కాసులు, కాంట్రాక్టుల కోసమే..
కాంగ్రెస్‌ను వీడిన టీఆర్‌ఎస్ నేతలపై దిగ్విజయ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలను వ్యాపారంగా చేసేవారే పార్టీలు మారుతున్నారని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ధ్వజమెత్తారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు కాంట్రాక్టులకు, పదవులకు, డబ్బులకు ఆశపడే కాంగ్రెస్‌ను వీడారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ భారీగా డబ్బు, కాంట్రాక్టులు ఆశ చూపి వలసలను ప్రోత్సహిస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వలసలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ అప్రజాస్వామిక, రాజ్యాంగవిరుద్ధ చర్యలపై సమాధానం చెప్పాలి. ఫిరాయింపు నేతలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన నేతల నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెడతామని ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో పీసీసీ సమన్వయకమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఏఐసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు, ఉత్తమ్, సీఎల్పీ నాయకుడు కె.జానా రెడ్డి, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ఆర్.సి.కుంతియాలతో కలిసి దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. కొందరు నాయకులు పోయినా కాంగ్రెస్ పార్టీ బలహీనపడబోదని, రెట్టించిన స్ఫూర్తితో పని చేస్తామని చెప్పారు. అధికార టీఆర్‌ఎస్ రెండేళ్ల వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. తెలంగాణలో టీడీపీ, బీజేపీ సహా ఇతర పార్టీలేమీ లేవని, ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ‘‘పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు తదితరాలపై భేటీలో చర్చించాం. అంతా క్రమశిక్షణతో ఉండాలని నిర్ణయించాం’’ అని వెల్లడించారు. గాంధీభవన్ వీడి గ్రామాలకు వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. మల్లన్నసాగర్‌తో పాటు అన్ని ప్రాజెక్టుల పరిధిలో రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని ప్రకటించారు.
అవినీతికి తలుపులు తెరిచారు..
సాగు, తాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ అవినీతికి తలుపులను బార్లాగా తెరిచారని దిగ్విజయ్ ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. భూ సేకరణ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులను ఒత్తిడి చేసి భూములు తీసుకుంటున్నారని విమర్శించారు. భూములు లేని పేదవారిని ఎలా ఆదుకుంటారో ప్రభుత్వం చెప్పడం లేదంటూ తప్పుబట్టారు. రంజాన్‌కు బట్టలు పంచుతున్న కేసీఆర్, ముస్లింలకు అంతకుముందు ఇచ్చిన హామీలను ఏం చేశారని ప్రశ్నించారు. వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీపై బదులివ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోతున్న వారికి జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో ఉద్యమిస్తామని, న్యాయ పోరాటం చేస్తామని కొప్పుల రాజు హెచ్చరించారు. పునరావాసం విషయంలో నిర్వాసితులకు, రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయాలన్నారు. జీవో 123తో రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ చట్టాన్ని నీరుగార్చేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
బూత్ స్థాయి నుంచి పటిష్టం: ఉత్తమ్
మల్లన్నసాగర్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటోందని ఉత్తమ్ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ పోరాడుతుందని ప్రకటించారు. పోలింగ్ బూత్‌స్థాయి నుంచి కాంగ్రెస్‌ను పటిష్టపరుస్తామని చెప్పారు. ‘‘జూన్ 30లోపు మండల కమిటీలను పూర్తి చేస్తాం. జూలైలో శిక్షణా తరగతులు పూర్తి చేస్తాం. ఆగస్టులో పోలింగ్‌బూత్ స్థాయిలో కమిటీలు వేస్తాం’’ అని వివరించారు. భూ సేకరణ చట్టంపై అవగాహన కోసం గురువారం గాంధీభవన్‌లో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. వాటి ఏర్పాటు జ్యుడీషియరీ కమిషన్ ద్వారా జరగాలని డిమాండ్ చేశారు.