సాక్షి, అమరావతి: అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణలో సామాన్యులకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలియక అనధికార లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నవారికి సాంత్వన కలిగించింది. లే అవుట్ల క్రమబద్ధీకరణతో నిమిత్తం లేకుండా అందులో స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈమేరకు అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల్లో శుక్రవారం సవరణలు చేసింది. దాంతో రాష్ట్రంలో 25,876 మంది సామాన్యులకు తక్షణ ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ తరువాతే వాటిలోని స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్టర్ల నిర్లక్ష్యం వల్ల.. స్థలాలు కొనుగోలు చేసినవారు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది.
ఇప్పటివరకు ఇలా..
ప్రస్తుతం అమలులో ఉన్న అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు సామాన్యులకు ప్రతికూలంగా ఉన్నాయి.
► క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న అనధికార లే అవుట్ల ప్యాటర్న్‌ను మొదట నమోదు చేయాలి.
► అనంతరం నోటీస్ జారీచేయాలి. వాటిపై అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలి.
► రోడ్లు 30 అడుగుల వెడల్పు ఉండేలా, 14 శాతం వరకు ఓపెన్ స్పేస్ మున్సిపాలిటీకి రిజిస్టర్ చేసేట్టుగా చూడాలి.
► అప్పుడే ఆ లే అవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తవుతుంది.
► ఆ తరువాతే ఆ లే అవుట్లలో అప్పటికే అమ్మేసిన స్థలాలను క్రమబద్ధీకరిస్తారు.
► పలువురు రియల్టర్లు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తిచేయకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు. దీంతో ఆ లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వారి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియకు తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఇకనుంచి ఇలా..
ఈ సమస్యను పరిష్కరించి సామాన్యులకు ప్రయోజనం కలిగించడానికి అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ నిబంధనల్లో పురపాలకశాఖ సవరణలు చేసింది.
► ఇకనుంచి అనధికార లే అవుట్ల మొత్తం క్రమబద్ధీకరణతో నిమిత్తం లేదు.
► అందులో స్థలాలు కొనుగోలు చేసినవారి వ్యక్తిగత దరఖాస్తులను ప్రత్యేకంగా పరిష్కరిస్తారు.
► ఆ స్థలాలను క్రమబద్ధీకరిస్తారు. దీంతో స్థలాల కొనుగోలుదారులకు ఊరట లభిస్తుంది. వారు తమ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి, బ్యాంకు రుణాలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
► అలా అని అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణను విడిచిపెట్టరు. రియల్టర్ ఆ మొత్తం లే అవుట్‌ను క్రమబద్ధీకరించుకోవాల్సిందే. అందుకోసం నిర్దేశిత నిబంధనలను పాటించాలి.
సామాన్యులకు ప్రయోజనం
అనధికార లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నవారికి ప్రయోజనం కలిగించేందుకే ప్రభుత్వం నిబంధనలను సవరించింది. దీంతో మొత్తం లే అవుట్ క్రమబద్ధీకరణతో నిమిత్తం లేకుండా వాటిలో స్థలాలను క్రమబద్ధీకరించడానికి అవకాశం లభించింది. కానీ రియల్టర్లు మొత్తం లే అవుట్‌ను కూడా నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాల్సిందే.
– వి.రాముడు, డైరెక్టర్, రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment