తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేయడం ఈజీ.. టీఎస్–బీపాస్ విధానం ద్వారా భవనాలు, లే–అవుట్ల నిర్మాణానికి అనుమతులు, ఆక్యుపెన్సీ, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, భూవినియోగ మార్పిడి, పెట్రోల్ బంక్‌లకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీతో పాటు అక్రమ కట్టడాలపై ఫిర్యాదులను ఆన్లైన్లోనే స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రస్తుతం ట్రయల్ రన్‌గా వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పురపాలక మంత్రి కె.తారకరామారావు త్వరలో దీన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో సెల్‌ఫోన్, కంప్యూటర్ నుంచి సులువుగా దరఖాస్తు చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఆన్లైన్లో దరఖాస్తుదారులు తమ వివరాలు, ప్లాట్, భవనం సమాచారమివ్వాలి. స్థల యాజమాన్య హక్కులు, ఈసీ డాక్యుమెంట్, బిల్డింగ్/లే–అవుట్ ప్రతిపాదిత ప్లాన్ పీడీఎఫ్ కాపీతో పాటు సైట్ ఫొటోను అప్లోడ్ చేయాలి. చివరగా ఆన్లైన్ ద్వారా నిర్దేశిత ఫీజులు చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తుల ప్రక్రియలో ఇబ్బందులుంటే 040–2331 4622 నంబర్‌కు ఫోన్‌చేస్తే అనుమానాలను నివృత్తి చేస్తారు. రూపాయికే రిజిస్ట్రేషన్.. తక్షణమే అనుమతులు, ఎన్ఓసీలు టీఎస్–బీపాస్ పథకం కింద భవనాలు, లేఅవుట్లు, ఆకాశహరŠామ్యలు, మల్టీప్లెక్సులు, థియేటర్లు, పెట్రోల్ బంకులు, టౌన్షిప్లకు అనుమతులు, ఎన్ఓసీల జారీ తదితర సేవలకు కచ్చితమైన గడువులను ప్రభుత్వం నిర్దేశించింది. సింగిల్ విండో విధానంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దరఖాస్తు ద్వారా అన్ని రకాల అనుమతులు, ఎన్ఓసీలను నిర్దేశిత గడువులోగా జారీచేస్తాయి. 75 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్+1 అంతస్తు వరకు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. స్వీయ ధ్రువీకరణ ద్వారా రూ.1 చెల్లించి టీఎస్–బీపాస్ వెబ్సైట్లో ఇన్‌స్టంట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి ఆస్తిపన్నును అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఊరట కలిగించనుంది. 75 చదరపు గజాల నుంచి 500 చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇన్‌స్టంట్‌గా అనుమతులు జారీ చేస్తారు. తక్షణమే ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టవచ్చు. ఒకవేళ తప్పుడు వివరాలిచ్చినా, ప్లాన్‌ను ఉల్లంఘించినా అనుమతులు రద్దుచేసి నోటీసులివ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తారు. 500 చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో నివాస భవనాలు, అన్ని రకాల నివాసేతర కేటగిరీ భవనాలు, ఎస్ఆర్డీపీ/ఆర్డీపీ/రోడ్డు, నాలా విస్తరణ కేసులు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్), సెట్ బ్యాక్స్ ట్రాన్స్ఫర్ వంటి వాటికి మాత్రం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా అనుమతులిస్తారు. అలాగే 72 రోజుల్లో లేఅవుట్లకు ప్రాథమిక అనుమతులు, మరో 21 రోజుల్లో తుది అనుమతులు జారీ చేస్తారు. నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు జారీకాని పక్షంలో అనుమతి వచ్చినట్టుగానే పరిగణించి నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం టీఎస్–బీపాస్ చట్టంలో పేర్కొంది. సేవల వారీగా నిర్దేశిత గడువులను ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో ఈ మేరకు టీఎస్–బీపాస్ చట్టానికి సంబంధించిన నిబంధనలతో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆపై ఈ కొత్త అనుమతుల విధానం అమల్లోకి వస్తుంది. -
పంచాయతీల్లోనూ ఎల్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని (ఎల్ఆర్ఎస్) ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీఆర్ఎస్) కూడా వర్తింపజేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్న పంచాయతీరాజ్‌శాఖ పథకం అమలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చని భావిస్తోంది. పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ అనుమతి ఇచ్చిన లేఅవుట్లలోని ధరలతో పోలిస్తే వాటిలో తక్కువ రేట్లకే ప్లాట్లు లభించడం, అవి అక్రమ లేఅవుట్లని తెలియకపోవడంతో చాలా మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆ స్థలాలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం తీసుకొనే తాజా నిర్ణయంతో వారికి ఊరట లభించనుంది. ప్రయోగాత్మకంగా రెండేసి లేఅవుట్లు... పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జిల్లాకు రెండేసి అనధికార లేఅవుట్లను పరిశీలించి వాటి క్రమబద్ధీకరణలో సాధకబాధకాలు, ప్రభుత్వానికి లభించే ఆదాయం ఇతరత్రా అంశాలను మదింపు చేయనుంది. ఈ మేరకు శనివారం పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ రఘునందన్‌రావు.. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పైలట్ ప్రాతిపదికన... ఎంపిక చేసిన లేఅవుట్లలో రోడ్లు, డ్రైనేజీ తదితర కనీస సౌకర్యాలు కల్పించారా? పది శాతం స్థానిక పంచాయతీలకు గిఫ్ట్ డీడ్ చేశారా? ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎంత మేరకు ఎల్ఆర్ఎస్ కింద పెనాల్టీని నిర్ధారించవచ్చనే దానిపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగే పల్లె ప్రగతి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశముంది. ఆ మేరకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్పై మార్గదర్శకాలను జారీ చేసే వీలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 68 మున్సి పాలిటీల్లో 173 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. అలాగే ఇప్పటికే మనుగడలో ఉన్న 42 పురపాలికల్లో 131 గ్రామ పంచాయతీలను విలీ నం చేశారు. వాటిలో హెచ్ఎండీఏ మినహా 43 మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ పథకం కింద స్థలాల/లేఅవుట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పంచాయతీల్లోనూ ఈ పథకం అమలుకు కHదలిక మొదలు కావడంతో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో లేని అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న వారికి ఉపశమనం కలగనుంది. అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో 300 చద రపు మీటర్ల విస్తీర్ణంలో జీ+2 అంతస్తుల వరకే భవనాలకు అనుమతి జారీ చేస్తుండగా ఈ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించుకునే వీలు కలగనుంది. పీఆర్ చట్టంతో వెసులుబాటు... వాస్తవానికి స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అధికారం పురపాలకశాఖకే ఉండేది. అయితే గతేడాది సర్కారు చేసిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని వర్తింపజేసేలా పంచాయతీరాజ్ శాఖకు అధికారం లభించింది. సెక్షన్ 113 ప్రకారం అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించే వెసులుబాటు ఉండటంతో దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గతంలో దీనిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించగా తాజాగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు ఈ పథకం అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. -
అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఒకవైపు రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ మరోవైపు అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయకుండా హెచ్చరికబోర్డులను ఏర్పాటు చేస్తోంది. రోడ్లు, వీధిదీపాలు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా అడ్డగోలుగా వెలుస్తున్న వెంచర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించిన అనంతరం కూడా పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్లు పుట్టుకురావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీల నుంచి అనుమతి తీసుకోకుండా అభివృద్ధి చేస్తున్న వెంచర్లకు అడ్డుకట్ట వేస్తోంది. ఇందులో భాగంగా అనధికార లేఅవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్లను నిషేధించింది. ఈ మేరకు అక్రమ లేఅవుట్ల జాబితాను స్థానిక రిజిస్ట్రార్లకు పంపిస్తోంది. తద్వారా గ్రామ పంచాయతీల అనుమతుల పేరిట ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న లేఅవుట్లకు బ్రేక్ పడుతుందని భావిస్తోంది. లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం పంచాయతీల పాలకవర్గాలకు లేనప్పటికీ, కారుచౌకగా లభిస్తుందనే ఆశతో అమాయక జనం స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే ప్లాట్లను అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పదునుపెట్టిన సర్కారు గ్రామ పంచాయతీల్లో వెలిసే లేఅవుట్ల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసింది. ప్లాట్ల వద్ద డిస్ప్లే బోర్డులు.. అనుమతులు తీసుకోకుండా ఆకర్షణీయ బ్రోచర్లతో ప్లాట్లు విక్రయిస్తున్న రియల్టర్లకు చెక్ పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికార, అనధికార లేఅవుట్లపై స్పష్టతనిస్తూ ‘సైట్’లో బోర్డులు ఏర్పాటు చేయనుంది. అప్రూవ్డ్ లేఅవుట్ అయితే హెచ్ఎండీఏ/డీటీసీపీ అనుమతి ఇచ్చిన ఎల్పీ నంబర్, సర్వే, విస్తీర్ణం పేర్కొంటూ డిస్ప్లే బోర్డులు పెట్టనుంది. అనుమతిలేని లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయకుండా అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనుంది. మార్గదర్శకాలివే..! - పంచాయతీ కార్యదర్శి విధిగా తనఖా(మార్టిగేజ్) కింద ‘హెచ్ మార్కింగ్’చేసిన ప్లాట్లను గ్రామ పంచాయతీ పేరిట గిఫ్ట్‌డీడ్ చేయించాలి లేఅవుట్ డెవలపర్/ప్రమోటర్/యజమాని లేఅవుట్ అభివృద్ధి పనులను పంచాయతీ, మండల ఇంజనీర్ పర్యవేక్షణలో చేయాలి - భూమి చదును, రోడ్లు, ఇరువైపులా మురుగు కాల్వలను విధిగా నిర్మించాలి. వాననీరు ప్రవహించేలా కాల్వలు, కుంటలు, చెరువులకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి - 10 శాతం వదిలిన ఖాళీస్థలం చుట్టూ హద్దురాళ్లు పాతి కంచె వేయించాలి. ఈ పదిశాతం స్థలం గిఫ్ట్‌డీడ్ చేసిన అనంతరమే ఫైనల్ లేఅవుట్ అనుమతి విడుదల చేయాలి -
ఆన్లైన్లో అక్కర్లేదు.. నేరుగా ఇవ్వండి
క్రమబద్ధీకరణకు హెచ్ఎండీఏ వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ల కింద క్రమబద్ధీరించుకొనే వారు తమ దరఖాస్తులను నేరుగా అందజేయవచ్చు. గడువు దగ్గరపడటంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు వేల సంఖ్యలో ప్రయత్నిస్తుండటంతో హెచ్ఎండీఏలో సర్వర్లు మొరాయించిన సంగతి తెలిసిందే. దీంతో దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా చేతిరాత (పెన్ను)తో నింపిన దరఖాస్తులను సైతం స్వీకరించేలా హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు చర్యలు చేపట్టారు. నిన్నటివరకు ఆన్లైన్లోనే విధిగా దరఖాస్తును నింపి ప్రింటవుట్ తీసుకొని దానికి మిగతా డాక్యుమెంట్లు, రూ.10 వేల డీడీని జతచేయాలనే నిబంధన ఉండేది. అలా వచ్చిన దరఖాస్తులనే హెచ్ఎండీఏ కౌంటర్లో స్వీకరించేవారు. దీంతో జాప్యం అవుతుండటంతో ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా దరఖాస్తులను చేతిరాతతో నింపి నిర్దేశించిన డాక్యుమెంట్లను జతచేసి నేరుగా ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ప్రధానంగా బీఆర్ఎస్ దరఖాస్తులకు గతంలో మంజూరు చేసిన ధ్రువపత్రం (ఉంటే), భూమి/బిల్డింగ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు (గెజిటెడ్ అధికారి ధ్రువీకరించినవి), బిల్డింగ్ ప్లాన్‌కు సంబంధించి లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్/ ఇంజనీర్‌చే ధ్రువీకరించిన నమూనా (3 సెట్లు), రూ.10 వేల డీడీ (ది మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరుతో.. ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి), ఇండెమ్నిటీ బాండ్, బిల్డింగ్ ఫొటోలు (ఎలివేషన్ ఫొటో) విధిగా సమర్పించాలని కమిషనర్ సూచించారు. అలాగే ఎల్ఆర్ ఎస్‌కు సంబంధించి భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ (గెజిటెడ్ అధికారి ధ్రువీకరించినది), స్థలం ప్లాన్ (లొకేషన్ స్కెచ్ ప్లాన్), లే అవుట్ ప్లాన్‌లో ప్లాట్ స్థలం, ఖాళీ ప్రదేశం, రోడ్ తదితరాలు, ఇండెమ్నిటీ బాండ్, రూ.10 వేల డీడీ తప్పని సరిగా దరఖాస్తుతోపాటు జతచేయాలని తెలిపారు. గడువులోగా తీసిన డీడీలున్న దరఖాస్తులన్నింటినీ స్వీకరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడువు పెంపు!
* నేటితో ముగియనున్న గడువు * సీఎం కేసీఆర్ అనుమతి కోసం పురపాలక శాఖ నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల గడువు ఈనెల 31 (గురువారం)తో ముగిసిపోనుంది. గడువు మరో రెండు నెలలు పొడిగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అనుమతి కోసం పురపాలక శాఖ బుధవారం సాయంత్రం వరకు నిరీక్షించింది. శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి బుధవారం రాత్రి సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి గడువు పెంపునకు అనుమతి కోరారు. ఈ అంశంపై గురువారం చర్చించి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. గురువారం అనుమతి లభిస్తే ఆ వెంటనే అంతర్గత ఉత్తర్వులు (సర్క్యులర్) జారీ చేస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలాఉండగా, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టిందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పథకాల కింద దరఖాస్తుల స్వీకరణకు అనుమతించిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వాటిని పరిష్కరించవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల గడువు పెంచుకోడానికి అడ్డంకులు లేవని అధికారులు చెబుతున్నారు. స్పందన అంతంతే... అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఆశించిన స్పందన రాలేదు. అక్రమాల క్రమబద్ధీకరణ ద్వారా ఏకంగా రూ.1,000 కోట్ల ఆదాయాన్ని గడించాలన్న జీహెచ్ఎంసీ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇక రాష్ట్రంలోని ఇతర 67 నగర, పురపాలికల పరిధిలో నామమాత్రపు సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29 వరకు లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 65,079 దరఖాస్తులు, భవనాల క్రమబద్ధీకరణ కోసం 62,659 దరఖాస్తులు వచ్చాయి. తొలుత దరఖాస్తుతోపాటు కనీసం రూ.10 వేల డీడీని సమర్పించాలని, మిగిలినరుసుమును పరి ష్కార సమయంలో చెల్లించాలని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ మేర కు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి రూ.48.79 కోట్లు, బీఆర్ఎస్ దరఖాస్తుల నుంచి రూ.37.89 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిని పరిష్కరిస్తే ఆదాయం రూ.1,000 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.