ప్రొద్దుటూరు : జిల్లాలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) పనుల తీరు దయనీయంగా మారింది. గతంలో రెండు మార్లు చిన్న మొత్తాల్లో పనులు చేసిన ఆర్‌ఎంఎస్‌ఏ గత ఏడాది మొత్తం రూ.65 కోట్లతో 144 పనులు చేపట్టింది. భవనాల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం చొప్పున చెల్లిస్తోంది. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు ల్యాబ్ గదుల నిర్మాణాలు చేపట్టారు.
ఈ ప్రకారంగా మొత్తం 144లో నిధుల సమస్య కారణంగా 98 పనులు ప్రారంభించారు. వీటిలో 69 పనులకు మాత్రమే తొలివిడతగా నిధులు మంజూరయ్యాయి. మిగత భవనాలకు రూపాయి కూడా మంజూరు కాలేదు. 36 భవన నిర్మాణాలు తుది మెరుగు దశలో ఉండగా, 13 భవనాలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి భవనాలను అప్పగించాల్సి ఉంది. అయితే ఇంత వరకు రూ.65 కోట్లకుగాను రూ.19 కోట్ల వరకు మాత్రమే నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించిన తర్వాత మూడు దశల్లో మొత్తం డబ్బు చెల్లిస్తామని అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే నిర్మాణాలు ప్రారంభించిన వాటితోపాటు పూర్తయిన వాటికి కూడా ఇంత వరకు డబ్బు మంజూరు కాకపోవడం గమనార్హం. విద్యాశాఖ కదా అని ఎంతో ఆసక్తితో కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. అయితే నిధుల చెల్లింపులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఈ కారణంగా కాంట్రాక్టర్లు నలిగిపోతున్నారు. ఈ పనులను నమ్ముకుని తాను ఇంటిలోని బంగారాన్ని సైతం తాకట్టు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని ఓ కాంట్రాక్టర్ ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో బుద్ధి ఉంటే ఆర్‌ఎంఎస్‌ఏ పనులు చేయనని తెలిపారు. బిల్లుల చెల్లింపు ఇంత అధ్వానంగా ఉంటుందనుకోలేదన్నారు. బిల్లుల చెల్లింపు జాప్యంపై ఇటీవల కడపకు వచ్చిన ఆర్‌ఎంఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ సంధ్యారాణిని కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి తమ ఆవేదనను వెలిబుచ్చారు.
వారం లోపు నిధులు మంజూరవుతాయని చెప్పినా ఇంత వరకు మంజూరు కాలేదు. పైగా చుట్టుపక్కల జిల్లాల కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు మంజూరైన విషయాన్ని అధికారులు అంగీకరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లామని తెలిపారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తాము ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నారు.
ప్రస్తుతం 3వ విడత కింద ఈ పనులు జరుగుతుండగా ఐదేళ్ల క్రితం జరిగిన తొలివిడతలో చేపట్టిన 88 వర్క్‌లకుగాను రూ.35లక్షలు, రెండేళ్ల క్రితం జరిగిన రెండో విడత కింద చేపట్టిన 12 పనులకు ఇంకా రూ.45 లక్షలు కాంట్రాక్టర్లకు డిపార్ట్‌మెంట్ చెల్లించాల్సి ఉంది. పరిస్థితి ఇలా ఉంటే తాము నిండా మునగడం ఖాయమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుల కుప్పలు.. కాంట్రాక్టర్ల తిప్పలు
Published Sun, May 17 2015 3:39 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement