ఫిరాయింపుల కేసుపై కేసీఆర్ సమాలోచనలు
హైదరాబాద్: అనర్హత పిటిషన్ల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విస్తృతంగా సమాలోచనలు జరిపారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావుతో ఆయన శుక్రవారం అడ్వకేటు జననర్ (ఏజీ) రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఈ నెల 8వ తేదీలోగా స్పీకర్ కౌంటర్ దాఖలు చేయాల్సిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముథోల్ ఎమ్మెల్యే గడ్డం విఠల్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) విప్ , అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సంపత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీంతో సుప్రీం కోర్టు ఈనెల ఎనిమిదో తేదీలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం ఇవ్వాలని స్పీకర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై చర్చించేందుకు, న్యాయ సలహా పొందేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఏజీని పిలిపించి చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే తలెత్తినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే పూర్తి విచక్షణాధికారం స్పీకర్‌కే ఉన్నా, న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఈ వ్యవహారంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సమాధానం ఇవ్వాల్సిన అవసరంపైనే చర్చించారని సమాచారం. అదే మాదిరిగా.., అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం, సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఆ తేదీలపై కూడా కేసీఆర్, మంత్రి హరీష్ చర్చించుకున్నారని అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నవంబర్ చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.