- ఎండల జోరు... జనం బేజారు
- గరిష్టంగా 40.4, కనిష్టంగా 24.8 డిగ్రీలు నమోదు
- వడగాలులతో జనం విలవిల
మెదక్ టౌన్: ప్రచండ భానుడి ప్రతాపంతో జనం విల విల్లాడుతున్నారు. ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండకు భయపడి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. శుక్రవారం గరిష్టంగా 40.4 డిగ్రీలు, కనిష్టంగా 24.8 డిగ్రీల ఠమొదటిపేజీ తరువాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉపాధి కూలీలు, వరికోతలు కోసే శ్రామికులు ఉదయం 6 నుంచి 9 వరకు, రాత్రి 9 నుంచి 12గంటల పనులు చేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప గడప దాటడం లేదు. అలా బయటకు వచ్చే వారు గొడుగులు, క్యాప్‌లు, చున్నీలు, కండువాలు తలపై రక్షణగా ఉంచుకుంటున్నారు. ఉపశమనం పొందడానికి శీతల పానీయాలను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. మండుతున్న ఎండలతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల ఫారాల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటుచేసి షెడ్లపై గడ్డి కప్పి నీటితో తడుపుతున్నారు.
విద్యుత్ కోతల నుంచి ఉపశమనం పొందడానికి జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది దాతలు అక్కడక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాలతో ప్రయాణికులు దాహం తీర్చుకుంటున్నారు. మండుతున్న ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.