
ఒక్క చోటైనా ఓకేనా?
- ఎమ్మెల్సీ ఎన్నికలపై టీటీడీపీలో మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి స్థానిక కోటా ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసినట్టే కన్పిస్తోంది. మండలి ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఒక స్థానానికి పోటీపడి చేతు లు కాల్చుకున్న టీటీడీపీ ‘ఓటుకు కోట్లు’ కేసు లో పీకల్లోతు కూరుకుపోయింది. పాత అనుభవాల దృష్ట్యా ఏ నాయకుడూ స్థానిక కోటా ఎన్నికలను భుజాన వేసుకోవడం లేదు. ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే టీటీడీపీ స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నా, ఎక్కడా ఒంటరిగా బరిలోకి దిగి, కనీస ప్రాబల్యం చూపించే పరిస్థితిలో లేదు. మొత్తం 12 స్థానాల్లో కనీసం ఒక్కచోట పోటీచేసినా గగనమేనన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.
ఎసరు పెట్టిన వలసలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీడీపీ మెరుగైన స్థానాలు దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పార్టీ శిబిరం సగానికిపైగా ఖాళీ అయింది. స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ఓట్లే కీలకం. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని వెన క్కి తీసుకురావడం మాట అటుంచి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరి ఓట్లు కొనుగోలు చేయడం సవా లే అంటున్నారు. టీడీపీ నుంచి గెలిచి, పార్టీని వీడింది, ఉన్నదెంతమందనే దానిపై స్పష్టత ఉన్న నాయకత్వం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనకా ముందాడుతోంది. పార్టీకి 4 జిల్లాల్లో చెప్పుకోదగిన ఓట్లున్నాయని, బీజేపీ మద్దతు అదనపు బలమవుతుందని, కనీసం మూడు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించినట్టు సమాచారం.
దీన్లో భాగంగానే మహబూబ్‌నగర్‌లో ఒక స్థానానికి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డిని ఖరారు చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏదో ఒకచోట నుంచి ఒక స్థానంలో పోటీచేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహనపై పార్టీ నాయకులు ఇంకా ఎటూ తేల్చుకోలేదు. ఒకచోట మద్దతు ఇచ్చి, మరోచోట మద్దతు తీసుకుని అవగాహనతో ఓట్లను పంపిణీ చేసుకుని బయట పడాలన్న వ్యూహంలో టీటీడీపీ ఉన్నట్లు సమాచారం.