పండుగ సందడి | diwali special | Sakshi
Sakshi News home page

పండుగ సందడి

Published Sat, Nov 2 2013 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

పండుగ సందడి

పండుగ సందడి

 

పండుగ సందడి
 =అంతటా వెలుగుజిలుగులు
 =మార్కెట్ కిటకిట.. కళకళ
 =ధన్‌తేరస్ ధగధగలు
 =గుమ్మెత్తిన పూల అమ్మకాలు
 =టాప్‌లేపిన టపాసుల విక్రయాలు
 =కొంగొత్త ప్రమిదలతో వినూత్న కాంతులు

 
బంజారాహిల్స్/సనత్‌నగర్/మెహిదీపట్నం/నాంపల్లి, న్యూస్‌లైన్: వెలుగు జిలుగుల పండుగ సందడితో నగరం కళకళలాడుతోంది. శుక్రవారం వివిధ కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి. ఎటుచూసినా ధన్‌తే ‘రష్’.. మరోవైపు టపాసులు, పూలు, ప్రమిదల కొనుగోళ్లు తారస్థాయిలో జరిగాయి. అందరి కళ్లలో దీపావళి పర్వదిన కాంతులు వెల్లివిరిశాయి. ప్రత్యేకించి బంగారం దుకాణాలు వినియోగదారులతో నిండిపోయాయి. అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, అమీర్‌పేట, పంజగుట్ట తదితర ప్రాంతాల్లోని జ్యూవెలరీ షాపులు ఆభరణాల కొనుగోళ్ల కోసం వచ్చిన వారితో సందడిగా కనిపించాయి.

బంగారం ధర పెరిగినా కొనుగోలుదారుల్లో మాత్రం ఆసక్తి తగ్గలేదు. ఒక్క శుక్రవారం రోజే నగరంలోని 600 పైచిలుకు జ్యువెలర్స్‌లో  70 కిలోలకు పైగా బంగారు అభరణాల విక్రయం జరిగినట్లు ఆయా దుకాణాల రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా బంగారం ఆభరణాలకే గిరాకీ ఉందని బంజారాహిల్స్‌లోని శ్రీకృష్ణా జ్యువెలర్స్ మేనేజర్ రావు తెలిపారు. శుక్రవారం 22 క్యారెట్ల బంగారం రూ.30,700 పలికింది. ముత్యాలు, వజ్రాల ఆభరణాల విక్రయాలూ భారీ ఎత్తున జరిగాయి.
 
గుమ్మెత్తిన బంతిపూల అమ్మకాలు

దీపావళిని పురస్కరించుకుని నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున బంతిపూలు కొనుగోలు చేశారు. కొత్తపేట, మొజాంజాహి, గుడిమల్కాపూర్, సికింద్రాబాద్ మోండా తదితర మార్కెట్లు కిటకిటలాడాయి. శుక్రవారం ఉదయం నుంచే రైతులు మార్కెట్లకు బంతిపూలను తీసుకువచ్చారు. ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సాధారణంగా రూ.20 పలికే కిలో బంతిపూలు ఒక్కసారిగా రూ.60 నుంచి రూ.80కి పెరిగాయి. దీపావళికి దుకాణాలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ఇళ్లను అందంగా అలంకరించేందుకు బంతిపూల కు ఉండే డిమాండ్ ఇంతా అంతా కాదు. ప్రత్యేక పూజలకు బంతిపూలనే ఎక్కువగా వినియోగిస్తారు. మార్కెట్‌కు వచ్చిన పూలు వచ్చినట్లే  క్షణాల్లో అమ్ముడయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 100 టన్నుల పూల క్రయవిక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 
ప్రమిదలు, మిఠాయిల అమ్మకాలు...


ఇంటింటా వెలుగులను పంచుతూ కనువిందు చేసే ప్రమిదలు మార్కెట్‌ను ముంచెత్తాయి. వీటి కొనుగోలు కోసం మహిళలు పోటీపడ్డారు. విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో వ్యాపారులు వాటి ధరలకు రెక్కలు తొడిగారు. సాధారణంగా సైజును బట్టి జత ప్రమిదలు రూ.5 నుంచి రూ.10 ఉండగా శుక్రవారం ఏకంగా రూ.15 నుంచి రూ.20 పలికాయి. అలాగే స్టెప్స్ ప్రమిదలు రూ.30- రూ.50 మధ్య అమ్ముడయ్యాయి. ఇక మైనంతో నింపిన ప్రమిదలు అమ్మకాలూ జోరందుకున్నాయి.

వీటికి భిన్నంగా మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రమిదలు సైతం హాట్‌కేకులయ్యాయి. సనత్‌నగర్, బల్కంపేట, అమీర్‌పేట, బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట, పద్మారావునగర్ డివిజన్ల పరిధిల్లో ఏ రహదారి చూసినా ప్రమిదలు, లక్ష్మీపూజకు అవసరమైన పూలు, ఇతర సామగ్రి అమ్మకందారులు, కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ఇక, మిఠాయి దుకాణాల వద్దా కొనుగోలుదారులు బారులుతీరారు. ఆత్మీయులకు, కుటుంబసభ్యులకు స్వీట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలపడం ఈ పర్వదినం నాడు సంప్రదాయంగా వస్తోంది. అలాగే, బొమ్మల కొలువు నిమిత్తం అమ్మకానికి ఉంచిన విభిన్న ఆకృతుల్లోని బొమ్మలు కనువిందు చేశాయి.

 నింగిలోకి దూసుకెళ్తా..

 బాణసంచా అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బతుకమ్మకుంట, అంబర్‌పేట తదితర ప్రాంతాలతో పాటు, మినీ శివకాశీగా పేరొం దిన సనత్‌నగర్‌లో వందలాది దుకాణాలు వెలిశాయి.అన్ని షాపుల్లోనూ ఫ్యాన్సీ టపాసులే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విభిన్న రకాల టపాకాయలు మార్కెట్లో కొలువుదీరాయి. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌వీ పేరిట తయారు చేసిన రాకెట్టు అందరిని ఆకట్టుకుంటోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement