దసరా స్పెషల్
సాక్షి, సిటీబ్యూరో: దసరా రద్దీ మొదలైంది. సొంత ఊళ్లలో దసరా వేడుకలు చేసుకొనేందుకు నగర వాసులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు... మహాత్మా గాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లు శనివారం ప్రయాణికులతో కిటకిటలాడాయి. బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు ప్రయాణికులతో నిండిపోయాయి.
రిజర్వేషన్లు దొరకని ప్రయాణికులు జనరల్ బోగీల్లో పయనించేందుకు పోటీ పడ్డారు. దీంతో కౌంటర్లు... జనరల్ బోగీల వద్ద రద్దీ నెలకొంది. సికింద్రాబాద్ నుంచి నిత్యం వెళ్లే సుమారు 1.8 లక్షల ప్రయాణికులకు తోడు శనివారం మరో 20 వేల మంది అదనంగా బయలుదేరారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల మధ్య 117 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లలోనూ ప్రయాణికుల రద్దీ కనిపించింది.
బస్సులు కిటకిట
బస్సులలోనూ దసరా ప్రభావంకనిపించింది. రోజూ సుమారు 1.2 లక్షల మంది రాకపోకలు సాగించే మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి శనివార ం మరో 20 వేల మంది అదనంగా బయలుదేరారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, కడప, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ తదితర ప్రాంతాలకు తరలి వెళ్లారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని 3,855 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. నిత్యం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 3,500 బస్సులకు ఇవి అదనం.
ఏటీవీఎంల వద్ద రద్దీ...
తెలంగాణలోని వివిధ జిల్లాలకు బయలుదేరిన ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో జనరల్ టిక్కెట్ల కోసం పెద్ద సంఖ్యలో ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్‌ల వద్ద బారులు తీరారు. జనరల్ కౌంటర్‌లతో పాటు, ఏటీవీఎంల వద్ద భారీ రద్దీ నెలకొంది.