ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ రాహుల్ బొజ్జా
సాక్షి, సిటీబ్యూరో: వివిధ శాఖల్లో వికలాంగుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని, దరఖాస్తు చేసుకున్న వారి అర్హతల మేరకు ఆయా ఉద్యోగాల్లో నియమిస్తామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఆయన ప్రజలనుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మైనార్టీ కార్పోరేషన్ ద్వారా గత వారమే 367 మందికి రూ.2 లక్షల రుణానికి సంబంధించి లబ్ధిదారులను చేశామన్నారు. రూ.లక్ష లోపు రుణాలను త్వరలో మంజూరు చేస్తామన్నారు. రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు దరఖాస్తు చేసుకున్నవారు ఇంకా రెండు నెలలు వేచి ఉండాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం బస్తీల వారిగా సమావేశాలు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో త్వరలో తేదీలు ఖరారు చేస్తామని, అప్పుడే దరఖాస్తు చేయాలని సూచించారు.
► బంధువుల కిరాణం షాపులో పని చేస్తుండగా బాలనేరస్తుడని అపోహపడి తన కుమారుడు దేవేందర్‌ను పోలీసులు తీసుకెళ్లారని ఆగాపురాకు చెందిన శ్యామ్ భవాన్ కలెక్టర్‌ను కోరారు. తన కుమారుడిన్ని అప్పగించాలని విజ్ఞప్తి చేయగా, ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
► ఆసీఫ్‌నగర్‌కు చెందిన గీత తాను 2005లో ఇంటి కోసం రూ.1000 చెల్లించానని, ఇప్పటి వరకు ఇల్లు రాలేదని వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ డబ్బు చెల్లించిన వారు జిల్లాలో 35 వేల మంది ఉన్నారని, వారందరి జాబితాను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వానికి పంపామన్నారు. తుది నిర్ణయం వెలువడే వరకు ఓపిక పట్టాలని సూచించారు. మీకోసం కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏజేసీ అశోక్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.