వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని రకాల డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుతోపాటు ఇతర కోర్సులోని సబ్జెక్టులను చదువుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనికి క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. 2015-16 విద్యా సంవత్సరంలోనే సీబీసీఎస్‌ను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ సిలబస్‌లో మార్పులు, సీబీసీఎస్‌కు అనుగుణంగా కోర్సులు, సబ్జెక్టుల మధ్య అనుసంధానం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో 2016-17 నుంచి దీన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది.
విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లతో సమావేశమై ఉన్నత విద్యలో ప్రమాణాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలు, వివిధ కార్యక్రమాలు, పథకాలపై సమీక్షించారు. జాతీయ స్థాయి విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఉన్నత విద్యా రంగంలో మార్పులు తేవాలని నిర్ణయిం చారు. అలాగే అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. దీనిపై వీసీలు, రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీచేశారు. సెమిస్టర్ వారీగా, క్రెడిట్ పాయింట్లతో సహా సిలబస్‌ను సిద్ధం చేసుకోనున్నారు. ఆయా వర్సిటీల బోర్డు ఆఫ్ స్టడీస్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లలో ఆమోదం తీసుకోవాలి. వర్సిటీలు, కాలేజీలకు న్యాక్ గుర్తింపు లేకపోతే నిధులు ఇవ్వబోమని రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) స్పష్టం చేయడంతో న్యాక్ అక్రిడిటేషన్ కోసం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. జాతీయ స్థాయి ర్యాంకింగ్ కోసం అన్ని విద్యా సంస్థలు తమ సమాచారాన్ని అప్‌లోడ్ చేయాలని, 2016-17లో రూసా నిధుల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్రానికి పంపాలని నిర్ణయించింది.
డిగ్రీ, పీజీ కోర్సుల్లో సీబీసీఎస్
Published Tue, Feb 16 2016 3:00 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM
Advertisement
Advertisement