నేటి నుంచే 'ట్రాఫిక్' డిస్కౌంట్
హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనులకు పాల్పడి..పెద్ద మొత్తంలో జరిమానాలు బకాయిపడ్డ వాహనదారులకు గొప్ప రిలీఫ్. జరిమానాలో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు ట్రాఫిక్ పోలీస్ విభాగం ముందుకొచ్చింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానా బకాయి మొత్తాన్ని సగానికి తగ్గించుకోవడానికి అవకాశం కల్పించే ‘ట్రాఫిక్ మెగా లోక్ అదాలత్’ బుధవారం నుంచి ప్రారంభంమైంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి గుర్తించుకోవాల్సిన అంశాలివీ...
ఎన్నాళ్ళు, ఎక్కడ?
బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గోషామహల్‌లోని పోలీసుస్టేడియం ప్రాంగణంలో. ట్రాఫిక్ విభాగం పది కౌంటర్లు ఏర్పాటు చేసింది.
ఎవరు రావచ్చు?
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఏ కమిషనరేట్ నుంచి జారీ అయిన ఈ–చలాన్‌లు అయినా ఈ లోక్ అదాలత్ ద్వారా తగ్గింపు పొందవచ్చు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన కేసుల్లో మాత్రం తగ్గింపు లేదు.
ఏమేమి తీసుకురావాలి?
వాహనయజమానే రావాల్సిన అవసరం లేదు. వారి తరఫున ఎవరైనా హాజరుకావచ్చు. వచ్చేప్పుడు ఈ–చలాన్ ప్రింట్ ఔట్, డ్రైవింగ్ లైసెన్స్ కాపీ/నెంబర్, ఆధార్ కార్డ్ (తప్పనిసరి కాదు), వాహనచోదకులు సెల్‌ఫోన్ నెంబర్ తీసుకురావాలి. ఈ మెగా లోక్ అదాలత్‌లో జరిమానా బకాయిలు చెల్లించిన వాహనచోదకులు కచ్చితంగా రసీదు తీసుకోవాలి.
ఈ–చలాన్ స్టేటస్ తెలుసుకోండిలా:
వాహనచోదకులు తమ వాహనంపై జారీ అయి ఉన్న పెండింగ్ ఈ–చలాన్ వివరాలు నగర ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్ (www.htp.gov.in), సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్ (www.ctp.gov.in) లతో పాటు (Hyderabad Traffic Live, Telangana EChallan, Telangana Traffic Police) మొబైల్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారానూ తెలుసుకోవచ్చు.