గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ ప్రకటించారు. ఎన్నికల ఓటమి అనంతరం శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజీనామాను ఆదివారం నాడు పీసీసీకి, దిగ్విజయ్ సింగ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. ప్రజలు తమను విశ్వసించలేదని.. టీఆర్ఎస్‌ను బాగా విశ్వసించారని చెప్పారు. ఇంత పెద్ద మాండేట్ రావడం కనీ వినీ ఎరుగమని ఆయన అన్నారు. ప్రజలు వాళ్లను, వాళ్లు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను నమ్మారన్నారు. టీఆర్ఎస్ తమ మేనిఫెస్టోలో చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉచిత కరెంటు, నీటి బిల్లుల మాఫీ, 24 గంటల కరెంటు, హైదరాబాద్ నలుమూలలా ఆరు వెయ్యి పడకల ఆస్పత్రులు.. ఇవన్నీ స్వాగతించాల్సిన విషయాలే, వాటిని స్వాగతిస్తున్నామని అన్నారు. తాము ఇక మీదట నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. వాళ్లిచ్చిన వాగ్దానాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటామని చెప్పారు. వాటిని అమలు చేయలేకపోతే కారణాలేంటో చెప్పాల్సిన బాద్యత వాళ్లకు ఉంటుందని అన్నారు.
నాకు బాధ్యత ఇవ్వలేదు గానీ..
ఇక తనకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించకపోయినా, ఈ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ చెప్పారు. ఇన్నాళ్లూ ఇచ్చిన అవకాశాలకు ధన్యవాదాలని.. ఇక సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను పార్టీకి దూరం చేసుకుంటున్నామని అధిష్ఠానానికి తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. ఈ తీర్పు రావడానికి కూడా అదే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విశ్వసనీయతను కోల్పోయిందని భావిస్తున్నానన్నారు. గ్రూపు తగాదాల వల్ల ఈ రోజు జరిగిన నష్టం చాలా తీవ్రమని అన్నారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నామని.. దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తాను చాలాసార్లు చెప్పానని తెలిపారు.
ఓడిపోతున్నట్లు అభ్యర్థులకు ముందే చెప్పా
ఎన్నికలు ముగిసిన తర్వాతే.. మనమంతా ఓడిపోతున్నామని అభ్యర్థులందరికీ చెప్పానని దానం నాగేందర్ అన్నారు. అప్పటికే ప్రజల మూడ్ చూస్తే విషయం స్పష్టంగా అర్థమైపోయిందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు చాలా తెలివిగా ఓట్లు వేశారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీకి చెందిన మేయర్ వస్తే నగర అభివృద్ధి కుంటుపడుతుందేమోనన్న ఆలోచనతో ఓట్లు వేశారని, వాళ్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. 1983లో టీడీపీ పెట్టినప్పుడు మొత్తం రాష్ట్రం స్వీప్ అయ్యిందని, తాము అతి కొద్దిమందిమే గెలిచినా మనోధైర్యాన్ని కోల్పోలేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరం కావాలని కోరుకునేవాళ్లలో తాము కూడా ఉంటామని, ఆ హామీని వాళ్లు విస్మరించినప్పుడు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంటామని తెలిపారు.