దత్తాత్రేయ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపైన, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపైన కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. రాహుల్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఇది రాహుల్ భరోసా యాత్రకాదని, కాంగ్రెస్ భరోసా యాత్ర అని దత్తాత్రేయ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలపై సమాధానం చెప్పాలని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి రైతులు ఆత్మహత్యలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.
అవినీతికి పుట్టినిట్లు కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే ఆజ్యం పోసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. విమర్శలను వదిలి ఆ పార్టీ ఇతర అంశాలను రాజకీయం చేస్తుందన్నారు. నరేంద్ర మోదీ పాలన పారదర్శకంగా ఉందని కితాబిచ్చారు. ఈఎస్ఐ కార్పోరేషన్ ద్వారా 7 కోట్ల 50 లక్షల మందికి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. సనత్ నగర్ మెడికల కాలేజీని నడపలేనని తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లు దత్తాత్రేయ తెలిపారు.