సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో జరుగుతున్న విభజన ప్రక్రియపై గవర్నర్ సలహాదారుడు ఎ.ఎన్. రాయ్‌కు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు ప్రాథమిక నివేదికను శుక్రవారం అందజేశారు. ఇందులో క్రింది స్థాయి సిబ్బంది మొదలుకుని రేంజ్‌ల వరకు జరిగిన విభజన కసరత్తుపై ఆయన నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. అంతేగాక డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఫైళ్లు, రికార్డుల విభజన ఏ మేరకు జరిగిందనే అంశాలను కూడా ఇందులో పొందుపర్చారు. ఇక రాష్ట్ర స్థాయి కేడర్ అయిన డీఎస్పీ నుంచి నాన్ కేడర్ ఎస్పీ స్థాయి అధికారుల విభజనపై సాగుతున్న కసరత్తు గురించి ఇందులో డీజీపీ పేర్కొన్నారు.ఇక పది సంవత్సరాల పాటు రాజధానిగా హైదరాబాద్‌ను పేర్కొన్న కారణంగా ఇక్కడ రెండు రాష్ట్రాల పోలీసు హెడ్‌క్వార్టర్స్, ఉన్నతాధికారులు విధులు నిర్వహించాల్సిన భవనాలు, వారి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కోసం కేటాయించాల్సిన భవనాలు తదితర అంశాలపై చర్చలు సాగుతున్నట్లు డీజీపీ నివేదికలో పేర్కొన్నారు.