వికటించిన బీజేపీ,టీడీపీల స్నేహం
► పొత్తు ధర్మాన్ని విస్మరించి పలు చోట్ల రెండు పార్టీల బీ-ఫారాలు
► బీజేపీకి కేటాయించిన 5 చోట్ల టీడీపీ,
► టీడీపీ పోటీ చేసే 5 స్థానాల్లో బీజేపీ బీ-ఫారాలు
► చివరి నిమిషంలో టీడీపీ చర్యకు బీజేపీ ప్రతిచర్య
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీల పొత్తు వికటించింది. తమకు బలమున్న చోట సీట్లు ఇవ్వలేదని విమర్శించుకున్న రెండు పార్టీలు చివరి నిమిషంలో పొత్తు ధర్మాన్ని వీడాయి. నామినేషన్ల ఉపసంహరణ, బీ-ఫారాలు సమర్పించేందుకు ఆఖరి రోజైన గురువారం రెండు పార్టీలు తమకు బలమున్న చోట్ల అభ్యర్థులను పోటీకి నిలిపాయి. కూటమి పొత్తులో భాగంగా గ్రేటర్‌లోని 150 సీట్లలో టీడీపీ - 87, బీజేపీ- 63 వార్డులకు పోటీ చేయాలనుకున్న విషయం తెలిసిందే. గురువారం బీ-ఫారాలు అందించేందుకు చివరి రోజు గడువు కావడంతో చివరి నిమిషంలో బీజేపీకి కేటాయించిన సీట్లలో 5 చోట్ల తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చింది.
ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ నేతలు కూడా స్పందించారు. తమ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న టీడీపీ పోటీ చేస్తున్న ఐదు డివిజన్‌లలో తమ అభ్యర్థులను నిలిపి బీ-ఫారాలు అందజేశారు. దీంతో రెండు పార్టీల పొత్తు తొలిదశలోనే 10 చోట్ల విచ్ఛిన్నమైంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. టీడీపీ నగర నాయకుడి ఓవర్ యాక్షన్ కారణంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
టీడీ పీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 92 చోట్ల పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ఎన్నికల సంఘానికి వివరిస్తూ, తాజా జాబితాను అందజేశారు. చివరి నిమిషంలో టీడీపీ బీఫారాలు జారీ చేసిన స్థానాలు: అడిక్‌మెట్, అమీర్‌పేట, సుభాష్‌నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్ బీజేపీ బీఫారాలు ఇచ్చిన సీట్లు: హబ్సిగూడ, రెహమత్‌నగ ర్, బి.ఎన్.రెడ్డినగర్, పటాన్‌చెరు, జీడిమెట్ల