గంటా వద్ద గతంలో సెక్యూరిటీ విధులు నిర్వహించిన వ్యక్తి కొమ్మాది నవోదయ సమీపంలో రోడ్డు మీదే నిర్మిస్తున్న భవంతి
వశక్తినగర్ రోడ్డులోని అయ్యప్పనగర్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనమిది. టీడీపీ నేత అండదండలతో నిర్మిస్తున్న ఈ భవనం రెండో అంతస్తుపైన టీడీఆర్ పేరుతో ఇంతకుముందు పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. అయితే టీడీఆర్ అర్హత లేదు.. అనుమతులూ లేవన్న కారణంతో సీసీపీ ఆదేశాల మేరకు పెంట్‌హౌస్ నిర్మాణాన్ని ఇంతకుముందు టౌన్ ప్లానింగ్ అధికారులు కూలగొట్టారు.. పెంట్‌హౌసే అక్రమమంటే.. ఇప్పుడు ఏకంగా మూడో అంతస్తే నిర్మించేస్తున్నారు....మహా విశాఖ నగరంలో భవన నిర్మాణాల్లో జరుగుతున్న అక్రమాలకు ఇదో మచ్చుతునక మాత్రమే.. నగరం మొత్తం తరచి చూస్తే ఇటువంటివి వందలు, వేలల్లోనే ఉంటాయి. ప్రభుత్వ స్థలాల్లో కట్టేస్తున్నవి కొన్నయితే.. నిబంధనలు మీరి నిర్మిస్తున్నవి ఇంకొన్ని.. నిబంధనలు పాటించని నిర్మాణాల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు అడపాదడపా దాడులు చేసి అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నా.. కొద్దిరోజుల్లోనే మళ్లీ కట్టేస్తున్నారు.. ‘వారు కూల్చేస్తారు..మేం కట్టేస్తాం’.. అన్నట్లు అక్రమార్కులు దర్జా వెలగబెడుతున్నారు. ఇక ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న నిర్మాణాల విషయంలో అధికారులు కళ్లకు గంతలు కట్టేసుకుంటున్నారు.
సాక్షి, విశాఖపట్నం: చేతిలో అధికారం.. అడుగులకు మడుగులొత్తే అధికారుల అండదండలు.. అధికార టీడీపీ నేతలు రెచ్చిపోవడానికి ఇంకేం కావాలి. ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కాజేస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా భారీ భవంతులు నిర్మించేస్తున్నారు. ఒకటి రెండుసార్లు కూలగొట్టినా దర్జాగా అంతస్తు మీద అంతస్తులు నిర్మించేస్తున్నారు. అడిగే వారు లేరన్న ధీమాతో నిబంధనలకు పాతరేస్తున్నారు. పేదల విషయంలో నిబంధనలను వల్లె వేసి, రోడ్డున పడేసే అధికారు అధికార పార్టీ నేతల వద్దకొచ్చేసరికి నీరుగారిపోతున్నారు. కోట్ల విలువ చేసే స్థలాలు, రోడ్లు, ప్రజోపయోగ స్థలాల్లో నిర్మిస్తున్న అక్రమ భవనాలు అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులవైతే వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
పైగా ముందే వారితో మాట్లాడుకుంటే మామూళ్లు కూడా ముడతాయన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు గానీ, అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్కాడ్ గానీ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా మధురవాడ, కొమ్మాది, సాగర్ నగర్, పీఎంపాలెం తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. తాము తీసుకుంటున్న ముడుపులు కింది నుంచి పై స్థాయి వరకు వాటాలు వేసుకుంటామని ఇటీవల అవినీతి నిరోధక శాఖకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్న ఓ ఉద్యోగి అధికారుల విచారణలో వెల్లడించడం చూస్తే.. ఇక అక్రమాలు అడ్డుకట్ట పడటం కల్లేనన్న భావన వ్యక్తమవుతోంది.
ఉల్లంఘనలివే..
♦ జీవీఎంసీ 4వ వార్డు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కొమ్మాది కాలనీకి కనెక్టవిటీ రోడ్డుపైనే అడ్డగోలుగా నిర్మిస్తున్న భవనాన్ని గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు అసిస్టెంట్ సిటీ ప్లానర్స్(ఏసీపీ) మూడుసార్లు తొలగించారు. అయినా అక్కడే అదే భవనం అధికార పార్టీ మాజీ కార్పోరేటర్ అండతో నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని పక్కనే మరో భవనాన్ని మంత్రి గంటా వద్ద పనిచేశానంటూ ఓ ఉద్యోగి నిర్మించేస్తున్నాడు. తలాతోకా లేని ఓ ప్రొసీడింగ్ ఆర్డర్ పట్టుకుని ఇంత దందా చేస్తున్నారు. అది తప్పు అని తెలిసినా మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడి భరించలేకపోతున్నామంటూ అధికారులు వారి అక్రమాలకు కొమ్ము కాస్తున్నారు.
♦ మరో టీడీపీ మహిళా నేత 5వ వార్డులో మాస్టర్ ప్లాన్ రోడ్డునే ఆక్రమించి భవనం నిర్మిస్తున్నారు. జెడ్సీ నుంచి అందరికీ ఇందులో పాత్ర ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. చర్యలు చేపడతామని చెప్పి నెలలు గడుస్తున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో వారు లబ్ధిదారులని బుకాయిస్తున్నారు. ఇదే వాస్తవమైతే 5వ వార్డు సుద్ద గెడ్డ వద్ద నిలువ నీడలేని రజకులు సుమారు 50 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
♦ 5వ వార్డు శివశక్తినగర్ రోడ్డులోని అయ్యప్పనగర్ కాలనీ వద్ద టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో అతని బంధువు రెండో అంతస్తుపై టీడీఆర్ సాకుతో పెంట్ హౌస్ నిర్మించాడు. టీడీఆర్ లేదని.. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని సీసీపీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొన్ని రోజుల క్రితం దాన్ని పాక్షికంగా కూల్చేశారు. శ్లాబుకు జీవీఎంసీ అధికారులు పెట్టిన కన్నాలు అలా ఉండగానే పనులు చకచకా జరిగిపోతున్నాయి. అక్కడి జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నాయకులు అండ ఉండడంతో ఆ తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు దాని వైపు చూడటం మానేశారు.
♦ కొమ్మాది సర్వే నెంబరు. 153/3లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి స్థలం ఇచ్చినందుకు 2009లో ఆరుగురికి 60 గజాలు చొప్పున స్థలం ఇచ్చినట్టు ప్రొసీడింగ్ ఆర్డర్ చూపుతున్నారు. ఇది వాస్తవం అయితే ఇన్నిసార్లు జీవీఎంసీ అధికారులు ఎందుకు ఇక్కడ మొదట నిర్మించిన భవనాన్ని అడ్డుకొని పాక్షికంగా కూలగొట్టారన్నది ప్రశ్న. సరిగ్గా అదే ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు చకచకా సాగిపోతున్నాయి. అప్పుటి అక్రమం.. ఇప్పుడు సక్రమం ఎలా అయిపోయిందన్న దానికి సమాధానం లేదు. ప్రొసీడింగ్ ఆర్డర్‌లో పేర్కొన్న ఏ ఒక్కరూ ప్రస్తతం ఇక్కడ లేరు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయన్న ♦ ♦ ఆరోపణలు బలంగా విన్పిస్తు న్నాయి.
♦ ఇక స్వతంత్రనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఒక భవన నిర్మాణం జరుగుతోంది. దీనికి తూర్పు ఎమ్మెల్యే అండదండలు, వార్డు అధ్యక్షుడి సిఫార్సు ఉందని సిబ్బందే సెలవిస్తున్నారు.
ఇలా అన్ని చోట్లా కుమ్మక్కు వ్యవహారాలే సాగుతున్నాయి. నిర్మాణాల ముసుగులో కోట్లాది రూపాయలు చేతులు మారుతూనే ఉన్నాయి.
♦ విచారణ జరిపిస్తాం
వీటిపై డీసీసీపీ ఏ.ప్రభాకరరావును వివరణ కోరగా.. 4, 5 డివిజన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment