
దసరాకు 15 రోజులు సెలవులు
♦ సెప్టెంబరు 30 - అక్టోబరు 14 వరకు
♦ జనవరి 11-17 వరకు సంక్రాంతి సెలవులు
♦ ఏప్రిల్ 24-జూన్ 11 వరకు వేసవి సెలవులు
♦ మైనారిటీ స్కూళ్లకు డిసెంబరు 24- 31
♦ వరకు క్రిస్మస్ సెలవులు
♦ 2015-16 వార్షిక కేలండర్ సిద్ధం
♦ స్కూళ్లకు అక్రెడిటేషన్, ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు 2016-17 వార్షిక కేలండర్‌ను విద్యా శాఖ రూపొందించింది. వచ్చే విద్యా సంవత్సరాన్ని మార్చి 21 నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. ‘స్కూళ్లకు అక్రెడిటేషన్, ర్యాంకుల విధానముండాలి. ఒకే ఆవరణలో వేర్వేరుగా సెక్షన్లుగా కొనసాగుతున్న తెలుగు, ఇంగ్లిషు మీడియం స్కూళ్లను విడదీయాలి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను వేరుగానే కొనసాగించాలి. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారిని వాటిలోకి బదిలీ చేయాలి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులిచ్చి జూన్ 13న స్కూళ్లను తిరిగి ప్రారంభించాలి. ఇంగ్లిషు మీడియం బోధించే టీచర్లకు వేసవి సెలవుల్లోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి’ అని పేర్కొంది. ఈ కేలండర్‌పై పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ గురువారం విద్యా శాఖ సీనియర్ అధికారులతో చర్చించారు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలకు పంపారు. ఈ నెల 29లోగా సలహాలు, సూచనలు కోరారు. ఇదే కేలండర్ దాదాపుగా అమల్లోకి రానుంది.
ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ముగ్గురు టీచర్లు
‘హేతుబద్ధీకరణలో భాగంగా ఒక నివాస ప్రాంతంలో కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చే సి ఒక స్కూల్‌నే కొనసాగించాలి. వాటిల్లో ముగ్గురు టీచర్లుండేలా చూడాలి. రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విధానమే ఉండాలి. ప్రాథమికోన్నత విధానం అక్కర్లేదు. ఆ పాఠశాలలను 3 కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలి. 4 కిలోమీటర్ల పరిధిలో కూడా ఉన్నత పాఠశాల లేకపోతే సదరు ప్రాథమికోన్నత పాఠశాలలనే ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. హైస్కూళ్లకు సంబంధించి హేతుబద్ధీకరణ సమయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలు 407, పది మందిలోపే ఉన్నవి 992 ఉన్నాయి’ అని విద్యా వార్షిక ప్రణాళిక పేర్కొంది.
పరీక్షలిలా...
♦ అన్ని సబ్జెక్టుల్లోనూ సిలబస్‌ను మార్చి 21-ఏప్రిల్ 23 వరకు ఒక విభాగం, జూన్ 13-2017 ఫిబ్రవరి 28 వరకు రెండో విభాగంగా విభజించారు
♦ ఫార్మేటివ్-1 పరీక్ష (ఎఫ్‌ఏ)లను జూలై 31లోగా, ఎఫ్‌ఏ-2ను సెప్టెంబరు 22లోగా, ఎస్‌ఏ-1 పరీక్షల్ని సెప్టెంబర్ 23-29 వరకు, ఎఫ్‌ఏ-3ని నవంబరు 30లోగా, ఎఫ్‌ఏ-4ను 2017 జనవరి 30లోగా నిర్వహించాలి.
♦ పది మినహా మిగతా తరగతులకు వార్షిక పరీక్ష (ఎస్‌ఏ-2)లను 2017 మార్చి 7 నుంచి 15 వరకు నిర్వహించాలి.
♦ పదో తరగతికి ఫిబ్రవరి 22-మార్చి 6 దాకా ప్రీ ఫైనల్ పరీక్షలుంటాయి. వార్షిక పరీక్షల తేదీని తర్వాత నిర్ణయిస్తారు.