సాక్షి, హైదరాబాద్: అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఒకవైపు రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ మరోవైపు అనధికార లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయకుండా హెచ్చరికబోర్డులను ఏర్పాటు చేస్తోంది. రోడ్లు, వీధిదీపాలు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా అడ్డగోలుగా వెలుస్తున్న వెంచర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించిన అనంతరం కూడా పుట్టగొడుగుల్లా అనధికార లేఅవుట్లు పుట్టుకురావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీల నుంచి అనుమతి తీసుకోకుండా అభివృద్ధి చేస్తున్న వెంచర్లకు అడ్డుకట్ట వేస్తోంది. ఇందులో భాగంగా అనధికార లేఅవుట్లలో స్థలాల రిజిస్ట్రేషన్లను నిషేధించింది.
ఈ మేరకు అక్రమ లేఅవుట్ల జాబితాను స్థానిక రిజిస్ట్రార్లకు పంపిస్తోంది. తద్వారా గ్రామ పంచాయతీల అనుమతుల పేరిట ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న లేఅవుట్లకు బ్రేక్ పడుతుందని భావిస్తోంది. లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం పంచాయతీల పాలకవర్గాలకు లేనప్పటికీ, కారుచౌకగా లభిస్తుందనే ఆశతో అమాయక జనం స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే ప్లాట్లను అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు పదునుపెట్టిన సర్కారు గ్రామ పంచాయతీల్లో వెలిసే లేఅవుట్ల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేసింది.
ప్లాట్ల వద్ద డిస్‌ప్లే బోర్డులు..
అనుమతులు తీసుకోకుండా ఆకర్షణీయ బ్రోచర్లతో ప్లాట్లు విక్రయిస్తున్న రియల్టర్లకు చెక్ పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికార, అనధికార లేఅవుట్లపై స్పష్టతనిస్తూ ‘సైట్’లో బోర్డులు ఏర్పాటు చేయనుంది. అప్రూవ్డ్ లేఅవుట్ అయితే హెచ్‌ఎండీఏ/డీటీసీపీ అనుమతి ఇచ్చిన ఎల్‌పీ నంబర్, సర్వే, విస్తీర్ణం పేర్కొంటూ డిస్‌ప్లే బోర్డులు పెట్టనుంది. అనుమతిలేని లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేయకుండా అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనుంది.
మార్గదర్శకాలివే..!
- పంచాయతీ కార్యదర్శి విధిగా తనఖా(మార్టిగేజ్) కింద ‘హెచ్ మార్కింగ్’చేసిన ప్లాట్లను గ్రామ పంచాయతీ పేరిట గిఫ్ట్‌డీడ్ చేయించాలి లేఅవుట్ డెవలపర్/ప్రమోటర్/యజమాని లేఅవుట్ అభివృద్ధి పనులను పంచాయతీ, మండల ఇంజనీర్ పర్యవేక్షణలో చేయాలి
- భూమి చదును, రోడ్లు, ఇరువైపులా మురుగు కాల్వలను విధిగా నిర్మించాలి. వాననీరు ప్రవహించేలా కాల్వలు, కుంటలు, చెరువులకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి
- 10 శాతం వదిలిన ఖాళీస్థలం చుట్టూ హద్దురాళ్లు పాతి కంచె వేయించాలి. ఈ పదిశాతం స్థలం గిఫ్ట్‌డీడ్ చేసిన అనంతరమే ఫైనల్ లేఅవుట్ అనుమతి విడుదల చేయాలి
Comments
Please login to add a commentAdd a comment