* విద్యుత్ నిలిపివేసిన బీఎంసీ
* జనరేటర్లతో నెట్టుకువస్తున్న కుటుంబాలు
సాక్షి, ముంబై : నగరంలోని అక్రమ ఫ్లాట్‌లకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విద్యుత్‌ను నిలిపి వేయడంతో ఆయా ప్రాంతాల వారు అంధకారంలోనే దీపావళిని జరుపుకోవాల్సి వచ్చింది. గత ఏడాది కూడా వీరు పండుగను జరుపుకోలేదు. వీరు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికి వారు ఖాళీ చేయకపోవడంతో బీఎంసీ వీరికి విద్యుత్ సరఫరాను నిలిపి వేసింది. దీంతో వీరు బ్లాక్ దీపావళిని జరుపుకున్నారు.
జీ/సౌత్ వార్డ్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి నివాసముంటున్న వారికి బీఎంసీ విద్యుత్‌ను నిలిపివేసింది. అయితే వీరు రాత్రి వేళ్లలో జనరేటర్లు, ఎమర్జెన్సీ లైట్లను ఉపయోగిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా మిడ్‌డౌన్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న విద్యా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సారి తాము దీపావళిని ఎమర్జెన్సీ లైట్లు ఉపయోగించి జరుపుకున్నామని విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా తాము దీపావళిని ఆనందంగా జరుపుకోలేదన్నారు. తమ ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు చెప్పడంతో తాము నిరుత్సాహానికి గురై ఆ రోజు ఆందోళనకు కూడా దిగామన్నారు.
దీంతో దీపావళిని జరుపుకోలేదన్నారు. కాగా, తాము చివరి అంతస్తులో ఉండడంతో వేడితాపం అంతగా తెలియడం లేదనీ, కానీ కింది అంతస్తులలో ఉంటున్నవారు మాత్రం వేడివల్ల ఉక్కపోతను భరించలేక పోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బీఎంసీ జీ/సౌత్ వార్డ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వీరు తమ ఇళ్లను అప్పగించే వరకు పరిస్థితి ఇలానే కొనసాగుతుందని స్పష్టంచేశారు. కాగా, అక్రమంగా నిర్మాణం చేపట్టిన దాదాపు 140 కుటుంబాలకు ఖాళీ చేయాల్సిందిగా బీఎంసీ గత ఏడాదే నోటీసులు జారీ చేసింది.
కరెంట్ ‘కట్’.. చీకట్లోనే దీపావళి..
Published Sun, Oct 26 2014 1:54 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement