Buildings Constructions
-
అక్రమాలపై అస్త్రం
సాక్షి, హైదరాబాద్ : మీ ప్రాంతంలో అక్రమ భవనాలు, లే–అవుట్లు నిర్మిస్తున్నారా? ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదా? భవన నిర్మాణాలు, ఇతరత్రా అనుమతుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారా? దరఖాస్తు చేసుకున్న వెంటనే చకచకా అనుమతులొచ్చేస్తే బాగుండుననిపిస్తోందా?.. అయితే మీ సమస్యలు త్వరలోనే తీరనున్నాయి. తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్–బీపాస్) ద్వారా అక్రమ/అనధికార నిర్మాణాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. అలాగే వివిధ నిర్మాణ అనుమతులు, ఎన్ఓసీల జారీకి ప్రభుత్వం తాజాగా కచ్చితమైన గడువులను నిర్దేశించింది. ఇలా ఫిర్యాదుచేస్తే అలా ఆటకట్టు: అనుమతుల్లేకుండా లేదా అనుమతులు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలపై, మున్సిపల్ స్థలాలు, చెరువులు, శిఖం భూములు, ప్రైవేట్ స్థలాలను ఆక్రమించి దౌర్జన్యంగా నిర్మాణాలు సాగించడంపై ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా చాలా సందర్భాల్లో అధికారుల నుంచి స్పందన ఉండదు. లేదా అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుని వదిలేస్తుంటారు. ఇకపై అలా చేయడానికి వీలుండదు.https://tsbpass.telangana.gov.in వెబ్సైట్ ద్వారా అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని ఎన్ఫోర్స్మెంట్ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే ఫిర్యాదు చేసేందుకు దరఖాస్తు తెరుచుకుంటుంది. అందులో ఫిర్యాదుదారుడి పేరు, ఫోన్ నంబర్, ప్లాట్/సర్వే/డోర్ నంబర్లు, స్థలం యజమాని పేరు, అక్రమ నిర్మాణం ఫొటోతో పాటు కచ్చితమైన లొకేషన్ తెలిపేలా లైవ్ జియో–కోఆర్డినేట్స్‌ను పొందుపరిస్తే సరిపోతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా వచ్చే ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుదారుడికి ఒక నంబర్ ఇస్తారు. దాని ఆధారంగా దరఖాస్తు పురోగతిని ఆన్లైన్ ద్వారానే తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేయడం ఈజీ.. టీఎస్–బీపాస్ విధానం ద్వారా భవనాలు, లే–అవుట్ల నిర్మాణానికి అనుమతులు, ఆక్యుపెన్సీ, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు, భూవినియోగ మార్పిడి, పెట్రోల్ బంక్‌లకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీతో పాటు అక్రమ కట్టడాలపై ఫిర్యాదులను ఆన్లైన్లోనే స్వీకరిస్తారు. ఇందుకోసం ప్రస్తుతం ట్రయల్ రన్‌గా వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పురపాలక మంత్రి కె.తారకరామారావు త్వరలో దీన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో సెల్‌ఫోన్, కంప్యూటర్ నుంచి సులువుగా దరఖాస్తు చేసుకునేలా దీన్ని రూపొందించారు. ఆన్లైన్లో దరఖాస్తుదారులు తమ వివరాలు, ప్లాట్, భవనం సమాచారమివ్వాలి. స్థల యాజమాన్య హక్కులు, ఈసీ డాక్యుమెంట్, బిల్డింగ్/లే–అవుట్ ప్రతిపాదిత ప్లాన్ పీడీఎఫ్ కాపీతో పాటు సైట్ ఫొటోను అప్లోడ్ చేయాలి. చివరగా ఆన్లైన్ ద్వారా నిర్దేశిత ఫీజులు చెల్లిస్తే ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తుల ప్రక్రియలో ఇబ్బందులుంటే 040–2331 4622 నంబర్‌కు ఫోన్‌చేస్తే అనుమానాలను నివృత్తి చేస్తారు. రూపాయికే రిజిస్ట్రేషన్.. తక్షణమే అనుమతులు, ఎన్ఓసీలు టీఎస్–బీపాస్ పథకం కింద భవనాలు, లేఅవుట్లు, ఆకాశహరŠామ్యలు, మల్టీప్లెక్సులు, థియేటర్లు, పెట్రోల్ బంకులు, టౌన్షిప్లకు అనుమతులు, ఎన్ఓసీల జారీ తదితర సేవలకు కచ్చితమైన గడువులను ప్రభుత్వం నిర్దేశించింది. సింగిల్ విండో విధానంలో అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే దరఖాస్తు ద్వారా అన్ని రకాల అనుమతులు, ఎన్ఓసీలను నిర్దేశిత గడువులోగా జారీచేస్తాయి. 75 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్+1 అంతస్తు వరకు ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదు. స్వీయ ధ్రువీకరణ ద్వారా రూ.1 చెల్లించి టీఎస్–బీపాస్ వెబ్సైట్లో ఇన్‌స్టంట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి ఆస్తిపన్నును అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఊరట కలిగించనుంది. 75 చదరపు గజాల నుంచి 500 చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణాలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇన్‌స్టంట్‌గా అనుమతులు జారీ చేస్తారు. తక్షణమే ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టవచ్చు. ఒకవేళ తప్పుడు వివరాలిచ్చినా, ప్లాన్‌ను ఉల్లంఘించినా అనుమతులు రద్దుచేసి నోటీసులివ్వకుండానే నిర్మాణాలను కూల్చివేస్తారు. 500 చదరపు మీటర్లకుపైగా విస్తీర్ణంలో నివాస భవనాలు, అన్ని రకాల నివాసేతర కేటగిరీ భవనాలు, ఎస్ఆర్డీపీ/ఆర్డీపీ/రోడ్డు, నాలా విస్తరణ కేసులు, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్), సెట్ బ్యాక్స్ ట్రాన్స్ఫర్ వంటి వాటికి మాత్రం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా అనుమతులిస్తారు. అలాగే 72 రోజుల్లో లేఅవుట్లకు ప్రాథమిక అనుమతులు, మరో 21 రోజుల్లో తుది అనుమతులు జారీ చేస్తారు. నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు జారీకాని పక్షంలో అనుమతి వచ్చినట్టుగానే పరిగణించి నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం టీఎస్–బీపాస్ చట్టంలో పేర్కొంది. సేవల వారీగా నిర్దేశిత గడువులను ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో ఈ మేరకు టీఎస్–బీపాస్ చట్టానికి సంబంధించిన నిబంధనలతో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆపై ఈ కొత్త అనుమతుల విధానం అమల్లోకి వస్తుంది. -
హైదరాబాద్‌లో గృహ నిర్మాణాలు ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో నివాస విభాగం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఢిల్లీ, ఎన్సీఆర్, పుణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి ఏడు ప్రధాన నగరాల్లో గృహ నిర్మాణాలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఎగువ మధ్య తరగతి, ప్రీమియం విభాగాల ప్రాజెక్ట్స్‌ల్లో మాత్రమే ఈ జాప్యం ఉందని జేఎల్ఎల్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ► గృహ నిర్మాణాలను ప్రారంభించిన కాలం నుంచి ఐదేళ్ల కాల పరిమితిని దాటిన ప్రాజెక్ట్‌లను నిర్మాణ గడువు ముగిసిన/ ఆగిపోయిన ప్రాజెక్ట్‌లుగా జేఎల్ఎల్ రీసెర్చ్ పరిగణించింది. ఈ లెక్కన చూస్తే దేశంలో 2014 లేదా అంతకంటే ముందు ప్రారంభమై నేటికీ పూర్తి కానివి మొత్తం 4.54 లక్షల గృహాలున్నాయి. వీటి విలువ రూ.4.62 లక్షల కోట్లు. వీటిల్లో ఢిల్లీ–ఎన్సీఆర్లో 62 శాతం, ముంబైలో 22 శాతం గృహాలున్నాయి. ఆయా నగరాల్లో ప్రతి మూడు గృహాల్లో ఒకటి నిర్మాణ గడువు ముగిసిందే ఉంది. ► నగరాల వారీగా జాప్యమైన గృహాల సంఖ్య చూస్తే.. హైదరాబాద్‌లో 2,400 గృహాలు (0.5 శాతం), బెంగళూరులో 28,400 (6.3 శాతం), చెన్నైలో 8,500 (1.9 శాతం), కోల్‌కతాలో 17,800 (3.9 శాతం), పుణేలో 16,400 గృహాలు (3.6 శాతంగా ఉన్నాయి. నగరంలో అద్దెవాసులే ఎక్కువ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 1.19 కోట్ల గృహాలు ఖాళీగా ఉన్నాయి. తక్కువ అద్దెలు, సరిగా లేని నిర్వహణ, అద్దెదారుల బాధ్యతారాహిత్యం, అద్దె గృహాల రాయితీలు లేకపోవటం వంటి రకరకాల కారణాలతో రెంట్ హౌస్‌లు వేకెంట్‌గా ఉంటున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా, కైటాన్ అండ్ కో సంయుక్త నివేదిక తెలిపింది. ► దేశ జనాభాలో 2.73 కోట్ల కుటుంబాలు అద్దె గృహాల్లో నివాసముంటున్నాయి. 79.4 శాతం అంటే 2.17 కోట్ల కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లోనే రెంట్‌కు ఉంటున్నాయి. అత్యధిక అద్దె కుటుంబాలు తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ 35,90,179 మంది అద్దె గృహాల్లో ఉంటున్నారు. రెండో స్థానంలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ 3,004,702 కుటుంబాలు రెంట్ హౌస్‌లలో ఉంటున్నాయి. హైదరాబాద్ వాటా 6 శాతంగా ఉంది. ► మహారాష్ట్రలో 29,40,731, కర్నాటకలో 24,47,718, గుజరాత్లో 13,15,157, వెస్ట్ బెంగాల్లో 12,92,263, ఉత్తర ప్రదేశ్‌లో 11,14,832, ఢిల్లీలో 9,29,112 అద్దె గృహాలున్నాయి. -
చెరువులో నిర్మాణాలు!
రాజేంద్రనగర్ : దశాబ్దాల కాలంపాటు సాగు, తాగునీరందించిన చెరువు ఇప్పుడు కబ్జాలతో కుచించుకుపోతోంది. చెరువులోకి వరదనీరు రాకుండా కాలువలను దారి మళ్లించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయలోపంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పీరం చెరువు ప్రాంతంలోని సర్వేనెంబర్ 27లో 4.25 ఎకరాల విస్తీర్ణంలో కోమటికుంట చెరువు విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో చెరువుతో పాటు ఎఫ్టీఎల్ను నిర్థారించి హద్దులను ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రాంతమంతా పచ్చటి పొలాలతో కళకళలాడేది. చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు ఈ నీరే ఉపయోగపడేది. ఈ చెరువులోనే వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి నీరు చేరేది. సంవత్సరం పొడవునా నీటితో వెంకన్నకుంట కళకళలాడేది. చుట్టుపక్కల వారు తాగేందుకు దీని నీటిని ఉపయోగించేవారు. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారి నిర్మాణాలు వెలిశాయి. దీంతో ఈ ప్రాంతంలో భూమికి విలువ పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం స్థలం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. ఈ చెరువులోకి కొందరు వర్షపు నీరు రాకుండా కాలువలను మూసివేశారు. తమ పంట పొలాలను ప్లాట్లుగా చేసిన సమయంలో చెరువుకు వచ్చే కాలువలు, తూములను తొలగించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం వరదనీరు చేరడం లేదు. చెరువు భూమిని కబ్జా చేసేందుకు కొందరు ముందస్తు ప్రణాళికతో నిర్మాణాలను ప్రారంభించారు. తమ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నామంటూ.. ఎఫ్టీఎల్ భూముల్లో మొదటగా నిర్మాణాలు పూర్తి చేశారు. దీనిని ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ప్రశ్నించకపోవడంతో ఏకంగా చెరువు స్థలంలోనే నిర్మాణాలు వెలిశాయి. కొన్ని రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో అదనుగా భావించి జోరుగా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేసినా పని ఒత్తిడిలో అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇదే అదునుగా భావించి కబ్జాదారులు ప్రçహారీ నిర్మాణాలను చేపడుతున్నారు. స్థానికంగా ఈ చెరువును ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నిధులు కేటాయించింది. రూ.3 లక్షలతో చెరువు కట్ట ఎత్తును పెంచారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులను నిర్వహించాల్సి ఉండగా.. నిర్మాణాలు జరుగుతుండడంతో ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కబ్జాదారులకు పనులు మరింత సులభం అయ్యాయి. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువు స్థలాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
‘కస్తూర్బా’ నిర్మాణాలకు గ్రహణం
సాక్షి, హైదరాబాద్: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)కు సొంత భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విడతలవారీగా శాశ్వత భవనాలను కేంద్రం మంజూరు చేస్తున్నప్పటికీ వాటి నిర్మాణం సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లోనే విద్యార్థులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్నాయి. వీటిలో దాదాపు 198 కేజీబీవీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 34 కేజీబీవీలకు కేంద్రం భవనాలు మంజూరు చేసి ఒక్కోదానికి రూ.2.75 కోట్ల చొప్పున కేటాయించింది. రూ.93 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో రాష్ల్ర విద్యాశాఖ టెండర్లు పిలిచి అర్హతలున్న కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించి దాదాపు నాలుగు ఏళ్లు కావస్తున్నా వీటి నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. పర్యవేక్షణ కరువు... కేజీబీవీల్లో అనాథ బాలికలతోపాటు అత్యంత నిరుపేద బాలికలకు వసతితోపాటు అక్కడే చదువుకునే వీలుంటుంది. నూరుశాతం బాలికలే ఉండడంతో ఆ భవనాలకు భద్రత కల్పించాలి. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో సొంత భవనాలను మంజూరు చేస్తూ వచ్చింది. భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసే ప్రక్రియ విద్యాశాఖ చూస్తుండగా నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లపై ఆజమాయిషీ ఈడబ్ల్యూఐడీసీకే ఉంది. సకాలంలో పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు విడతలవారీగా విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ నిర్మాణ పనులపై స్పష్టత లేదు. ఈడబ్ల్యూఐడీసీ గణాంకాల ఆధారంగానే బిల్లులు చెల్లిస్తుండడంతో నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయనే అంశం విద్యాశాఖ అధికారుల వద్ద స్పష్టత లేకుండా పోయింది. -
చట్టానికి గంతలు.. రోడ్లపైనే భవంతులు
వశక్తినగర్ రోడ్డులోని అయ్యప్పనగర్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనమిది. టీడీపీ నేత అండదండలతో నిర్మిస్తున్న ఈ భవనం రెండో అంతస్తుపైన టీడీఆర్ పేరుతో ఇంతకుముందు పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. అయితే టీడీఆర్ అర్హత లేదు.. అనుమతులూ లేవన్న కారణంతో సీసీపీ ఆదేశాల మేరకు పెంట్‌హౌస్ నిర్మాణాన్ని ఇంతకుముందు టౌన్ ప్లానింగ్ అధికారులు కూలగొట్టారు.. పెంట్హౌసే అక్రమమంటే.. ఇప్పుడు ఏకంగా మూడో అంతస్తే నిర్మించేస్తున్నారు....మహా విశాఖ నగరంలో భవన నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలకు ఇదో మచ్చుతునక మాత్రమే.. నగరం మొత్తం తరచి చూస్తే ఇటువంటివి వందలు, వేలల్లోనే ఉంటాయి. ప్రభుత్వ స్థలాల్లో కట్టేస్తున్నవి కొన్నయితే.. నిబంధనలు మీరి నిర్మిస్తున్నవి ఇంకొన్ని.. నిబంధనలు పాటించని నిర్మాణాల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అడపాదడపా దాడులు చేసి అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నా.. కొద్దిరోజుల్లోనే మళ్లీ కట్టేస్తున్నారు.. ‘వారు కూల్చేస్తారు..మేం కట్టేస్తాం’.. అన్నట్లు అక్రమార్కులు దర్జా వెలగబెడుతున్నారు. ఇక ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాల విషయంలో అధికారులు కళ్లకు గంతలు కట్టేసుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం: చేతిలో అధికారం.. అడుగులకు మడుగులొత్తే అధికారుల అండదండలు.. అధికార టీడీపీ నేతలు రెచ్చిపోవడానికి ఇంకేం కావాలి. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కాజేస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా భారీ భవంతులు నిర్మించేస్తున్నారు. ఒకటి రెండుసార్లు కూలగొట్టినా దర్జాగా అంతస్తు మీద అంతస్తులు నిర్మించేస్తున్నారు. అడిగే వారు లేరన్న ధీమాతో నిబంధనలకు పాతరేస్తున్నారు. పేదల విషయంలో నిబంధనలను వల్లె వేసి, రోడ్డున పడేసే అధికారు అధికార పార్టీ నేతల వద్దకొచ్చేసరికి నీరుగారిపోతున్నారు. కోట్ల విలువ చేసే స్థలాలు, రోడ్లు, ప్రజోపయోగ స్థలాల్లో నిర్మిస్తున్న అక్రమ భవనాలు అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులవైతే వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పైగా ముందే వారితో మాట్లాడుకుంటే మామూళ్లు కూడా ముడతాయన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు గానీ, అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్కాడ్ గానీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా మధురవాడ, కొమ్మాది, సాగర్ నగర్, పీఎంపాలెం తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. తాము తీసుకుంటున్న ముడుపులు కింది నుంచి పై స్థాయి వరకు వాటాలు వేసుకుంటామని ఇటీవల అవినీతి నిరోధక శాఖకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్న ఓ ఉద్యోగి అధికారుల విచారణలో వెల్లడించడం చూస్తే.. ఇక అక్రమాలు అడ్డుకట్ట పడటం కల్లేనన్న భావన వ్యక్తమవుతోంది. ఉల్లంఘనలివే.. ♦ జీవీఎంసీ 4వ వార్డు జేఎన్ఎన్యూఆర్ఎం కొమ్మాది కాలనీకి కనెక్టవిటీ రోడ్డుపైనే అడ్డగోలుగా నిర్మిస్తున్న భవనాన్ని గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు అసిస్టెంట్ సిటీ ప్లానర్స్(ఏసీపీ) మూడుసార్లు తొలగించారు. అయినా అక్కడే అదే భవనం అధికార పార్టీ మాజీ కార్పోరేటర్ అండతో నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని పక్కనే మరో భవనాన్ని మంత్రి గంటా వద్ద పనిచేశానంటూ ఓ ఉద్యోగి నిర్మించేస్తున్నాడు. తలాతోకా లేని ఓ ప్రొసీడింగ్ ఆర్డర్ పట్టుకుని ఇంత దందా చేస్తున్నారు. అది తప్పు అని తెలిసినా మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడి భరించలేకపోతున్నామంటూ అధికారులు వారి అక్రమాలకు కొమ్ము కాస్తున్నారు. ♦ మరో టీడీపీ మహిళా నేత 5వ వార్డులో మాస్టర్ ప్లాన్ రోడ్డునే ఆక్రమించి భవనం నిర్మిస్తున్నారు. జెడ్సీ నుంచి అందరికీ ఇందులో పాత్ర ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. చర్యలు చేపడతామని చెప్పి నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో వారు లబ్ధిదారులని బుకాయిస్తున్నారు. ఇదే వాస్తవమైతే 5వ వార్డు సుద్ద గెడ్డ వద్ద నిలువ నీడలేని రజకులు సుమారు 50 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ♦ 5వ వార్డు శివశక్తినగర్ రోడ్డులోని అయ్యప్పనగర్ కాలనీ వద్ద టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో అతని బంధువు రెండో అంతస్తుపై టీడీఆర్ సాకుతో పెంట్ హౌస్ నిర్మించాడు. టీడీఆర్ లేదని.. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని సీసీపీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొన్ని రోజుల క్రితం దాన్ని పాక్షికంగా కూల్చేశారు. శ్లాబుకు జీవీఎంసీ అధికారులు పెట్టిన కన్నాలు అలా ఉండగానే పనులు చకచకా జరిగిపోతున్నాయి. అక్కడి జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నాయకులు అండ ఉండడంతో ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు దాని వైపు చూడటం మానేశారు. ♦ కొమ్మాది సర్వే నెంబరు. 153/3లో జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి స్థలం ఇచ్చినందుకు 2009లో ఆరుగురికి 60 గజాలు చొప్పున స్థలం ఇచ్చినట్టు ప్రొసీడింగ్ ఆర్డర్ చూపుతున్నారు. ఇది వాస్తవం అయితే ఇన్నిసార్లు జీవీఎంసీ అధికారులు ఎందుకు ఇక్కడ మొదట నిర్మించిన భవనాన్ని అడ్డుకొని పాక్షికంగా కూలగొట్టారన్నది ప్రశ్న. సరిగ్గా అదే ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు చకచకా సాగిపోతున్నాయి. అప్పుటి అక్రమం.. ఇప్పుడు సక్రమం ఎలా అయిపోయిందన్న దానికి సమాధానం లేదు. ప్రొసీడింగ్ ఆర్డర్లో పేర్కొన్న ఏ ఒక్కరూ ప్రస్తతం ఇక్కడ లేరు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయన్న ♦ ♦ ఆరోపణలు బలంగా విన్పిస్తు న్నాయి. ♦ ఇక స్వతంత్రనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఒక భవన నిర్మాణం జరుగుతోంది. దీనికి తూర్పు ఎమ్మెల్యే అండదండలు, వార్డు అధ్యక్షుడి సిఫార్సు ఉందని సిబ్బందే సెలవిస్తున్నారు. ఇలా అన్ని చోట్లా కుమ్మక్కు వ్యవహారాలే సాగుతున్నాయి. నిర్మాణాల ముసుగులో కోట్లాది రూపాయలు చేతులు మారుతూనే ఉన్నాయి. ♦ విచారణ జరిపిస్తాం వీటిపై డీసీసీపీ ఏ.ప్రభాకరరావును వివరణ కోరగా.. 4, 5 డివిజన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
అప్పుల కుప్పలు.. కాంట్రాక్టర్ల తిప్పలు
ప్రొద్దుటూరు : జిల్లాలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పనుల తీరు దయనీయంగా మారింది. గతంలో రెండు మార్లు చిన్న మొత్తాల్లో పనులు చేసిన ఆర్‌ఎంఎస్‌ఏ గత ఏడాది మొత్తం రూ.65 కోట్లతో 144 పనులు చేపట్టింది. భవనాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం చొప్పున చెల్లిస్తోంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు ల్యాబ్ గదుల నిర్మాణాలు చేపట్టారు. ఈ ప్రకారంగా మొత్తం 144లో నిధుల సమస్య కారణంగా 98 పనులు ప్రారంభించారు. వీటిలో 69 పనులకు మాత్రమే తొలివిడతగా నిధులు మంజూరయ్యాయి. మిగత భవనాలకు రూపాయి కూడా మంజూరు కాలేదు. 36 భవన నిర్మాణాలు తుది మెరుగు దశలో ఉండగా, 13 భవనాలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి భవనాలను అప్పగించాల్సి ఉంది. అయితే ఇంత వరకు రూ.65 కోట్లకుగాను రూ.19 కోట్ల వరకు మాత్రమే నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించిన తర్వాత మూడు దశల్లో మొత్తం డబ్బు చెల్లిస్తామని అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే నిర్మాణాలు ప్రారంభించిన వాటితోపాటు పూర్తయిన వాటికి కూడా ఇంత వరకు డబ్బు మంజూరు కాకపోవడం గమనార్హం. విద్యాశాఖ కదా అని ఎంతో ఆసక్తితో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. అయితే నిధుల చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ఈ పనులను నమ్ముకుని తాను ఇంటిలోని బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని ఓ కాంట్రాక్టర్ ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో బుద్ధి ఉంటే ఆర్‌ఎంఎస్‌ఏ పనులు చేయనని తెలిపారు. బిల్లుల చెల్లింపు ఇంత అధ్వానంగా ఉంటుందనుకోలేదన్నారు. బిల్లుల చెల్లింపు జాప్యంపై ఇటీవల కడపకు వచ్చిన ఆర్‌ఎంఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ సంధ్యారాణిని కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు. వారం లోపు నిధులు మంజూరవుతాయని చెప్పినా ఇంత వరకు మంజూరు కాలేదు. పైగా చుట్టుపక్కల జిల్లాల కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు మంజూరైన విషయాన్ని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తాము ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ప్రస్తుతం 3వ విడత కింద ఈ పనులు జరుగుతుండగా ఐదేళ్ల క్రితం జరిగిన తొలివిడతలో చేపట్టిన 88 వర్క్లకుగాను రూ.35లక్షలు, రెండేళ్ల క్రితం జరిగిన రెండో విడత కింద చేపట్టిన 12 పనులకు ఇంకా రూ.45 లక్షలు కాంట్రాక్టర్లకు డిపార్ట్మెంట్ చెల్లించాల్సి ఉంది. పరిస్థితి ఇలా ఉంటే తాము నిండా మునగడం ఖాయమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.